అల్లు అర్జున్ పై విక్కీ కౌశల్ ప్రశంసలు


తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర పురస్కారాలపై బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవార్డుల విషయంలో జ్యూరీ మెంబర్స్ నిర్ణయం చాలా అద్భుతంగా ఉంటుందని వెల్లడించారు. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే అవార్డులను ప్రకటించారని చెప్పుకొచ్చారు. ‘పుష్ప: ది రైజ్‌’ సినిమాకు  గాను ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికైన టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌ ను ఆయన అభినందించారు. ఈ చిత్రంలో  అర్జున్‌ అద్భుతంగా నటించారని ప్రశంసలు కురిపించారు.సౌత్ స్టార్ ను జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపిక చేయడం ద్వారా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ గొప్ప నిర్ణయం తీసుకుందని విక్కీ కౌశల్ అభిప్రాయపడ్డారు.  


'సర్దార్ ఉద్దమ్'కు 5 జాతీయ అవార్డులు


ఇక 69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో విక్కీ కౌశల్ హీరోగా నటించిన 'సర్దార్ ఉద్దమ్' ఉత్తమ హిందీ చిత్రం, ఉత్తమ ఛాయాగ్రహణం, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ ఆడియోగ్రఫీ: రీ-రికార్డింగ్ (ఫైనల్ మిక్సింగ్) విభాగాల్లో ఐదు అవార్డును గెలుచుకుంది. అయితే, ఈసారి ఉత్తమ నటుడిగా అవార్డు వస్తుందని భావించినా, ఆయనకు రాలేదు. అయినప్పటికీ నిరాశచెందడం లేదన్నారు. 2019లో వచ్చిన ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' సినిమాలో అద్భుత నటనకు గాను ఇప్పటికే ఆయన జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. 'సర్దార్ ఉద్దమ్' చిత్రానికి సరైన గౌరవం వచ్చిందని అనుకుంటున్నారా? అన్న ప్రశ్నకు కౌశల్ ఆసక్తికర సమాధానం చెప్పారు. ఈ చిత్రంలో దర్శకుడు సర్కార్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు.  ఈ సినిమా ఐదు అవార్డులు గెలుచుకోవడం అద్భుతమైన అనుభూతిని కలిగించిందన్నారు కౌశల్.


69 ఏండ్లలో తొలిసారి తెలుగు హీరోకి ఉత్తమ నటుడి అవార్డు


జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్‌ చరిత్ర సృష్టించారు. 69 ఏండ్లలో మొదటిసారి తెలుగు హీరోకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వరించింది. ఇదే సినిమాకిగాను ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీశ్రీ ప్రసాద్‌ అవార్డుకు ఎంపిక అయ్యారు. ‘పుష్ప: ది రైజ్‌’ సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్‌’ రూపొందుతోంది. ఈ యాక్షన్-థ్రిల్లర్ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. ‘పుష్ప 2’లో రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, ధనుంజయ, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక 'పుష్ప1'కి ప్రపంచ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ రావడంతో 'పుష్ప 2'ను భారత్ తో పాటు పలు దేశాల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.


Read Also: డిలీటెడ్ సీన్లతో ‘జవాన్’ ఓటీటీ విడుదల, అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన దర్శకుడు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial