Tollywood News: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గురువారం(డిసెంబర్‌ 26) తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు సమావేశంకానున్నారు. దీన్ని ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజు లీడ్ చేస్తున్నారు. శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు వచ్చిన దిల్‌రాజు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఖరారు అయిందని పేర్కొన్నారు. సినిమా పరిశ్రమలోని పెద్దలందరికీ సమాచారం ఇచ్చామని రేపు ఎంత మంది వస్తే అంత మందితో సీఎంను కలుస్తామన్నారు.  


చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను రేవంత్ రెడ్డి ముందు ఏకరవు పెట్టనున్నారు. పుష్క -2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగన ఘటన ఒకరు ప్రాణాలు కోల్పోయారు. బాలుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనపై ప్రభుత్వం బెనిఫిట్‌షోలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీనిపై అసెంబ్లీలోనే ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు బెనిఫిట్‌షోలకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. 


సంక్రాంతి సందర్భంగా చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈటైంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంఇండస్ట్రీకి షాక్ అనే చెప్పాలి. మొదటి రోజు టికెట్లు రేట్లు పెంచడం, బెనిఫిట్‌షోల రద్దుతో కలెక్షన్‌లపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఈ రెండు చేయడంతోనే పుష్ప -2 మొదటి రోజు 250 కోట్లకుపైగా కలెక్ట్ చేసింది. అంటే సినిమాకు పెట్టిన ఖర్చును దాదాపు వసూలు చేసినట్టే తర్వాత వచ్చిందంతా బోనస్ అవుతుంది. 


ఇప్పుడు సడెన్‌గా బెనిఫిట్‌షోలు లేవు, టికెట్‌ల పెంపు కూడా ఉండదని చెప్పడం సినిమా పరిశ్రమ పెద్దలకు మింగుడు పడటం లేదు. సంక్రాంతికి వచ్చే సినిమాలే కాకుండా ఇంకా భారీ స్థాయిలో రూపొందుతున్న సినిమాలకి కూడా ఈ నిర్ణయం ఇబ్బంది పెడుతుందని అంటున్నారు. అందుకే ఎలాగై ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ నిర్ణయం పునరాలోచించేలా చేయాలని చూస్తున్నారు. 


మరోవైపు సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్‌ను అరెస్టు చేసింది. ఆయన బెయిల్‌పై విడుదలైనప్పటికీ విచారణకు పిలుస్తోంది. మంగళవారం విచారించింది. ఇంకా పిలిచే అవకాశం ఉంది. ఈ కేసులో మరికొందర్ని కూడా విచారించనుంది. ఈ విషయంపై కూడా ప్రభుత్వానికి రిక్వస్ట్ పెట్టుకోనున్నారని తెలుస్తోంది. 


సంధ్య థియేటర్ ఘటనలో నష్టపోయిన రేవతి కుటుంబానికి న్యాయం జరుగుతుందని భరోసా ఇవ్వనున్నారు. అందుకే ఇవాళ వచ్చి శ్రీతేజ్‌ను పరామర్శించి ఆ కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు ప్రకటించారు. అంతే కాకుండా భాస్కర్‌కు సినిమా ఇండస్ట్రీలోనే శాశ్వత ఉద్యోగం ఇచ్చేందుకు కూడా ఓకే చెప్పారు. ఫైనల్‌గా బాధిత కుటుంబానికి భరో ఇచ్చి వారికి న్యాయం చేస్తున్నందున విషయంపై మరింత తీవ్రంగా వెళ్లొద్దని రిక్వస్ట్ చేసే అవకాశం ఉంది. 


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుంది. అయినా ఇప్పటి వరకు సీఎంను సినిమా పెద్దలువ్యక్తిగతంగా కలిసిన వాళ్లు ఉన్నారే తప్ప పరిశ్రమ నుంచి ఎవరూ కలవలేదు. తమ సమస్యల గురించి చెప్పిందిలేదు. అందుకే ప్రభుత్వానికి , సినిమా పరిశ్రమకు మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం జరుగుతోంది. దాన్ని ఖండించడానికి ఈ భేటీ జరగనుందని అంటున్నారు.