నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) కథానాయకుడిగా రామ్ చరణ్ (Ram Charan) నిర్మాణ భాగస్వామిగా ఓ సినిమా రూపొందుతోందని ఏబీపీ దేశం శనివారమే పాఠకులకు తెలియజేసింది. ఈ రోజు అధికారికంగా ఆ చిత్రానికి సంబంధించిన వివరాల్ని వెల్లడించారు. 


నిఖిల్ హీరోగా 'ది ఇండియా హౌస్'
నిఖిల్ హీరోగా రామ్ చరణ్ సమర్పణలో, ఆయన మిత్రుడు విక్రమ్ రెడ్డితో కలిసి స్థాపించిన 'వి మెగా పిక్చర్స్', అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'ది ఇండియా హౌస్' (The India House Movie). దీనికి రామ్ వంశీ కృష్ణ దర్శకుడు. తేజ్ నారాయణ్ అగర్వాల్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలు. ఈ చిత్రాన్ని నేడు ప్రకటించడంతో పాటు మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు. 


శివ పాత్రలో నిఖిల్ సిద్ధార్థ్...
శ్యామ్ జీ కృష్ణ వర్మగా అనుపమ్!
లండన్ నేపథ్యంలో, మన భారత దేశానికి స్వాతంత్య్రం రాక ముందు కాలంలో సాగే కథతో 'ది ఇండియా హౌస్' చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాలో శివగా నిఖిల్ కనిపించనున్నట్లు పేర్కొంది. అంతే కాదు... ఇందులో అనుపమ్ ఖేర్ కూడా ఉన్నారు. ఆయన శ్యామ్ జీ కృష్ణ వర్మ పాత్ర చేస్తున్నారు. 


స్వాతంత్య్ర సమరయోధులు వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా 'ది ఇండియా హౌస్' చిత్రాన్ని అనౌన్స్ చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని రామ్ చరణ్ ట్వీట్ చేశారు. 'కార్తికేయ 2' తర్వాత నిఖిల్, అనుపమ్ ఖేర్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కలయికలో రూపొందుతున్న చిత్రమిది. రామ్ చరణ్ తోడు కావడంతో సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. పాన్ ఇండియా సినిమాగా దీనిని తెరకెక్కించనున్నారు.


'ఇండియా హౌస్'లో ప్రేమకథ!
'ది ఇండియా హౌస్' మోషన్ పోస్టర్ చూస్తే... చివర్లో తగలబడుతున్న ఇల్లు ఉంది. దాని కంటే ముందు బ్రిడ్జ్ మీద ఒక అమ్మాయిని కూడా చూపించారు. దీన్నిబట్టి ఈ సినిమాలో ప్రేమకథకు కూడా చోటు ఉందని అర్థం అవుతోంది. అయితే... నిఖిల్ జోడీగా నటించే హీరోయిన్ ఎవరు? అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. లండన్ లో ఇల్లు తగలబడిపోవడానికి కారణం ఏంటి? అనే అంశం చుట్టూ కథ ఉంటుంది ఏమో!?


Also Read ఎన్టీఆర్‌ను దేవుడిని ఎందుకు కొలుస్తున్నారు? ఆయనకు ఎందుకు అంత క్రేజ్?






'కార్తికేయ 2' సినిమాతో ఉత్తరాది ప్రేక్షకుల్లో నిఖిల్ సిద్దార్థ్ మంచి పేరు అయితే సంపాదించారు. వసూళ్ల పరంగానూ ఆ సినిమా నిర్మాతకు విపరీతమైన లాభాలు అందించింది. త్వరలో 'స్పై' సినిమాతోనూ ఉత్తరాది ప్రేక్షకులను మరోసారి నిఖిల్ పలకరించనున్నారు. ఇక నుంచి నిఖిల్ చేయబోయే సినిమాలు అన్నీ పాన్ ఇండియా టార్గెట్ చేస్తూ ఉంటాయని తెలిసింది. 


ఉత్తరాదిలో రామ్ చరణ్ క్రేజ్ తెలుసుగా!
నిఖిల్ సిద్ధార్థ్ సంగతి పక్కన పెడితే... ఉత్తరాదిలో రామ్ చరణ్ ఫాలోయింగ్ ఎలా ఉందో ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాలో పతాక సన్నివేశాల్లో అల్లూరి సీతారామరాజు వేషధారణలో ఆయన నటన అక్కడి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. కొందరు అయితే ఆయన్ను శ్రీరాముడు అనుకున్నారు. రామ్ చరణ్ నిర్మాణంలో నిఖిల్ హీరోగా సినిమా అంటే ఉత్తరాదిలో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. 


Also Read ఎన్టీఆర్ కెరీర్ మలుపు తిప్పిన సినిమాలు - తెలుగులో కొత్త ట్రెండ్ సెట్ చేశాయ్!