Tollywood And Chandrababu Naidu government: టాలీవుడ్ పెద్దల తీరుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసంతృప్తికి గురయ్యారు. గత ప్రభుత్వం ఎంత వేధించినా.. ప్రస్తుత ప్రభుత్వం టాలీవుడ్ సమస్యల పట్ల ఎంతో సానుకూలంగా ఉంది. ఎలాంటి ప్రతిపాదన వచ్చినా అంగీకారం తెలియచేస్తోంది. అయినప్పటికీ టాలీవుడ్ ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దల పట్ల వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. సినీ పరిశ్రమ వైపు నుంచి కుట్రలు చేయడానికి కూడా వెనుకాడటం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం సినీ పరిశ్రమను చూసే విధానం కూడా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దీనంతటికి కారణం సినీ పరిశ్రమ పెద్దలే.
జగన్ ప్రభుత్వంలో తీవ్ర వేధింపులు
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో టాలీవుడ్ చాలా సమస్యలు ఎదుర్కొంది. మినిమం టిక్కెట్ రేటును పది రూపాయలుగా ఖరారు చేశారు. అక్కడి నుంచి మెగాస్టార్ చిరంజీవి చేతులు జోడించి జగన్ ను వేడుకునే వీడియో విడుదల చేయడం వరకూ టాలీవుడ్ అనేక అవమానాలు ఎదుర్కొంది. టిక్కెట్ రేట్లు పెంచాలంటే.. హీరోలు వచ్చి వ్యక్తిగతంగా కలిసి దండాలు పెట్టుకుని వెళ్లాల్సిన అవసరం ఉండేదన్న విమర్శలు వచ్చాయి. చివరికి టిక్కెట్ రేట్లను పెంచడానికి అనేక షరతులు పెట్టారు. వ్యక్తిగతంగా వచ్చి కలిస్తేనే టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి జీవోలు వచ్చేవి.
కూటమి ప్రభుత్వంలో సినీ పరిశ్రమకు ప్రోత్సాహం
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినీ పరిశ్రమకు ప్రోత్సాహం లభిస్తోంది. ఇండస్ట్రీ గుర్తింపు ఇస్తామని కూడా ప్రభుత్వం టాలీవుడ్ పెద్దలకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కొంత మంది టాలీవుడ్ పెద్దలు పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు. అప్పటి నుంచి సినీ పరిశ్రమకు సంబంధించి ఎలాంటి అవసరాన్ని అయినా ప్రభుత్వం పరిష్కరిస్తోంది. టిక్కెట్ రేట్ల పెంపుదల జీవోలు ఇస్తోంది. షూటింగ్‌లకు అనుమతుల విషయంలో ఆలస్యం కావడం లేదు. స్వయంగా టాలీవుడ్ అగ్రహీరో డిప్యూటీ సీఎంగా ఉండటంతో సమస్యలు ఉండవనుకున్నారు. కానీ ఇప్పుడు కొంత మంది డిప్యూటీ సీఎం సినిమానే టార్గెట్ చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ధియేటర్లు యజమానుల చేతుల్లో లేవు. నలుగురు చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఆ నలుగురు కలిసి ధియేటర్లు మూసేద్దామని ప్లాన్ చేశారు. అది కూడా పవన్ సినిమా ఎదురుగా ఉన్న సమయంలో. దీంతో కుట్రలేమిటో అర్థమైపోయింది.
రివర్స్ లో టాలీవుడ్ పెద్దలు రాజకీయం చేస్తున్నారా ?
టాలీవుడ్ మీద గత ప్రభుత్వం కుట్రలు చేస్తూంటే.. ఈ ప్రభుత్వంపై టాలీవుడ్ పెద్దలే కుట్రలు చేస్తున్నారన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై స్పష్టమైన అవగాహన ఉండటంతో పవన్ కల్యాణ్ కూడా అసహనానికి గురవుతున్నారని అంటున్నారు. అందుకే తమకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. ధియేటర్ల విషయంలో చర్యలకు పవన్ సిద్ధమయ్యారు. ఇప్పటి వరకూ టాలీవుడ్ పెద్దలంతా కలిసి చంద్రబాబును కలవకపోవడంతో వారి ఇంటెన్షన్ ఏమిటో తెలిసిపోతుందని అంటున్నారు.
జగన్ లా ఉంటేనే సినిమావాళ్లు దారిలో ఉంటారా ?
ఏపీ ప్రభుత్వం పట్ల సినిమా పెద్దలు వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత చాలా మంది.. జగన్ లా ఉంటేనే సినిమవాళ్లకు తిక్క కుదురుతుదంని మంచిగా ఉంటే ఇలాగే రాజకీయ కుట్రల్లో భాగమవుతూంటారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ మొత్తం నలుగురి చేతుల్లో ఉందని..వారంతా కలిసి ఈ పనులు చేస్తున్నారని అంటున్నారు.