Raghavendra Rao: దర్శక దిగ్గజం రాఘవేంద్రరావు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 80, 90లో ఆయన సినిమాలకు ఎంతో క్రేజ్ ఉండేది. హీరోయిన్లను అందంగా చూపించడంలో రాఘవేంద్రరావుకి మించిన వాళ్లు లేరు. అలాగే ఆయన ఎంతోమంది హీరోలను హీరోయిన్లను ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన ఈమధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన కెరియర్ గురించి ప్రస్తావించారు.


యాంకర్ రాఘవేంద్ర రావుని ‘‘మీ నాన్నగారు పెద్ద డైరెక్టర్ కదా ఆయన దగ్గర కాకుండా కమలాకర కామేశ్వరరావు దగ్గర పని చేయడానికి కారణం ఏమిటి’’ అని అడిగిన ప్రశ్నించింది. రాఘవేంద్రరావు స్పందిస్తూ ‘‘నేను బీఏ చదువుతున్న రోజుల్లో నువ్వు డైరెక్టర్ అవుతావా అని నాన్నగారు అడిగారు. అందుకు అవును అని సమాధానం చెప్పాను. అయితే నాన్నగారు చదివింది చాలు వెనక్కి వచ్చేయమని చెప్పారు. కానీ నాకు పేరు వెనకాల డిగ్రీ ఉంటే ఇష్టం.. ఒకవేళ డైరెక్టర్ గా సక్సెస్ అవ్వకపోయినా ఆ డిగ్రీ నాకు ఉపయోగపడుతుందని ఒక ఆలోచనతో డిగ్రీ కంప్లీట్ చేశాను. ఆ తరువాత నాన్నగారు ఆదుర్తి సుబ్బారావు దగ్గర పెడతాను అన్నారు. ముందుగా ఎడిటింగ్ నేర్చుకోమన్నారు. కె ఎస్ ఆర్ దాసు దగ్గర రిల్స్ తిప్పటం జాయింట్ వేయడం నేర్చుకున్నాను’’ అని తెలిపారు.


‘‘ఆ తరువాత నాన్నగారి దగ్గరే వర్క్ చేయవలసి ఉంది కానీ ఎందుకో ఆ సినిమా పోస్ట్ పోన్ అయింది అదే సమయంలో ‘పాండవ వనవాసం’ సినిమా ప్రారంభమైంది. ఆ సినిమాకి డైరెక్టర్ కమలాకర్ కామేశ్వరరావు కావటం అప్పటికే ఆయన పెద్దపెద్ద సినిమాలు తీసి ఉండటం అందులోనూ నాకు మైథాలజికల్ మూవీస్ అంటే చాలా ఇష్టం దాంతో ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేరాను. మొట్టమొదట నేను ‘పాండవ వనవాసం’ సినిమాలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ మీద క్లాప్ కొట్టాను. అది ఎంతో అదృష్టంగా ఇప్పటికీ భావిస్తూ ఉంటాను. డైరెక్టర్ అవ్వటానికి అదే మొదటి మెట్టు కదా’’ అని తెలిపారు.


‘‘కమలాకర్ కామేశ్వరరావును రామారావు గురువు అని పిలిచేవారు. దీంతో ఆయన అసిస్టెంట్‌ను కాబట్టి నన్ను బుడ్డ గురు అని పిలుస్తూ ఉండేవారు. ‘అడవి రాముడు’ సినిమా చేసేటప్పటికి నాకు మూడు సినిమాల ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంది. అయినప్పటికీ ఆయనకి నా వర్కింగ్ స్టైల్ వచ్చి నా డైరెక్షన్లో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఈరోజు నేను ఈ స్టేజ్ లో ఉన్నానంటే అందుకు కారణం ఎన్టీ రామారావు గారే’’ అని చెప్పుకొచ్చారు రాఘవేంద్రరావు.


ఆ హీరోల బాధ్యత నాకు అప్పగించారు


రామానాయుడు తన కొడుకుని నా చేతిలో పెట్టి.. అతడి బాధ్యత మీదే అని చెప్పారు. అలాగే కృష్ణ గారు.. మహేష్ బాబు చిన్నప్పటి నుంచి వీడిని నువ్వే ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అని అప్పటి నుంచే చెప్తూ వచ్చారు. అలాగే శ్రీకాంత్‌ను హీరోగా పెట్టి ‘పెళ్లి సందడి’ సినిమా తీసిన పాతికేళ్ల తర్వాత అతని కొడుకుతో మళ్ళీ అదే ‘పెళ్లి సందడి’ సినిమా తీయడం చాలా ఆనందంగా ఉంది. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే చిరంజీవి బర్త్ డేలకు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలందరూ డాన్సులు బాగా చేసేవారు. అందులో రామ్ చరణ్ ఇంకా బాగా చేసేవాడు అతనికి రూ.100 ఇచ్చి భవిష్యత్తులో నువ్వు మంచి యాక్టర్ అవుతావు అని చెప్పాను. అంటే రామ్ చరణ్ కి ఫస్ట్ రెమ్యూనరేషన్ రూ.100 ఇచ్చింది నేనే’’ అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు రాఘవేంద్రరావు.


Also Read: గుండె తరుక్కుపోతోంది, జపాన్ ప్రజలూ ధైర్యంగా ఉండండి - ఎన్టీఆర్