Family Star Teaser: జనవరి, ఫిబ్రవరీలో సినిమాల సందడి ముగిసింది. వచ్చే రెండు నెలల్లో పెద్దగా ప్రేక్షకులు ఎగ్జైట్ చేసే సినిమాలు ఏవీ వారి ముందు రావడం లేదు. దీంతో రౌడీ హీరో విజయ్ దేవరకొండకు లైన్ క్లియర్ అయ్యింది. ఏప్రిల్ 5న విజయ్ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో ప్రమోషన్స్ కార్యక్రమాలను నెల ముందే ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల ‘టీజర్ వస్తుంది’ అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ చేసిన రెండు రోజుల్లోనే ‘ఫ్యామిలీ స్టార్’ టీజర్ అప్డేట్‌తో ఫ్యాన్స్‌ను సంతోషపెట్టాడు.


మరో కొత్త పోస్టర్..


పరశురామ్‌తో విజయ్ దేవరకొండ రెండోసారి చేతులు కలిపి చేస్తున్న చిత్రమే ‘ఫ్యామిలీ స్టార్’. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో ‘గీతా గోవిందం’లాంటి హిట్ వచ్చింది. ఇక ‘ఫ్యామిలీ స్టార్’ కూడా అదే రేంజ్‌లో హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మార్చి 4న సాయంత్రం 6.30 గంటలకు ఈ మూవీ టీజర్ విడుదల అవుతుందని విజయ్ దేవరకొండ ఒక పోస్టర్‌తో ప్రకటించాడు. ఇప్పటికీ ‘ఫ్యామిలీ స్టార్’ నుండి ఎన్నో పోస్టర్లు విడుదలయ్యాయి. వాటితో పాటు ఒక గ్లింప్స్ కూడా చాలాకాలం క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తాజాగా సిడ్ శ్రీరామ్ పాడిన ‘నంద నందనా’ అనే పాట కూడా మ్యూజిక్ లవర్స్‌ను బాగా ఆకట్టుకుంది. దీంతో టీజర్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుల సంఖ్య పెరిగిపోయింది.






ఆశలన్నీ ‘ఫ్యామిలీ స్టార్’పైనే..


తన రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి ‘ఖుషి’ అనే ప్రేమకథతో చివరిగా ప్రేక్షకులను పలకరించాడు విజయ్ దేవరకొండ. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సమంతతో జోడీకట్టాడు విజయ్. సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్నారనే అంశం చాలామంది ఆడియన్స్‌ను ఎగ్జైట్ చేసింది. అందుకే ఈ మూవీని థియేటర్లలో చూడడానికి బయల్దేరారు. కానీ ‘ఖుషి’కి అంతగా పాజిటివ్ టాక్ లభించలేదు. మిక్స్‌డ్ టాక్‌తో యావరేజ్ హిట్‌గా నిలిచింది. ‘లైగర్’ వల్ల విజయ్ దేవరకొండ తిన్న ఎదురుదెబ్బను ‘ఖుషి’ కవర్ చేయలేకపోయింది. అందుకే తన ఆశలన్నీ ‘ఫ్యామిలీ స్టార్’పైనే ఉన్నాయి.


మృణాల్ కోసం ఎదురుచూపులు..


‘ఫ్యామిలీ స్టార్’ కోసం మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ మొదటిసారి కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే మృణాల్ స్టోరీ సెలక్షన్‌కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ‘సీతారామం’లో సీతగా, ‘హాయ్ నాన్న’లో యశ్నగా పక్కింటమ్మాయి పాత్రల్లోనే కనిపించి అలరించింది ఈ భామ. ఇక ‘ఫ్యామిలీ స్టార్’లో కూడా తన పాత్ర మిడిల్ క్లాస్ అమ్మాయిలకు కనెక్ట్ అయ్యేలా ఉంటుందని గ్లింప్స్, పాట చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికీ ఈ మూవీలో విజయ్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో గ్లింప్స్ ద్వారా కాస్త ఐడియా వచ్చినా.. మృణాల్ క్యారెక్టరైజేషన్ గురించి మాత్రం దర్శకుడు ఎక్కువగా రివీల్ చేయలేదు. అందుకే టీజర్‌లో మృణాల్‌ను చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.


Also Read: విశ్వక్‌ సేన్‌ మరో సాహసం - కమల్‌ హాసన్‌, రాజేంద్రప్రసాద్‌ తరహాలో ప్రమోగం, మరి వారిలా మెప్పించగలడా?