Varalaxmi Sarathkumar meets Rajinikanth: నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి పనులు షురూ అయ్యాయి. వరలక్ష్మి శరత్ త్వరలోనే పెళ్లీ పీటలు ఎక్కబోతోన్న సంగతి తెలిసిందే. తన ప్రియుడు నికోలయ్ సచ్‌దేవ్‌తో ఏడడుగులు వేయబోతున్నారు. జూలై 2న వీరి పెళ్లికి ముహుర్తం ఖరారైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పెళ్లి తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో అందరికి ఆహ్వానాలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో సినీ ప్రముఖుల ఇంటికి స్వయంగా వెళ్లి పెళ్లి పత్రికలు ఇచ్చి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా శరత్ కుమార్ కుటుంబ సమేతంగా సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ ఇంటికి వెళ్లి ఆయనను ఆహ్వానించారు.
ఈ సందర్భంగా దిగిన ఫోటోలను వరలక్ష్మి శరత్ కుమార్ తన ట్విటర్‌లో షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చింది. "మన తలైవర్ సూపర్ స్టార్ రజనీకాంత్ సర్‌ని లతా ఆంటీని కలిసి నా పెళ్లికి ఆహ్వానించాను. మీరు ఎల్లప్పుడు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతకు కృతజ్ఞురాలిని సర్. ఎప్పటిలాగే ఐశ్వర్య ఎంతో ప్రేమగా మాట్లాడావు" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ సందర్భంగా వరలక్ష్మితో పాటు ఆమె తండ్రి శరత్ కుమార్, ఆయన సతీమణి, నటి రాధిక శరత్ కుమార్, ఆమె కూతురు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల తన ప్రియుడు నికోలయ్ సచ్‌దేవ్‌ని సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చింది. ముందుగా ఎలాంటి ప్రకటన లేకుండ సడెన్‌గా ఆమె ఎంగేజ్‌మెంట్ చేసుకోవడంతో అంతా షాక్ అయ్యారు. నికోలయ్ సచ్‌దేవ్ తన చిన్ననాటి స్నేహితుడని, కొంతకాలంగా ప్రేమించుకున్న వారు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మార్చి 1న కేవలం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి జూలై 2న థాయ్‌లాండ్ జరగనుందని సమాచారం. అయితే నికోలయ్ సచ్‌దేవ్‌కు ఇదివరకే పెళ్లయ్యింది. గతంలో కవిత అనే ఓ మోడల్‌ని పెళ్లి చేసుకున్న అతడికి 15 ఏళ్ల కూతురు కూడా ఉంది. నికోలయ్ సచ్‌దేవ్ కూతురు కష సచ్‌దేవ్ పవర్ లిఫ్టింగ్‌లో నేషనల్ వైడ్ పతకాలు కూడా సాధించింది. అయితే కొన్నేళ్ల క్రితమే నికొలయ్-కవితకు డైవోర్స్ అయ్యాయట. ఆమె విడాకులు తీసుకుని విడిపోయిన అనంతరం వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమలో పడి ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు.
వరలక్ష్మి సినిమాల విషయానికి వస్తే
ప్రస్తుతం లేడీ విలన్‌గా సౌత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి హీరోయిన్‌గా సినీరంగ ప్రవేశం చేసింది.నటుడు శరత్ కుమార్ నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె 'పొడా పొడి' సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. అలా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించిన ఆమె సహానటి పాత్రలు కూడా చేసింది. ఈ క్రమంలో సినిమాలకు కొంత గ్యాప్ తీసుకున్న ఆమె తెనాలి రామకృష్ణ ఎల్‌ఎల్‌బీ సినిమాతో తెలుగులో లేడీ విలన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'జాంబి రెడ్డి', 'నాంది', 'యశోద', 'వీరసింహా రెడ్డి' వంటి సినిమాల్లో విలన్ నటించిన తెలుగు ఆడియన్స్‌కి దగ్గరైంది. రీసెంట్‌గా బ్లాక్‌బస్టర్ మూవీ హనుమాన్‌లో అక్క పాత్రలో కనిపించి ఆకట్టుకుంటుంది.