మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) యాక్టింగ్, కామెడీ టైమింగుకు గురూజీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పంచ్ డైలాగ్స్ తోడైతే ఎలా ఉంటుంది? ఇద్దరి కలయికలో మాంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న యాక్షన్ ఫిల్మ్ వస్తే ఎలా ఉంటుంది? అది త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ టాక్. అసలు వివరాల్లోకి వెళితే...


త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరంజీవి?
Chiranjeevi Trivikram movie : చిరంజీవి హీరోగా నటించిన 'జై చిరంజీవా' సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు రాశారు. అప్పటికి ఆయన దర్శకుడిగా మారారు. తరుణ్ హీరోగా 'నువ్వే నువ్వే' తీశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 'అతడు'కు దర్శకత్వం వహించారు. అయితే... మెగాస్టార్ మీద అభిమానంతో మాటలు రాసి ఇచ్చారు. ఆ సినిమా 2005లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ మెగాస్టార్, మాటల మాంత్రికుడి కాంబినేషన్ కుదరలేదు. ఇప్పుడు కుదురుతుందని టాక్.


చిరంజీవి, త్రివిక్రమ్ కలయికలో ఓ సినిమా రూపొందే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'గుంటూరు కారం' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు త్రివిక్రమ్! ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా టార్గెట్ చేస్తూ ఓ సినిమా లైనులో ఉంది. ఈ రెండిటి మధ్య చిరంజీవితో సినిమా వచ్చే ఛాన్స్ ఉందట!


Also Read : 'జితేందర్ రెడ్డి' ఎవరో తెలిసింది - ఆయనతో పాటు శ్రియా శరణ్ కూడా!


'బింబిసార'తో భారీ విజయం అందుకున్న వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది. అది సోషియో ఫాంటసీ జానర్ సినిమా. వీఎఫ్ఎక్స్ పనులకు ఎక్కువ సమయం పడుతుంది. అందుకని, మధ్యలో మాంచి ఫ్యామిలీ వేల్యూస్ ఉన్న యాక్షన్ ఫిల్మ్ చేయాలని, అదీ త్రివిక్రమ్ స్టైల్ సినిమా అయితే బావుంటుందని చిరంజీవి భావిస్తున్నారట. ఆ విషయం దర్శకుడికి చెప్పారట. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని టాక్. ఇది నిజమైతే మెగా అభిమానులకు పండగే.  


కొన్ని రోజులు రీమేకులకు దూరంగా చిరంజీవి?
వశిష్ఠ సినిమా కాకుండా 'సోగ్గాడే చిన్ని నాయనా', 'రారండోయ్ వేడుక చూద్దాం', 'బంగార్రాజు' సినిమాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాలతో కూడా చిరంజీవి ఓ సినిమా చేయనున్నారు. ఆ సినిమాకు చిరు పెద్ద కుమార్తె సుస్మితా కొణిదెల నిర్మాత. మరి, త్రివిక్రమ్ సినిమాకు ముందు ఆ సినిమా చేస్తారా? లేదంటే తర్వాత చేస్తారా? అనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. 'భోళా శంకర్' ఫ్లాప్ తర్వాత కొన్ని రోజులు రీమేకులకు దూరంగా ఉండాలని కూడా చిరు నిర్ణయం తీసుకున్నారట.


Also Read సంక్రాంతికే 'గుంటూరు కారం' - డౌట్స్‌కు చెక్ పెట్టిన మహేష్ ప్రొడ్యూసర్



ప్రస్తుతం హీరోలతో పాటు దర్శక నిర్మాతలు అందరూ పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టారు. త్రివిక్రమ్ కూడా ఆ వైపు కాన్సంట్రేట్ చేశారు. ఇప్పటి వరకు ట్రై చేయని జానర్ లో త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమా ఉంటుందని నిర్మాత నాగవంశీ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.  


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial