Tollywood Talented Directors: కొత్తదనానికి చిరునామాగా నిలుస్తోంది మన తెలుగు చిత్ర పరిశ్రమ. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా వైవిధ్యభరితమైన కథలతో వినోదాలు పంచే నవతరం దర్శకులు ఇండస్ట్రీకి పరిచయంఅవుతున్నారు. మన హీరోలు సైతం మంచి కంటెంట్ తో వస్తే చాలు, అనుభవాన్ని పక్కన పెట్టి కొత్త ఆలోచనలకు ప్రాధాన్యమిస్తున్నారు. కొత్త డైరెక్టర్లతో సినిమాలు తీస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. ఇలా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన ఆ టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం!


మల్లిడి వశిష్ఠ్‌:
తొలి అడుగులోనే అగ్ర హీరోల దృష్టిలో పడ్డ దర్శకుడు మల్లిడి వశిష్ఠ్‌. కల్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కించిన ‘బింబిసార’ సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చరిత్రను వర్తమానంతో ముడిపెడుతూ కథ అల్లుకోడమే కాదు, దాన్ని అంతే చక్కగా తెరపై ఆవిష్కరించి ఆడియన్స్ మెప్పు పొందాడు వశిష్ట. డెబ్యూ మూవీతోనే ఏకంగా మెగాస్టార్ దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా Mega156 సినిమా చేస్తున్నాడు. సోషియో ఫాంటసీ కథాంశంతో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.


వేణు ఎల్దండి:
గత కొన్నేళ్లుగా వెండి తెర మీద నవ్వులు పూయిస్తున్న జబర్దస్త్ వేణు.. 'బలగం' సినిమాతో మెగా పట్టుకొని డైరెక్టర్ అవతారమెత్తాడు. తెలంగాణ పల్లె నేపథ్యంలో కథ రాసుకొని, బలమైన ఎమోషన్స్ ను అద్భుతంగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశాడు. స్టార్ కాస్టింగ్ లేకుండానే, తొలి చిత్రంతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకొని అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. ఈ సినిమా మంచి వసూళ్లు సాధించడమే కాదు, ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకుంది. దీంతో వేణు పేరు ఇండస్ట్రీ వర్గాల్లో మారుమోగిపోతోంది. ప్రస్తుతం ఆయన దిల్ రాజు బ్యానర్ లో ఓ స్టార్ హీరోతో సినిమా చేయడానికి సన్నద్ధం అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. 


శ్రీకాంత్ ఓదెల:
'దసరా' సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమయ్యాడు శ్రీకాంత్ ఓదెల. నాని - కీర్తి సురేశ్ హీరో హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో రా అండ్ రస్టిక్ స్టోరీతో ప్రేక్షకులని అలరించారు. క్లాస్ గా కనిపించే నానీని ఇప్పటి వరకు చూడని ఊర మాస్ లుక్‌ లో చూపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను సాధించడమే కాదు, డైరెక్టర్ గా శ్రీకాంత్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఆయన ఇంతవరకూ తన సెకండ్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయలేదు. నానితో లేదా ఓ బిగ్ స్టార్ హీరో దర్శకుడి నెక్స్ట్ మూవీ ఉంటుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.


Also Read: ‘మీర్జాపూర్ 3' to 'ఫ్యామిలీ మ్యాన్ 3' - 2024లో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ సీక్వెల్స్ ఇవే!


శౌర్యువ్:
గతేడాది టాలీవుడ్ కు పరిచయమై మరో మరో కొత్త డైరెక్టర్ శౌర్యువ్. హీరో నాని కెరీర్ లో మైల్‌ స్టోన్‌ 30వ సినిమా 'హాయ్ నాన్న' చిత్రానికి దర్శకత్వం వహించాడు. వయలెన్స్, యాక్షన్ లేకుండా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. విమర్శకుల ప్రశంసలతో పాటుగా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పటికే మరికొన్ని కథలు రాసుకున్న శౌర్యువ్, కాస్త విరామం తీసుకుని తదుపరి సినిమా గురించి ఆలోచిస్తానని చెబుతున్నాడు.


కళ్యాణ్ శంకర్:
'మ్యాడ్' (MAD) సినిమాతో దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అయ్యాడు కళ్యాణ్ శంకర్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నూతన నటీనటులతో ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ను తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించి, డైరెక్టర్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పట్లో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి హీరోగా 'అనగనగా ఓ రాజు' అనే మూవీ ఎనౌన్స్ చేయబడింది. మరి ఆ ప్రాజెక్ట్ ఎక్కడి దాకా వచ్చింది? అసలు నిర్మాణంలో ఉందా? లేదా ఆగిపోయిందా? అనేది తెలియడం లేదు.


సుమంత్‌ ప్రభాస్‌:
‘మేమ్‌ ఫేమస్‌’ సినిమాతో హీరో కమ్ డైరెక్టర్ గా పరిచయమయ్యాడు సుమంత్‌ ప్రభాస్‌. అల్ల‌రి చిల్ల‌ర‌గా తిరుగుతూ జీవితాన్ని గడిపే ముగ్గురు స్నేహితుల కథాంశంతో రూపొందిన ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్, టాక్ తో సంబంధం లేకుండా మంచి వసూళ్ళు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి లాంటి సినీ ప్రముఖులు సుమంత్ ను ప్రశంసించారు. అంతేకాదు మహేశ్ ప్రొడక్షన్ లో సినిమా చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు.


ఇక 'బెడురులంక 2012' సినిమాతో డైరెక్టర్ క్లాక్స్ తన ప్రతిభను చాటుకున్నాడు. అలానే 'రైటర్ పద్మభూషణ్' చిత్రంతో షణ్ముఖ ప్రశాంత్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. వీరితో పాటుగా మరికొందరు యంగ్ డైరెక్టర్స్ తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకొని సక్సెస్ సాధించారు. సినిమా తీయాలంటే సరికొత్త కంటెంట్ ముఖ్యమని నిరూపించారు. అనుభవం లేకపోయినా.. కొత్త కథలతో ప్రేక్షకుల్ని కట్టి పడేశారు. 


పైన చెప్పుకున్న నవతరం దర్శకులందరి నుంచి భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలొచ్చే అవకాశముంది. మరి వీరిలో ఎవరెవరు బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి, స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చేరుతారో చూడాలి.


Also Read: మనిషిలా మారిపోతానని బెదిరిస్తోన్న ఏలియన్ - ‘అయలాన్‌’ ట్రైలర్‌ అదుర్స్!