కన్నడ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'యూఐ'. ఈ సినిమాలో ఉపేంద్ర హీరోగా నటిస్తుండగా, రీష్మా నానయ్య హీరోయిన్ గా కన్పించబోతోంది. లహరి ఫిలిమ్స్, వెనస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై కేపీ శ్రీకాంత్, మనోహరన్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. 'యూఐ' మూవీ కన్నడ, తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డిసెంబర్ 20న భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే 'యూఐ' సినిమాకు ఒక్కో థియేటర్లో, ఒక్కో క్లైమాక్స్ ఉంటుందని ప్రచారం జోరందుకుంది. తాజాగా ఉపేంద్ర ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
ఒక్కో థియేటర్లో ఒక్కో క్లైమాక్స్...
ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'యూఐ' మూవీ గురించి కన్నడ స్టార్ ఉపేంద్ర అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఉప్పి అంటేనే ఎంత డిఫరెంట్ సినిమాలు చేస్తాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు 'యూఐ' కూడా అలాగే సరికొత్తగా ఉండబోతుందని, ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ చూశాక ఫిక్స్ అయిపోయారు. అయితే 'యూఐ' సినిమాకు రెండు క్లైమాక్స్ లు ఉంటాయనే పుకార్లు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. ఒక్కో థియేటర్లో ఒక్కో క్లైమాక్స్ ని ప్రదర్శించబోతున్నారని టాక్ నడుస్తోంది. దీంతో ఉపేంద్ర అంటేనే కొత్త కోణానికి మారుపేరు. కాబట్టి ఇలాంటి క్లైమాక్స్ ఉన్నా ఉంటుందిలే అని నమ్మేశారు చాలామంది.
తాజాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఉపేంద్ర ఈ విషయంపై స్పందిస్తూ అవన్నీ పుకార్లని కొట్టి పారేశారు. రెండు క్లైమాక్స్ లు ఉంటాయనే వార్తల్లో నిజం లేదు. సినిమాలో ఒకే ఒక్క క్లైమాక్స్ ఉంటుంది. అయితే కంటెంట్ బాగుంటుంది కాబట్టి సినిమాను ఒకటికి రెండు సార్లు చూడాలి అనిపిస్తుంది అంటూ తనదైన స్టైల్ లో రిప్లై ఇచ్చారు. ఇక రామాయణం గురించి ఆయన చెప్పిన స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read: అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు
ఇదే అసలైన రామాయణం
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రామాయణం గురించి ప్రస్తావన రాగా, ఉపేంద్ర స్పందిస్తూ "రామాయణం, మహాభారతాల గురించి నాకేం అర్థమైందో ఇప్పుడు చెప్తాను. రామాయణం అంటే మనుషుల లోపలే ఉంటుంది. నీలో ఉన్న ఆత్మ రాముడు, నువ్వు ఆలోచించే విధానం సీత, నీ కోరికలు బంగారు లేడి, నీ విపరీత ఆలోచనలే రావణుడు... ఇలా మనిషి లోపల జరిగే ఈ ప్రయాణమే రామాయణం అని పెద్దలు చెప్పారు. అందుకే ఇప్పటికీ, ఎప్పటికీ మనం రామాయణానికి అంతగా కనెక్ట్ అవుతాము" అంటూ చెప్పుకొచ్చారు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ అర్థమయ్యే విధంగా ఉపేంద్ర రామాయణం గురించి చెప్పిన తీరుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఉపేంద్ర చెప్పిన విధంగా రామాయణం గురించి ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఉపేంద్ర ఇంటర్వ్యూ ఇచ్చారంటే చాలు, అందులోని ఏదో ఒక అంశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జెన్ జెడ్ కిడ్స్ గురించి ఆయన చేసిన కామెంట్స్ హల్చల్ చేస్తున్నాయి.