Vijay Deverakonda Reaction On Kingdom Movie Success: యంగ్ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్డమ్' బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా... విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. సినిమా విజయం సాధించడంతో మూవీ టీం హర్షం వ్యక్తం చేస్తోంది. 'మనం హిట్ కొట్టినం' అంటూ ఆడియన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తుండడంపై విజయ్ ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఇంతటి రెస్పాన్స్ ఊహించలేదు
'కింగ్డమ్' మూవీకి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో విశేష స్పందన లభిస్తుందని విజయ్ అన్నారు. 'మలయాళంలో ఈ స్థాయి స్పందన ఊహించలేదు. మలయాళ వెర్షన్ విడుదల చేయకపోయినా.. అక్కడి ప్రేక్షకులు ఇంతటి ప్రేమ చూపించడం చాలా ఆనందంగా ఉంది. సినిమా హిట్ అయితే ఆనందం కంటే కూడా మరిన్ని మంచి సినిమాలు చేయాలనే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. కింగ్‌డమ్ రిలీజ్‌కు ముందు చాలా ఒత్తిడి ఉంది. ఎప్పుడైతే మొదటి షో పూర్తై, పాజిటివ్ టాక్ వచ్చిందో.. అప్పుడు చాలా సంతోషం కలిగింది.' అని తెలిపారు.
యాక్షన్... బలమైన ఎమోషన్
డైరెక్టర్ గౌతమ్ ఫ్యామిలీ రిలేషన్స్, ఎమోషన్స్ డీల్ చేసే విధానం తనకు చాలా ఇష్టమని అన్నారు విజయ్. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామా అనే ఐడియా ఆయన చెప్పినప్పుడు తనకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందని తెలిపారు. 'గౌతమ్‌కి ప్రతి విషయం మీద పట్టు ఉంది. హీరో పాత్ర, షాట్ కంపోజిషన్, మ్యూజిక్ ఇలా ప్రతి దాని మీద ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. కింగ్‌డమ్ కోసం ఆసక్తికర కథనం రాశాడు. ఇందులో ఏదో యాక్షన్ సీన్ పెట్టాలి కదా అన్నట్టు ఎక్కడా పెట్టలేదు. దాని చుట్టూ బలమైన ఎమోషన్ ఉండేలా చూసుకున్నాడు.' అంటూ వెల్లడించారు.
ఎన్టీఆర్ కోసం
'కింగ్డమ్' మూవీకి తొలుత 'నాగ దేవర' అనే టైటిల్ అనుకున్నామని... అయితే ఎన్టీఆర్ 'దేవర' కోసం ఆ టైటిల్ వదులుకున్నామని విజయ్ తెలిపారు.
Also Read: నేషనల్ అవార్డ్ ఫిల్మ్స్ - 'భగవంత్ కేసరి' నుంచి '12th ఫెయిల్' వరకూ ఈ ఓటీటీల్లో చూసేయండి
సీక్వెల్‌పై...
ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే రెండో పార్ట్ ఇంకా అద్భుతంగా ఉండబోతోందని విజయ్ తెలిపారు. 'కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. అన్నదమ్ముల అనుబంధం, దేశభక్తి, ఓ తెగకు చెందిన నాయకుడు... ఇలా ఇన్ని అంశాలను ఒకే భాగంలో చెప్పడం సాధ్యం కాదు. అందుకే రెండు భాగాలుగా చెప్పాలని నిర్ణయించుకున్నాము. తన అన్నయ్య శివ కోసం సూరి చేసిన ప్రయాణాన్ని మొదటి భాగంలో చూశాం. రెండో భాగానికి సంబంధించి గౌతమ్ దగ్గర గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి. కచ్చితంగా ఓ స్టార్ హీరో అయితే సీక్వెల్‌లో ఉంటాడు. అది ఎవరనేది గౌతమ్‌కే తెలుసు.
మూవీలో లుక్ పరంగా మరింత దృఢంగా కనిపించే ప్రయత్నం చేశాను. ఓ నటుడిగా ఎప్పుడూ ఫిట్‌గా ఉండటానికి ఇష్టపడతాను. అయితే ఇందులో అన్నయ్యని తిరిగి తీసుకురావడం కోసం ఆ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టే సమయంలో బల్క్‌గా కనిపించాలనే ఉద్దేశంతో దాదాపు 6 నెలలు ప్రత్యేక కసరత్తులు చేశాను. మనం హిట్ కొట్టినం అంటూ కాంప్లిమెంట్స్ వస్తుంటే చాలా ఆనందంగా ఉంది' అని అన్నారు.
సుకుమార్‌తో మూవీపై
మూవీ చూసి డైరెక్టర్ సుకుమార్ తనను ప్రశంసించారని... అది తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని విజయ్ తెలిపారు. 'అర్జున్ రెడ్డి టైం నుంచే నేను, సుకుమార్ గారు కలిసి సినిమా చేయాలనుకుంటున్నాం. ఆయనకు కూడా నేనంటే ఇష్టం. భవిష్యత్‌లో మా కలయికలో సినిమా వస్తుందని ఆశిస్తున్నా. ప్రస్తుతం అయితే నా దృష్టి అంతా నా చేతిలో ఉన్న సినిమాలపైనే ఉంది. నెక్స్ట్ మూవీ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో చేస్తున్నా. ఫస్ట్ టైం రాయలసీమ నేపథ్యంలో మూవీ చేస్తున్నా. ఆ తర్వాత రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నా. ఆంధ్రా నేపథ్యంలో సరికొత్త కథతో ఆ చిత్రం ఉంటుంది.' అని తెలిపారు.