Producer Thammareddy Bharadwaja Reaction On Nagarjuna N Convention Demolish By Hydra : ప్రస్తుతం హైదరాబాద్ లో ఎక్కడ చూసినా హైడ్రా గురించి ప్రస్తావన. బఫర్ జోన్ లో, చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక ఇటీవల నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చేశారు. ఈ నేపథ్యంలో ఆ అంశంపై స్పందించారు తమ్మారెడ్డి భరద్వాజ. రేవంత్ రెడ్డి చాలా ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారని, అదే ధైర్యంతో అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు.
అందరూ కట్టారు.. ఆయన కట్టారు అంతే
"తప్పు.. ఒప్పు ఏముంది? అందరు కట్టారు, ఆయన కట్టారు కూలగొట్టారు. ఈ ఊరిలో ఎంతమంది దగ్గర నిజంగా పర్మిషన్ లు ఉన్నాయి. ఎంతమంది దగ్గర తప్పుడు పర్మిషన్లు ఉన్నాయి. నాగార్జున లంచాలు ఇచ్చారట. ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు నిన్నే చూశాను. నాకు ఇష్టం లేదు అయినా, తప్పక ఇవ్వాల్సి వచ్చింది అని అన్నారు. దీనికే ఇచ్చాడేమో మనకేం తెలుసు. లంచాలు ఇచ్చి పని చేసుకుంటున్నాం. ఇవన్నీ బఫర్ జోన్‌లో ఉన్నాయి కాబట్టి మనం ఏమి అనలేము. నాకు కావూరి హిల్స్ దగ్గర స్థలం ఉంది. దాంట్లో నా స్థలం ముందు, వెనుక, పక్కన ఎక్కడా ఎఫ్ టీఎల్ లేదు. నా 500 గజాల స్థలానికి మాత్రమే ఎఫ్ టీఎల్ ఉంది అంటారు. అదేంటి అలా అంటే.. అది అంతే అంటారు. ఇలాంటి రూల్స్ ఉంటాయి. అలాంటి పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్న అధికారులు వాళ్లంతా ఇష్టం వచ్చినట్లు నడిపించుకున్నారు’’ అని అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ.
అధికారులపై చర్యలు తీసుకుంటే బాగుంటుంది
"నిజానికి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. చాలా ధైర్యంగా తీసుకున్నారు ఈ నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి గారు. అదే ధైర్యంతో అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. కొన్ని వేల ఎకరాల్లో ఇల్లు కట్టారు అది బఫర్ జోన్ కాదు. నాది బఫర్ జోన్ అంటారు. నాది నిజంగా బఫర్ జోన అయితే.. వాళ్లది కూడా కూలగొట్టాలి కదా? కొన్ని ఇళ్లు చెరువులోనే ఉన్నాయి. చెరువులో ఇళ్లు ఉంటే ఎఫ్ టీఎల్ కాదేమో. తెలియని వాటి గురించి మాట్లాడకూడదు అంతే" అని అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ.
పదేళ్ల తర్వాత చాలా కష్టం..
పదేళ్ల తర్వాత హైదరాబాద్ పరిస్థితి చాలా కష్టం. ట్రాఫిక్ ఘోరంగా పెరిగిపోతుంది. గతంలో ఏదైనా కట్టాలి అంటే ప్లే గ్రౌండ్ కి వదలాలి, స్కూల్‌కు స్థలం వదలాలి, హాస్పిటల్‌కు స్థలం వదలాలి. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఒక్కోరు 50 అంతస్థులు అలా కట్టేస్తున్నారు. స్కూల్‌కు ఎక్కడికో వెళ్లాలి. హాస్పిటల్‌కు ఇంకెక్కడికో వెళ్లాలి. అలాంటప్పుడు అందరూ ఒకేసారి బయటికి వస్తారు ట్రాఫిక్ భారీగా పెరిగిపోతుంది. నీళ్లు అవన్నీ కూడా చాలా కష్టం అయిపోతాయి" అని అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ.