Itlu Maredumilli Prajaneekam : ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్రం ద్వారా అడవుల్లో నివసించే గిరిజనులు సరైన వస్తువులు లేక పడుతున్న ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు చూపామని చిత్ర హీరో అల్లరి నరేష్ చెప్పారు. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ విశాఖ నగరంలోని ఓ హోటల్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. నాంది చిత్రం తర్వాత అంతటి గొప్ప క్యారెక్టర్ ఈ సినిమాలో చేశానన్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా నగరాల్లో ఎన్నో వసతులు ఉన్నా, అడవుల్లో నివసిస్తున్న గిరిజన ప్రజలకు సరైన వసతులు లేక నానా అవస్థలు పడుతున్నారన్నారు. రహదారులు, సరైన తిండి, వైద్యం, విద్య వంటి వసతులు లేక ఎండనక, వాననక కష్టపడుతూ ఎంతో దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు.
56 రోజుల్లో షూటింగ్
ఈ చిత్రంలో తను టీచర్ క్యారెక్టర్ చేశానని వృత్తిరీత్యా ఒక అడవిలోకి వెళ్తే అక్కడ ప్రజలు పడుతున్న బాధలు చూసి దానిపై ఎటువంటి పోరాటం చేశామనేది, ఎటువంటి మార్పు తీసుకొచ్చాం అనేది ఈ చిత్రంలో చూపమన్నారు హీరో నరేష్. 56 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశామని , ఈ చిత్రానికి ఎ.ఆర్.మోహన్ దర్శకత్వం వహించగా, రాజేంద్ర దొండ నిర్మాత గా వ్యవహరించారు అన్నారు. ఈ చిత్రం నవంబర్ 25న విడుదలవుతుందని, తప్పనిసరిగా విజయవంతం చేయాలని కోరారు. తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ అత్యద్భుతమైన హాస్యభరితమైన చిత్రాలు తీశారని ఆ ఒక్కటీ అడక్కు చిత్రం కొత్త కాన్సెప్ట్ తో భవిష్యత్తులో తీయాలని ఆలోచన ఉంది అన్నారు. తన తదుపరి చిత్రం ఉగ్రం అని నరేష్ చెప్పారు. హాస్యనటుడు ప్రవీణ్ మాట్లాడుతూ ఈ చిత్రం సందేశాత్మకంగా, అందర్నీ ఆలోచింపచేసే విధంగా ఉంటుందన్నారు. మారేడుమిల్లి అడవుల్లో షూట్ చేశామని ప్రతి ఒక్కరికి మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. నటుడు కుమ్నన్ (రమణ) మాట్లాడుతూ ఇందులో పెద్ద అనే క్యారెక్టర్ చేశామని సరిలేరు నీకెవ్వరు తర్వాత అంతటి గొప్ప క్యారెక్టర్ ఇందులో తనకు దక్కింది అన్నారు. ఈ సమావేశంలో నటుడు శ్రీతేజ్ పాల్గొని మాట్లాడారు.
నాంది హిట్ తర్వాత
తెలుగు సినిమా పరిశ్రమలో ఒకే రకమైన సక్సెస్ రేట్ కలిగి ఉన్న హీరో అల్లరి నరేష్. ఆయన నటించిన సినిమా ఫ్లాప్ కాదనే టాక్ ఉంది. అల్లరి నరేష్ మూవీ అంటే మినిమం గ్యారెంటీ అనే గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలో కామెడీ రోల్స్ ఎక్కువగా చేసిన అల్లరి నరేష్ ప్రస్తుతం డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తున్నాడు. మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలతో పాటు కథాబలం ఉన్న సినిమాలను ఏరికోరి సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ‘నాంది’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అల్లరి నరేష్.. తాజాగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే సినిమా చేస్తున్నాడు.
డిఫరెంట్ కథాంశం
ఇక నరేష్ గత సినిమా ‘నాంది’ మంచి విజయాన్ని అందుకుంది. నటుడిగా నరేష్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాలో అల్లరి నరేశ్ కు జోడీగా ఆనంది అలరించనుంది. 'జాంబీ రెడ్డి', 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాల ద్వారా ప్రేక్షకులను బాగా అలరించిన ఈ ముద్దుగుమ్మ అల్లరి నరేష్ తో మరోసారి ఆకట్టుకోబోతున్నది. వెన్నెల కిషోర్ సహా పలువురు నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకల సంగీతం అందించారు. హాస్య మూవీస్, జీ స్టూడియోస్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ కెరీర్ లో డిఫరెంట్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలుసుకోవాలంటే నవంబర్ 25 వరకు వేచి చూడాల్సిందే!