Test Movie Trailer: ముగ్గురి జీవితాలను మలుపు తిప్పిన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ - నయనతార 'టెస్ట్' మూవీ ట్రైలర్ చూశారా?
Test Movie: నయనతార, మాధవన్, సిద్ధార్థ్ లేటెస్ట్ మూవీ టెస్ట్. ఎస్.శశికాంత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Nayanthara's Test Movie Trailer Released: స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో నయనతార (Nayanthara), ఆర్.మాధవన్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'టెస్ట్' (Test). ఎస్.శశికాంత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 4 నుంచి నేరుగా ప్రముఖ ఓటీటీ 'నెట్‌ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్, కుముద రోల్స్ తెలిపే వీడియోలు హైప్ పెంచేశాయి. తాజాగా మూవీ ట్రైలర్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. 'వాళ్లు తమ కలల కోసం ఎంత దూరం వెళ్తారు.? ఒక్క టెస్ట్ మాత్రమే చెబుతుంది.' అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ట్రైలర్ ఎలా ఉందంటే?
చెన్నైలో జరిగిన ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. ప్రముఖ క్రికెటర్‌గా అర్జున్ (సిద్ధార్థ్) కనిపిస్తుండగా.. ఆయన్ను తన స్కూల్ మేట్‌గా నయనతార (కుముద).. శరవణన్ (మాధవన్)కు పరిచయం చేయడంతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. 'చాలామంది డబ్బు, ఫేమ్, స్టేటస్ కోసం క్రికెట్ ఆడితే అర్జున్ మాత్రం ఆటపై ప్రేమతో ఆడతాడు' అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.
శరవణన్ తన కెరీర్‌లో భాగంగా ఓ ప్రాజెక్ట్ ప్రారంభించగా.. అది పూర్తి కావాలంటే డబ్బులు కావాలి. దాని కోసం అతను ఏం చేశాడు.? ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగే చివరి టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లో అర్జున్ విజయం సాధించాడా.? ఓ స్కూల్ టీచర్‌గా కుముద తన కుటుంబం, భర్త కోసం ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేసింది.? వీరి ముగ్గురికి ఈ మ్యాచ్‌కు అసలు సంబంధం ఏంటి.? ఫేమస్ క్రికెటర్ అయిన.. తన భార్య స్నేహితుడిని కుముద భర్త తన ప్రాజెక్ట్ కోసం వాడుకున్నాడా.? ఈ అంశాలన్నింటినీ ట్రైలర్‌లో సస్పెన్స్‌గా చూపించారు. మరి ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
Also Read: నితిన్ 'రాబిన్ హుడ్' టికెట్ ధరల పెంపు - ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన మూవీ టీం.. అసలు నిజం ఏంటో తెలుసా?
2024 లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రిలీజ్ అనుకోని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ క్రమంలో డైరెక్ట్‌గా ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీతోనే శశికాంత్ డైరెక్టర్‌గా మారారు. ఓ వైపు దర్శకత్వం వహిస్తూనే.. మరోవైపు చక్రవర్తి రామచంద్రంతో కలిసి నిర్మాతగా వ్యవహరించారు. ఆయన రచయితగానూ వ్యవహరించారు. మీరా జాస్మిన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు.