Vishnu Manchu: తిరుపతిలో 120 మంది అనాథలను దత్తత తీసుకున్న విష్ణు మంచు... విద్యావంతులను చేసే బాధ్యత కూడా!
Mathrusya Child Home Tirupati: మాతృశ్య అనాథాశ్రమంలో 125 మందిని దత్తత తీసుకున్న విషయాన్ని విష్ణు మంచు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా తిరుపతి వెళ్లిన ఆయన ఆ చిన్నారులతో కొంత సమయాన్ని గడిపారు.

కుడి చేతితో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదు అనుకునే మనస్తత్వం తనది అని, ఇవాళ ఈ విషయం చెప్పడం వెనుక మరో నలుగురు స్ఫూర్తి పొంది మంచి చేసే అవకాశం ఉంది కనుక తాను ఇలా మీడియా ముందుకు వచ్చానని కథానాయకుడు - విద్యావేత్త విష్ణు మంచు (Vishnu Manchu) తెలిపారు. తిరుపతిలోని 120 మంది అనాథ బాలలను ఆయన దత్తత తీసుకున్నారు.
విద్యావంతులను చేసే బాధ్యత కూడా!
తిరుపతిలో మాతృశ్య పేరుతో ఒక అనాథ ఆశ్రమం (Mathrusya Child Home) ఉంది. అక్కడ సుమారు 120 మందికి పైగా బాలలు ఉన్నారు. ఆ ఆశ్రమం నిర్వహణ బాధ్యతలను శ్రీదేవి చూస్తున్నారు. ఒక ప్రయాణంలో ఆవిడకు విష్ణు మంచు తారసపడ్డారు. తమ అనాథ ఆశ్రమంతో గురించి వివరించడంతో పాటు ఏదైనా సహాయం చేయాలని ఆవిడ కోరారు.
మాతృశ్య అనాథ ఆశ్రమం వివరాలు తెలుసుకున్న విష్ణు మంచు... 120 మందికి పైగా పిల్లల బాధ్యతను తీసుకున్నారు. భోజన, వసతి సదుపాయాలను కల్పించడం మాత్రమే కాదు... అప్పుడప్పుడు వాళ్లకు కొత్త దుస్తులు కొన్ని పంపిస్తున్నారు విష్ణు.
మాతృశ్య అనాథ ఆశ్రమంలోని చిన్నారులకు చదువు చెప్పించే బాధ్యతను సైతం తాను తీసుకున్నట్లు విష్ణు మంచు వివరించారు. తిరుపతిలోని విద్యానికేతన్ విద్యా సంస్థలతో పాటు మోహన్ బాబు యూనివర్సిటీ నిర్వాహణ బాధ్యతలు విష్ణు చూస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ సిటీలోనూ ఆయనకు కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి. కథానాయకుడిగా సినిమాలు చేయడం మాత్రమే కాదు... విద్యావేత్తగా రేపటి భావి పౌరులను తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు.
కుటుంబంతో మోహన్ బాబు భోగి వేడుకలు
తండ్రి మోహన్ బాబుతో పాటు విష్ణు కుటుంబం అంతా సంక్రాంతి వేడుకల కోసం చిత్తూరు వెళ్ళింది. మోహన్ బాబు యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన భోగి వేడుకలను మంచు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సినిమాల విషయానికి వస్తే 'కన్నప్ప'తో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నారు విష్ణు మంచు. ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వెళుతున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 25 ను ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: 'గేమ్ చేంజర్' మీద ఆ ముఠా గూడుపుఠాణి... 45 మందిపై సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్