Vijay Antony Toofan Trailer Out Now: ఒక సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా.. ఆ రిజల్ట్‌ను పెద్దగా పట్టించుకోకుండా తరువాతి ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ చేస్తారు కొందరు హీరోలు. కోలీవుడ్‌లోని అలాంటి హీరోల్లో విజయ్ ఆంటోనీ కూడా ఒకరు. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ కనీసం ఏడాదికి మూడు చిత్రాలు అయినా విడుదల చేస్తుంటారు ఈ హీరో. అంతే కాకుండా తను చేసే ఒక కాన్సెప్ట్‌కు మరొక కాన్సెప్ట్‌కు సంబంధం ఉండదు. అలాగే తాజాగా ‘తుఫాన్’ అనే మూవీతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు విజయ్ ఆంటోనీ. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదలయ్యింది.


ఎవ్వరికీ తెలియకూడదు..


తమిళంలో ‘మరయ్ పిడిక్కత్త మనిథన్’గా తెరకెక్కిన ఈ మూవీని తెలుగులో ‘తుఫాన్’గా విడుదల చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తమిళ ట్రైలర్‌తో పాటు తెలుగు ట్రైలర్ కూడా విడుదలయ్యింది. ‘తుఫాన్’ ట్రైలర్.. ఒక పాత పాటతో మొదలవుతుంది. శరత్ కుమార్, విజయ్ ఆంటోనీ కలిసి ఒక బోట్ నుండి దిగుతారు. విజయ్ ఆంటోనీ దాచుకున్న బ్లేడ్‌ను శరత్ కుమార్ పడేస్తారు. ‘‘ఈ ఊరిలో ఎవరికీ నువ్వు తెలీదు. నువ్వు ఎవరికీ తెలియకూడదు’’ అనే డైలాగ్‌తో విజయ్ ఆంటోనీ గతాన్ని మర్చిపోయాడని స్పష్టంగా అర్థమవుతుంది. అలా ఎవరూ తెలియని ఊరిలో విజయ్ ఆంటోనీకి ఒక కుక్కపిల్ల దొరుకుతుంది.


ముగ్గురి పరిచయం..


ఆ ఊరిలోనే విజయ్ ఆంటోనీకి శరణ్య పొన్వన్న, పృథ్వి అంబార్, మేఘా ఆకాశ్ పరిచయం అవుతారు. కానీ వారికి కూడా తను ఎవరు, ఎక్కడ నుండి వచ్చాడు అనే వివరాలు తెలియవు. ఫ్రెండ్‌గా విజయ్ ఆంటోనీకి పృథ్వి దగ్గరవుతాడు. శరణ్య కూడా తనను తల్లిలాగా చూసుకుంటుంది. ‘‘ఎవరి గురించి ఎవరికి పూర్తిగా తెలుసు? ఒకరి గురించి ఇంకొకరు తెలుసుకునే ప్రయత్నంలోనే కదా ఈ ప్రపంచం అంతా తిరుగుతుంది’’ అని చెప్పి విజయ్ ఆంటోనీకి ధైర్యం చెప్తుంది. అప్పుడే పోలీస్ ఆఫీసర్ పాత్రలో మురళీ శర్మ ఇంట్రడక్షన్ జరుగుతుంది. అప్పుడే పృథ్వికి ఏదో సమస్య ఎదురవుతుందని ట్రైలర్‌లో చూపించారు. తాను ఎక్కడ ఉన్నాడో విజయ్ ఆంటోనీకి తెలియడం కోసం తన షూను ఒక దగ్గర వదిలేస్తాడు పృథ్వి.


వాళ్లే దేవుళ్లు..


మేఘా ఆకాశ్ జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. ‘‘పూజించాను.. దేవుడికి వినపడలేదు. కంప్లైంట్ ఇచ్చాను.. పోలీసులు పట్టించుకోలేదు’’ అంటూ తన సమస్య గురించి చెప్తుంది. కానీ ఆ సమస్య ఏంటని ట్రైలర్‌లో రివీల్ చేయలేదు. ‘‘ఎలాంటి కారణం లేకుండా, ఏమీ ఆశించకుండా, ఎదుటివాళ్లకు మంచి జరగాలని కోరుకునే మనసే దేవుడంటే. అలాంటి మంచి మనుషులకు ఏమైనా సమస్య వస్తే ఎలా చూస్తూ ఊరుకునేది’’ అంటూ శరత్ కుమార్‌తో విజయ్ ఆంటోనీ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ మరో మలుపు తిరుగుతుంది. తనకు సాయం చేసిన ముగ్గురికి తాను కూడా తిరిగి సాయం చేయాలని విజయ్ ఆంటోనీ నిర్ణయించుకుంటాడు. అలా ‘తుఫాన్’ ట్రైలర్ మొత్తం ఆసక్తికరంగా సాగేలా చేశాడు దర్శకుడు విజయ్ మిల్టన్.



Also Read: ‘కల్కి 2898 AD’పై స్పందించిన విజయ్ దేవరకొండ - తన ఇన్‌స్టాగ్రామ్ డీపీని సైతం మార్చేసిన రౌడీ బాయ్