Celebrities Voting LIVE Updates: ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్ - ఓటు వేసిన టాలీవుడ్ సెలబ్రిటీలు, ఎవరెక్కడ?

Tollywood Celebrities Voting LIVE Updates: తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏపీలో కొందరు, తెలంగాణలో మరికొందరు ఓటు వేశారు. ఎవరెక్కడ ఓటు వేశారో చూడండి.

Satya Pulagam Last Updated: 13 May 2024 04:57 PM
ఉపాసనతో కలిసి వచ్చి ఓటు వేసిన రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు ఉదయం ఓటు హక్కు వినియోగించుకోగా... ఆయన తనయుడు & గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు మధ్యాహ్నం తర్వాత ఓటు వేశారు. 





మధ్యాహ్నం తర్వాత ఓటు వేసిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ మధ్యాహ్నం తర్వాత తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేయడం తప్పనిసరి అనే సందేశాన్ని ఆయన ఇచ్చారు. 





నడవం కష్టంగా ఉన్నా ఓటు వేసిన కోట

టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. ప్రజెంట్ ఆయన నడవడం కష్టంగా ఉంది. మరొకరి సాయంతో నడుస్తూ పోలింగ్ బూత్ వద్దకు వచ్చి ఓటు వేశారు. 





జూబ్లీ హిల్స్ విమెన్స్ కాలేజీలో ఓటు వేసిన నాగ చైతన్య

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సోమవారం పది గంటలు దాటిన తర్వాత జూబ్లీ హిల్స్ విమెన్స్ కాలేజీలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 





ఓటు వేయడానికి దుబాయ్ నుంచి వచ్చిన జక్కన్న

అగ్ర దర్శకుడు రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి సోమవారం ఉదయం హైదరాబాద్ లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేయడం కోసం దుబాయ్ నుంచి వచ్చినట్లు రాజమౌళి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 





తండ్రి కోన రఘుపతి, కుటుంబంతో కలిసి ఓటు వేసిన నీరజా కోన

ప్రముఖ స్టయిలిష్ట్, సిద్ధూ జొన్నలగడ్డ 'తెలుసు కదా' సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్న మహిళ నీరజా కోన. ఆమె తండ్రి కోన రఘుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. తండ్రి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఓటు వేశారు. 





ఓటు వేసిన వకీల్ సాబ్ బ్యూటీ

'వకీల్ సాబ్' సినిమాలో ఓ పాత్ర చేసిన తెలుగు అమ్మాయి అనన్యా నాగళ్ళ. 'మల్లేశం' సినిమాలో మెయిన్ లీడ్ ఆ అమ్మాయే. 'ప్లే బ్యాక్', 'తంత్ర' సినిమాలూ చేశారు. ఆవిడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

జూబ్లీ హిల్స్ లో ఓటు వేసిన ఆస్కార్ విజేత, పద్మశ్రీ పురస్కార గ్రహీత

'నాటు నాటు' పాటతో దేశానికి ఆస్కార్ తెచ్చిన విజేత, పద్మశ్రీ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ రోజు ఉదయం జూబ్లీ హిల్స్ లో పోలింగ్ బూత్ వద్దకు విచ్చేసి ఓటు వేశారు. 





మంగళగిరిలో సతీ సమేతంగా ఓటు వేసిన పవన్ కళ్యాణ్

జనసేనాని పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా మంగళగిరిలో పోలింగ్ బూత్ వద్దకు విచ్చేశారు. ఆయన భార్య అన్నా లెజినోవా సాంప్రదాయ చీరలో కనిపించారు. 





ఇంట్లో కూర్చోవద్దు... బయటకు వచ్చి ఓటు వేయండి: దర్శకుడు తేజ

ప్రజలందరూ ఇంట్లో కూర్చోవద్దని, బయటకు వచ్చి ఓటు వేయాలని దర్శకుడు తేజ సూచించారు. ప్రభుత్వం ఆ పని చేయలేదని, ఈ పని చేయలేదని కంప్లైంట్స్ ఇవ్వడానికి ముందు ఓటు వేయాలని ఆయన పేర్కొన్నారు. 





