Best Thriller Movies On OTT: కొన్ని సినిమా కథల గురించి వింటే అంత ఎగ్జైటింగ్‌గా, థ్రిల్లింగ్‌గా అనిపించకపోవచ్చు. కానీ వాటిని చూస్తే మాత్రం ఆ ఎఫెక్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అలాంటి ఒక సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమానే ‘థెల్మా’ (Thelma). ఇది ఒక నార్వేజియన్ భాషకు చెందిన మూవీ. ఓటీటీలో ఇంగ్లీష్‌లో కూడా అందుబాటులో ఉంది. నార్వే నుంచి అకాడమీ అవార్డుల వరకు ఎంట్రీ సాధించింది ‘థెల్మా’. కానీ నామినేషన్ వరకు వెళ్లకుండానే ఆగిపోయింది.


కథ..


‘థెల్మా’ కథ విషయానికొస్తే.. ఈ సినిమా ఒక తండ్రి, కూతురు కలిసి అడవిలో వేటకు వెళ్లడంతో మొదలవుతుంది. ఆ అడవిలో జింకను చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ఆ చిన్న పాప తలకు గన్‌ను గురిపెడతాడు తండ్రి. కట్ చేస్తే.. 20 ఏళ్ల తర్వాత మూవీ ఓపెన్ అవుతుంది. థెల్మా (ఎలీ హార్బో).. తన ఊరికి దూరంగా ఒక హాస్టల్‌లో ఉంటూ కాలేజ్‌లో చదువుతుంటుంది. తను పెద్దగా ఎవరితో కలవదు. అలా ఒకరోజు థెల్మా క్లాస్‌లో ఫిట్స్ వచ్చి పడిపోతుంది. అలాంటి సమయంలో ఎవరూ కనీసం తన దగ్గరకు కూడా రారు. కాలేజ్ మ్యానేజ్మెంటే ఆమెను హాస్పిటల్‌లో జాయిన్ చేస్తుంది. తన ఫ్యామిలీకి ఈ విషయాన్ని చెప్తామంటే థెల్మానే వద్దని ఆపుతుంది. ఆ తర్వాత రోజు థెల్మాకు ఎలా ఉందో కనుక్కుందామని క్లాస్‌మేట్ అంజా (కాయా విల్కిన్స్) ఆమె దగ్గరకు వస్తుంది. థెల్మాను ఎవరూ పట్టించుకోరు, తనతో అసలు ఎవరూ మాట్లాడరు. అలాంటిది అంజానే స్వయంగా వచ్చి తనతో మాట్లాడడంతో ఆమెపై ఇష్టం పెంచుకుంటుంది. 


మెల్లగా థెల్మా, అంజా ఫ్రెండ్స్ అవుతారు. ఒక సందర్భంలో కిస్ కూడా చేసుకుంటారు. ఒకరోజు తన ఫ్రెండ్స్ పార్టీకి థెల్మాను తీసుకెళ్తుంది అంజా. అక్కడ తనకు చెప్పకుండా స్మోక్ చేయమని గంజాయిని ఇచ్చేసరికి థెల్మా స్పృహ తప్పిపోతుంది. అప్పుడే తన నోట్లోకి పాము వెళ్తున్నట్టు వింతంగా ఊహించుకోవడం మొదలుపెడుతుంది. వెంటనే తనకు మెలకువ వచ్చి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రోజు డాక్టర్ దగ్గరకు వెళ్తుంది. అప్పుడే థెల్మాకు తెలియకుండా తన తల్లిదండ్రులు తనకు చిన్నప్పటి నుంచి ఏదో టాబ్లెట్ ఇస్తున్నారని తెలుస్తుంది. దీని గురించి తెలుసుకోవడం కోసం ఆ డాక్టర్ మరిన్ని టెస్టులు చేస్తుంది. ఆ టెస్టుల సమయంలో అంజా.. తన ఇంటికి వచ్చినట్టు, అక్కడ నుంచి మాయం అయిపోయినట్టు తెలుస్తుంది. ఇదంతా తానే కంట్రోల్ చేస్తున్నట్టు తనకు అర్థమవుతుంది. 


మరుసటి రోజు మరో డాక్టర్‌ను కలవగా థెల్మాకు సూపర్ పవర్స్ ఉన్నాయని, ఇలాంటి వారిని మంత్రగత్తెలు అంటారని ఆయన చెప్తారు. తమకు దగ్గర్లో ఉన్న హాస్పిటల్‌లో ఆమె బామ్మ అడ్మిట్ అయ్యి ఉందని ఆ డాక్టర్ అంటారు. తనకు ఒక బామ్మ ఉందనే విషయాన్ని కూడా థెల్మాకు తెలియనివ్వరు తన తండ్రిదండ్రులు. కానీ థెల్మా వెళ్లి తన బామ్మను కలుసుకునేలోపే ఆమె చనిపోతుంది. తన వల్ల తన చుట్టూ ఉండేవారికి ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రహించిన థెల్మా.. తన ఇంటికి వెళ్లిపోతుంది. కానీ తల్లిదండ్రులే ఆమెను చంపడానికి ప్లాన్ చేస్తారు. ఇంతకీ థెల్మా చిన్నతనంలో అసలు ఏం జరిగింది? తన సొంత తల్లిదండ్రులే తనను ఎందుకు చంపాలనుకుంటున్నారు? వీటి నుంచి ఆమె ఎలా బయటపడింది? అనేది తెరపై చూడాల్సిన కథ.



అదే మైనస్..


‘థెల్మా’ కథ అంతా చాలా కొత్తగా అనిపిస్తుంది. అసలు చివరి వరకు ఏం జరుగుతుంది అనే సస్పెన్స్‌ను మెయింటేయిన్ చేయడంలో దర్శకుడు జోయాచిమ్ ట్రయర్ సక్సెస్ అయ్యాడు. మామూలుగా సూపర్ నేచురల్ కథల్లో ఎంత సస్పెన్స్ ఉంటుందో.. అంతే కన్‌ఫ్యూజన్ కూడా ఉంటుంది. కానీ ఇందులో ఎక్కువగా కన్‌ఫ్యూజన్ లేకుండా చాలా క్లీన్‌గా తెరకెక్కించాడు దర్శకుడు. మూవీలో మైనస్ ఏమైనా ఉందంటే అది క్లైమాక్సే. ‘థెల్మా’ క్లైమాక్స్ అంతా చాలా హడావిడిగా ముగిసిపోయినట్టు అనిపిస్తుంది. చాలామంది ఇదేంటి అనుకునేలోపే మూవీ అయిపోతుంది. అంతా పక్కన పెడితే ఒక మంచి క్లీన్ థ్రిల్లర్ చూడాలనుకునేవారు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న ‘థెల్మా’ను చూసేయవచ్చు.


Also Read: హోటల్ 3వ ఫ్లోర్‌లో దెయ్యం, చెప్పినా వినకుండా వెళ్లి చూసిన అక్కాచెల్లెళ్లు - మూడున్నర రోజులు తర్వాత.. ఏం జరుగుతుంది?