ఒకప్పుడు ఒక సినిమాను రెండు భాషల్లో విడుదల చేయడమే చాలా పెద్ద విషయంగా ఉండేది. అలాంటి ఈరోజుల్లో ప్రతీ మూవీ ప్యాన్ ఇండియా వైడ్‌గా దాదాపు ప్రతీ సౌత్ భాషలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక తమ సినిమాలను విడుదల చేసే భాష సంఖ్యను రోజురోజుకీ పెంచుకుంటూ పోవడానికే మేకర్స్ ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా రవితేజ హీరోగా నటించిన ‘టైగర్ నాగేశ్వర రావు’ కూడా ఒక కొత్త భాషలో విడుదల కానుందని తెలుస్తోంది. అదే జరిగితే ఇప్పటివరకు ఆ భాషలో ఏ తెలుగు సినిమా విడుదల అవ్వలేదు.


స్టువర్టుపురం దొంగ..
మాస్ మహారాజ్ రవితేజ.. ఒకప్పుడు ఎక్కువగా కమర్షియల్ కథలను చేయడానికి ఇష్టపడేవారు. అందులో తన ఎనర్జీతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేవారు. కానీ గత కొన్నేళ్లుగా రవితేజ స్టోరీ సెలక్షన్ మారిపోయింది. ఓవైపు కమర్షియల్ సినిమాలు చేస్తున్నా కూడా కథలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉండాలని మాస్ మహారాజా భావిస్తున్నారు. అలా డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్న క్రమంలో కొన్ని ఫ్లాపులు ఎదురైనా.. తను మాత్రం వెనక్కి తగ్గడానికి ఇష్టపడడం లేదు. ఇక త్వరలోనే స్టువర్ట్‌పురం దొంగలకు మహారాజుగా వెలిగిపోయిన ‘టైగర్ నాగేశ్వర రావు’ బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు రవితేజ. తాజాగా ఈ మూవీ నుంచి ప్రేక్షకులు ఆశ్చర్యపోయే అప్డేట్ ఒకటి బయటికొచ్చింది.


భారీ బడ్జెట్.. ప్యాన్ ఇండియా రిలీజ్..
ఒకప్పుడు రవితేజ సినిమాలు చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి ఎక్కువ లాభాలు సాధించేవి. కానీ గతకొంతకాలంగా ఆయన సినిమాలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కడం మొదలయ్యింది. ‘టైగర్ నాగేశ్వర రావు’ కూడా అదే తరహాలో తెరకెక్కింది. పైగా దీనిని ప్యాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయాలని మూవీ టీమ్ నిర్ణయించుకుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ‘టైగర్ నాగేశ్వర్ రావు’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు రవితేజ నటించిన ఏ సినిమా కూడా హిందీలో థియేట్రికల్ రిలీజ్ అవ్వలేదు. ఆ విషయంలో కూడా ‘టైగర్ నాగేశ్వర రావు’ రికార్డ్ సాధించింది. అంతే కాకుండా ప్రేక్షకులు ఊహించని మరో భాషలో కూడా ఈ మూవీ విడుదల కానున్నట్టు సమాచారం.


ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లో..
ఇండియన్ సైన్ లాంగ్వేజ్ (ఐఎస్‌ఎల్) అంటే వినికిడి లోపం ఉన్న దివ్యాంగులకు అర్థమయ్యే భాషలో కూడా ‘టైగర్ నాగేశ్వర్ రావు’ విడుదల కానున్నట్టు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. సైన్ లాంగ్వేజ్‌తో తాజాగా విడుదలైన ట్రైలర్.. ఈ బజ్‌కు కారణమైంది. ఇప్పటివరకు పలు ఇండియన్ సినిమాలు ఐఎస్ఎల్‌లో విడుదలయ్యాయి. ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ కూడా ఈ ప్రయోగం చేస్తే.. తెలుగు నుంచి మాత్రం ఈ భాషలో విడుదల అవుతున్న మొదటి చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’. అంతే కాకుండా ఈ భాషలో మూవీ ట్రైలర్ కూడా ఇప్పటికే విడుదలయ్యింది. వంశీ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ.. అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాజర్, మురళీ శర్మ, రేణు దేశాయ్ లాంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాశ్ చాలాకాలం తర్వాత ‘టైగర్ నాగేశ్వర రావు’తో తెలుగులో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.



Also Read: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial