విజయ్ ఆంటోని అంటే ప్రయోగాలకు మారుపేరు. 2016లో తమిళంలో ‘పిచ్చైక్కరన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. ఊహించని విజయం అందుకున్నాడు. సినీ చరిత్రలో ఎవరూ చేయని సాహసంతో మెప్పించాడు. ఇదే మూవీని తెలుగులో ‘బిచ్చగాడు’ టైటిల్‌తో విడుదల చేశాడు. ఆ టైటిల్ చూసి మొదట్లో అంతా నోరెళ్లబెట్టారు. సినిమా చూసి వచ్చిన తర్వాత విజయ్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఇప్పుడు అదే మూవీకి సీక్వెల్ వస్తోంది. అదే ‘బిచ్చగాడు-2’. 


‘బిచ్చగాడు’ మూవీకి శశీ దర్శకత్వం వహించారు. అయితే, ‘బిచ్చగాడు-2’కు ప్రియ కృష్ణస్వామి దర్శకత్వం వహించాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో హీరో విజయ్ ఆంటోనీనే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. యాక్షన్ సన్నివేశాలను సైతం డూప్ లేకుండా ఆయన స్వయంగా చేశారు. ఇటీవల మలేషియాలో చిత్రీకరిస్తున్న ఓ యాక్షన్ సన్నివేశంలో విజయ్ ఆంటోని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. గాయాల నుంచి కోలుకున్న విజయ్.. ప్రస్తుతం ఈ మూవీని ప్రమోట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా ‘బిచ్చగాడు-2’ రిలీజ్ తేదీని ప్రకటించాడు.






విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పోరేషన్ బ్యానర్‌ పై ఆయనే స్వయంగా ఈ సినిమాను నిర్మించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు విజయ్ సోమవారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఈ సినిమాను ఏకకాలంలో తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కూడా స్టార్ నెట్వర్క్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. 


Also Read: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు, సీరిస్‌లు ఇవే!


ఇటీవల ఈ మూవీ నుంచి ‘స్నీక్ పీక్ ట్రైలర్’ను విడుదల చేశారు. ఇందులో ఈ సినిమా కాన్సెప్ట్‌ను రివీల్ చేశారు. సినిమాలోని మొదటి నాలుగు నిమిషాల సీన్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. రక్తం, శరీరంలోని ఇతర అవయవాలు మార్చినట్లు మెదడును కూడా ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే ప్రపంచానికి ఎంతో మేలు జరుగుతుందని ఒక శాస్త్రవేత్త ఈ ట్రైలర్‌లో చెబుతారు. ఆయనకు ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటారు. ఐజక్ న్యూటన్, మహాత్మా గాంధీ, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వంటి మేధావులను మరింత ఎక్కువ కాలం బతికించవచ్చని శాస్త్రవేత్త తెలుపుతారు. మంచి వాళ్లు ఎక్కువ కాలం బతికితే ఓకే, హిట్లర్ వంటి చెడ్డవారు, నియంతలు ఎక్కువ కాలం బతికితే ప్రజలకు నష్టం కదా అని ఎదురుగా కూర్చుని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి అంటారు. ఈ ఇంటర్వ్యూ మొత్తాన్ని దేవ్ గిల్ (మగధీర సినిమాలో విలన్) ఇంట్లో కూర్చుని చూస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ట్రైలర్‌ను క్లోజ్ చేశారు. ట్రైలర్‌లో విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఖర్చుకు వెనకాడకుండా ఒక పెద్ద హీరో సినిమా మీద పెట్టినంత ఖర్చు ఈ సినిమా మీద పెట్టినట్లు విజువల్స్ చూసి చెప్పేయవచ్చు. లావిష్ బిల్డింగ్‌లు, ఫారిన్ లొకేషన్లతో చూడటానికి విజువల్ ట్రీట్‌లా ఉంది. 2023 సమ్మర్ సీజన్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.