చాలామంది హీరోహీరోయిన్లకు నటులుగా ఎంత స్టార్‌డమ్ వచ్చినా.. జీవితంలో ఒక్కసారైనా మైక్రోఫోన్ పట్టుకోవాలని, సినిమాను డైరెక్ట్ చేయాలని ఉంటుంది. ఇప్పటికే అలా ఎందరో నటీనటులు డైరెక్షన్ చేయాలన్నా తమ ఇష్టాన్ని బయటపెట్టారు. తాజాగా తమిళ నటుడు విశాల్ కూడా తాను ఎప్పటికైనా ఒక సినిమాను డైరెక్ట్ చేస్తానంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ప్రస్తుతం తన తరువాతి సినిమా ‘మార్క్ ఆంటోనీ’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న విశాల్.. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో తనకు డైరెక్ట్ చేయాలనుకుంటున్న మూవీలో హీరో గురించి కూడా బయటపెట్టాడు. దాంతో పాటు మరెన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.


లియో కోసం అయిదు రోజులు అడిగారు..
అధ్విక్ రవిచంద్రన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించిన చిత్రమే ‘మార్క్ ఆంటోనీ’. విశాల్ కెరీర్‌లోని ఇది భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది. ఈ శుక్రవారం ‘మార్క్ ఆంటోనీ’ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది. ఈ మూవీని ఎలాగైనా హిట్ చేయాలని విశాల్ విశ్వప్రయత్నాలు చేస్తూ.. ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. అలా తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు. ‘‘విజయ్‌తో కలిసి లియోలో నటించడానికి నాకు ఆఫర్ వచ్చింది. కానీ అది కుదరలేదు. నేనెప్పుడూ రెండు సినిమాలను ఒకేసారి చేయను. ఒకసారి ఒక సినిమాను మాత్రమే చేస్తాను. అందుకే నేను పూర్తి కమిట్మెంట్‌తో మార్క్ ఆంటోనీపైనే దృష్టిపెట్టాను. నేను అయిదు రోజులు సమయం ఇచ్చి మళ్లీ వెనక్కి వెళ్లడం లాంటిది జరగదు అని డైరెక్టర్‌తో చెప్పేశాను. ఒకవేళ ఇస్తే నా పూర్తి టైమ్ మీకే ఇవ్వాలి. పూర్తిగా మీకే సరెండర్ అవ్వాలి’’ అని విశాల్ తెలిపాడు.


కోవిడ్ సమయంలో కథ వినిపించాలనుకున్నా..
ఇప్పటికే పలుమార్లు విశాల్.. తనకు డైరెక్షన్ చేయాలని ఉందనే కోరికను బయటపెట్టాడు. ఇక తాజాగా తాను డైరెక్ట్ చేసే సినిమాలో హీరోగా ఎవరిని అనుకుంటున్నాడో రివీల్ చేశాడు. విజయ్‌ను డైరెక్ట్ చేయాలని ఉందని, ఆయనను డైరెక్ట్ చేయడం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపాడు. కోవిడ్ సమయంలో విజయ్ మ్యానేజర్‌కు ఫోన్ చేసి విజయ్‌కు స్క్రిప్ట్ వినిపించడానికి సమయాన్ని కూడా కేటాయించమని అడిగాడట విశాల్. కానీ తను స్క్రిప్ట్ విషయంలో ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధంగా లేకపోవడంతో మరికొన్నాళ్లు ఆగి, స్క్రిప్ట్ పూర్తిస్థాయిలో సిద్ధం చేసి, ఆ తర్వాత విజయ్‌ను కాంటాక్ట్ అవుదామని ఆగినట్టు విశాల్ చెప్పాడు. 


ఆల్రెడీ డైరెక్షన్‌కు సిద్ధం..
విశాల్.. ఇప్పటికే డైరెక్షన్ మీద ఇష్టంతో మొదటిసారి మైక్రోఫోన్ పట్టడానికి సిద్ధమయ్యాడు. ఇన్నాళ్లు ‘మార్క్ ఆంటోనీ’ చిత్రంతో బిజీగా ఉన్న ఈ హీరో.. త్వరలోనే ‘తుప్పరివాలన్ 2’తో డైరెక్టర్‌గా మారనున్నాడు. 2017లో విడుదలయిన ‘తుప్పరివాలన్’కు ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఆర్థుర్ కోనాన్ డోయిల్స్ నవలలో ఉన్న షెర్లాక్ హోమ్స్ పాత్ర ఆధారంగా ఈ సినిమాలోని హీరో క్యారెక్టర్ ఉంటుంది. చాలాకాలంగా ‘తుప్పరివాలన్ 2’ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్న విశాల్.. త్వరలోనే దాని షూటింగ్‌ను ప్రారంభించనున్నాడు. ఇక తాజాగా విడుదలయిన ‘మార్క్ ఆంటోనీ’ టైమ్ ట్రావెల్, పీరియడ్ డ్రామాగా తెరకెక్కింది. ఇందులో విశాల్‌కు జోడీగా రీతూ వర్మ, అభినయ హీరోయిన్లుగా నటించారు. 


Also Read: 'మార్క్ ఆంటోనీ' రివ్యూ : టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో విశాల్ సినిమా - ఎలా ఉందంటే?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial