Vijay Deverakonda Pushpa Dialogue At Kingdom Trailer Launch Event: యంగ్ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా 'కింగ్‌డమ్' ట్రైలర్ ట్రెండింగ్ సృష్టిస్తోంది. తిరుపతిలో శనివారం జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో విజయ్‌తో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ, మూవీ టీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ యాసలో స్పీచ్, 'పుష్ప' డైలాగ్‌తో అదరగొట్టారు.
వెంకన్న సామి నా పక్కనుంటే...
హీరో విజయ్ రాయలసీమ యాసలోనే స్పీచ్ ప్రారంభించడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఎప్పట్లానే ఈ సినిమాను ప్రాణం పెట్టి చేశానని... మూవీ టీం అంతా ఎంతో కష్టపడినట్లు చెప్పారు. 'కింగ్‌డమ్ సినిమా గురించి ఆలోచిస్తున్నప్పుడు నా మనసులో ఒక్కటే అనిపించింది. తిరుపతి ఏడుకొండల వెంకన్న సామి గానీ ఈ ఒక్కసారి నా పక్కనుండి నడిపించినాడో సానా పెద్దోడినై పూడుస్తాను సామీ. పోయి టాప్‌లో కూర్చుంటా.' అంటూ పుష్ప డైలాగ్‌తో అభిమానుల్లో జోష్ నింపారు.
అప్పట్లో 'పుష్ప' రిలీజ్ సందర్భంగా బన్నీ తనదైన స్టైల్‌లో రాయలసీమ యాస డైలాగ్‌తో అదరగొట్టారు. 'ఈసారి గానీ తిరుపతి ఏడుకొండల వెంకన్న సామి నా వెనకుండి నన్ను బతికించనాడా... సామీ చానా పెద్దోడినై పూడుస్తాను సామీ.' అంటూ ఫ్యాన్స్‌లో జోష్ నింపారు. ఇప్పుడు అదే డైలాగ్‌ను విజయ్ రిపీట్ చేశారు. 'పుష్ప' స్థాయిలోనే భారీ హిట్ కొట్టాలంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఈ వీడియో వైరల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
ఆ రెండూ నాతో ఉంటే...
వెంకన్నసామి దయ, ఆడియన్స్ ఆశీస్సులు తనతో ఉంటే 'ఎవ్వరూ మనల్ని ఆపేదేలే' అని విజయ్ అన్నారు. 'ఎప్పట్లానే ఈ సినిమాను ప్రాణం పెట్టి చేశా. ఈసారి నా సినిమాని చూసుకోవడానికి చాలామంది ఉన్నారు. తన సంగీతంతో అనిరుధ్ అదరగొట్టారు. మూవీ టీం అంతా ఎంతో శ్రమించారు. ఇప్పటికీ శ్రమిస్తూనే ఉన్నారు.' అంటూ చెప్పారు.
ఈ మూవీ ఓ క్లాసిక్ మాస్ అని... చూసిన ప్రతీ ఒక్కరూ ప్రేమలో పడతారని హీరోయిన్ భాగ్యశ్రీ తెలిపారు. విజయ్ సినిమా కోసం పడే తపన ఎంతో స్ఫూర్తి ఇస్తుందని చెప్పారు. తెలుగు ఆడియన్స్‌కు ఓ డిఫరెంట్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామాని చూపించబోతున్నట్లు నిర్మాత నాగవంశీ తెలిపారు. 'విజయ్ విషయంలో గత కొన్నేళ్లుగా ఏమేం మిస్ అయ్యారో అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ఎలాంటి తప్పు జరగకూడదని నేను, గౌతమ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని పని చేశాం. ప్రేక్షకులు థియేటర్స్‌కు వచ్చి సినిమాలు చూడాలి.' అని అన్నారు.
ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా... శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 31న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.