భార్య సురేఖ, కుమార్తె సుష్మితతో వచ్చి ఓటు వేసిన చిరంజీవి

ప్రజలు అందరూ పోలింగ్ బూత్స్ వద్దకు వచ్చి ఓటు వేయాలని, తమ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. భార్య సురేఖ, పెద్ద కుమార్తె సుష్మితతో కలిసి జూబ్లీ హిల్స్ క్లబ్ కు విచ్చేసిన ఆయన... అక్కడ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 









రాజకీయాలతో సంబంధం లేదన్న అల్లు అర్జున్ 

అల్లు అర్జున్ ఇవాళ ఉదయం జూబ్లీ హిల్స్ బీఎస్ఎన్ఎల్ సెంటర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం తనకు రాజకీయాలతో సంబంధం లేదని పేర్కొన్నారు. నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడానికి వెళ్లడం గురించి మీడియా ప్రశ్నించగా... రాజకీయాలకు సంబంధం లేదన్నారు.


తల్లి శాలిని, సతీమణి ప్రణతితో కలిసి వచ్చిన ఎన్టీఆర్ 

యువ కథానాయకుడు ఎన్టీఆర్ ఉదయం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తల్లి శాలిని, భార్య ప్రణతితో కలిసి ఓబుల్ రెడ్డి స్కూల్ కు వచ్చారు. ప్రజలకు ఓటు వేయమని విజ్ఞప్తి చేశారు. 


Background

ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. అలాగే, పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ మొదలైంది. మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ మొదలైంది. తెలుగు రాష్ట్రాలు రెండిటిలో ఈ రోజు ఎన్నికల హడావిడి నెలకొంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సైతం ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం అని చెప్పాలి.


తెలుగు చిత్రసీమలో అగ్ర హీరోల్లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే బరిలో నిలిచారు. ఆయన స్థాపించిన జనసేన పార్టీ నుంచి 21 అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యే బరిలో అభ్యర్థులు పోటీలో నిలిచారు. రెండు ఎంపీ సీట్లలో పోటీ చేస్తున్నారు. మరో అగ్ర కథానాయకుడు, నట సింహం నందమూరి బాలకృష్ణ హిందూపూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు. వైసీపీ నుంచి నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా సెల్వమణి మరోసారి పోటీ చేస్తున్నారు. తెలంగాణ చేవెళ్ల ఎంపీ నియోజకవర్గం నుంచి 'పొలిమేర 2' ఫేమ్, నటి సాహితి దాసరి పోటీ పడుతున్నారు. మరికొందరు నటీనటులు కొన్ని చోట్ల పోటీ చేస్తున్నారు.


ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి మద్దతుగా పలువురు నటీనటులు ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ పార్టీకి ఓటు వేయమని మెగా హీరోలతో పాటు సినిమా ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు పిలుపు ఇచ్చారు. పిఠాపురం వెళ్లి ప్రచారం చేసి వచ్చారు. సినిమా ఇండస్ట్రీలో మెజారిటీ ప్రజల మద్దతు కూటమికి ఉన్నట్లు ఇన్ సైడ్ వర్గాల టాక్. పవన్ సినిమాల్లో నటించిన హీరోయిన్లు, నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు సైతం ఆయనకు అండగా ట్వీట్లు చేశారు.


Also Read: టైమ్ చూసి జగన్ మీద దెబ్బ కొడుతున్న టాలీవుడ్ - మాస్ రివేంజ్ షురూ!?


వైసీపీకి మద్దతుగా పోసాని కృష్ణమురళి, అలీతో పాటు యాంకర్ శ్యామల, నటుడు గౌతమ్ రాజు వంటి వారు ప్రచారం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి కిశోర్ రెడ్డికి మద్దతుగా మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ ప్రచారం చేశారు. అది డిస్కషన్ పాయింట్ అయ్యింది. ఏపీ ఎన్నికలు పక్కన పెడితే... మెజారిటీ సినీ ప్రముఖులకు తెలంగాణలో ఓటు హక్కు ఉంది. పవన్ కల్యాణ్ మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.


ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని యువ హీరోలు అడివి శేష్, సిద్ధూ జొన్నలగడ్డ, దర్శకుడు ప్రశాంత్ వర్మ, నటుడు సాయి కుమార్ సహా పలువురు వీడియో సందేశం ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు మీద ప్రజలకు అవగాహనా కల్పించే ప్రయత్నం చేశారు. మరి, రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ శాతం ఎలా ఉంటుంది? ఎంత మంది ఓటు వేస్తారు? ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఇస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరు ఎక్కడ ఓటు వేశారు? ఓటు వేసిన తర్వాత ఎవరెవరు ఏం ఏం మాట్లాడారు? అనేది లైవ్ అప్డేట్స్ ద్వారా తెలుసుకోండి.


Also Readవద్దమ్మా... బ్యాక్ నుంచి ఫోటోలు, వీడియోలు వద్దమ్మా - ముంబై పాపరాజీ వర్సెస్ హీరోయిన్ల గొడవేంటి?

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.