Vignesh Shivan : లేడీ సూపర్ స్టార్ నయనతార దంపతులు ఇటీవల కాలంలో వరుసగా వివాదలతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నయనతార భర్త, దర్శకుడు విగ్నేష్ శివన్ ఓ రెస్టారెంట్ ను కొనాలనుకున్నారని, కానీ అది ప్రభుత్వ ఆస్తి అంటూ ఓ మంత్రి దానిని అమ్మడానికి నిరాకరించారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఆ వార్తలపై విగ్నేష్ శివన్ స్పందిస్తూ అసలేం జరిగిందో వెల్లడించారు.
క్లారిటీ ఇచ్చిన విగ్నేష్ శివన్
పుదుచ్చేరి బీచ్ రోడ్ లోని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రెస్టారెంట్ సీగల్స్ ను దర్శకుడు విగ్నేష్ శివన్ కొనాలనుకున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ విగ్నేష్ శివన్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అసలు విషయాన్ని వివరించారు. ప్రస్తుతం పుదుచ్చేరి బీచ్ రోడ్డులో నడుస్తున్న సీగల్స్ రెస్టారెంట్లో చాలామంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అయితే ఈ రెస్టారెంట్ ను కొంటానని విగ్నేష్ శివన్ అడిగారని, దానికి పుదుచ్చేరి టూరిజం శాఖ మంత్రి లక్ష్మీనారాయణ ఒక్కసారిగా షాక్ అయ్యి, ఇది ప్రభుత్వ ఆస్తి అని సమాధానం చెప్పారనేది ఆ రూమర్ల సారాంశం. అలాగే కాంట్రాక్టు ప్రాతిపదికన కూడా వాటిని ఆయనకు ఇవ్వడానికి మంత్రి నిరాకరించాలని ఇటీవల వార్తలు వచ్చాయి.
దర్శకుడు విగ్నేష్ శివన్ ఈ విషయం గురించి క్లారిటీ ఇస్తూ పోస్ట్ చేశారు. అందులో "పాండిచ్చేరిలోని ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను అని జరుగుతున్న ప్రచారం అర్థం లేనిది. నేను నా సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ షూటింగ్ పర్మిషన్ కోసం పాండిచ్చేరి ఎయిర్ పోర్ట్ కు వెళ్ళాను. అక్కడ ముఖ్యమంత్రిని, పర్యాటక శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశాను. కరెక్ట్ గా అదే టైంకి అక్కడికి వచ్చిన లోకల్ మేనేజర్ అనుకోకుండా నా మీటింగ్ తర్వాత ఆయనను ఏదో అడిగారు. అది పొరపాటున నాకు లింక్ చేశారు. ఎటువంటి అర్థం లేకుండా సృష్టించే మీమ్స్, జోక్స్ ఫన్నీగా ఉంటాయి. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను" అంటూ తను పుదుచ్చేరి రెస్టారెంట్ కొనడం గురించి వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని వెల్లడించారు.
ధనుష్ తో వివాదం
ఇక మరోవైపు ధనుష్ - నయనతార వివాదం కొనసాగుతోంది. నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన 'నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే డాక్యుమెంటరీలో 'నేను రౌడీనే' సినిమాకు సంబంధించిన క్లిప్ ను వాడుకోవడం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇటు నయనతార, అటు ధనుష్ ఇద్దరూ లీగల్ గా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రూ.10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ ధనుష్ నయనతారకు నోటీసులు పంపించారు. ఇటీవలే ఈ కేసు విచారణకు రాగా, నయనతార, విగ్నేష్ శివన్, నెట్ ఫ్లిక్స్ వివరణ ఇవ్వాలంటూ కోర్టు ఆదేశించింది. కానీ మరోవైపు నయనతార టీం మాత్రం అవి అసలు సినిమాకు సంబంధించిన సీన్స్ కాదు, బీటీఎస్ సీన్స్ అంటూ చెప్తోంది. మరి ఈ వివాదానికి ఎండ్ కార్డ్ ఎక్కడ పడుతుందో చూడాలి.
Also Read: 50 షోలు వేస్తే 5000 టికెట్లు కూడా తెగలేదు... సిద్ధూను దెబ్బ కొట్టిన అల్లు అర్జున్ అరెస్ట్