కోలీవుడ్ హీరో విశాల్ పెళ్లికి సంబంధించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు తెరపైకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మొదట్లో తమిళ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ ని పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు రాగా..ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అభినయతో పెళ్లి జరగబోతుందని టాక్ కూడా వినిపించింది. ఇప్పుడు ఈ లిస్టులో లో మరో హీరోయిన్ పేరు కూడా చేరిపోయింది. ఒకప్పటి కోలీవుడ్ హీరోయిన్ లక్ష్మీ మీనన్ తో విశాల్ పెళ్లి ఫిక్స్ అయినట్లు ప్రస్తుతం కోలీవుడ్ మీడియా అంతా కోడైకొస్తోంది. తమిళంలో ప్రభు సోలామన్ డైరెక్ట్ చేసిన 'కుమ్కీ' అనే సినిమాతో ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీ మీనన్.. ఆ తర్వాత 'జిగురుతాండ', 'కుట్టు బుల్లి', 'పాండియనాడు', 'నాన్ సికపు మన్మన్', 'కొంబన్' వంటి సినిమాల్లో నటించింది.
ఈ సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ ను అందుకున్నాయి. వీటితోపాటు విజయ్ సేతుపతికి జోడిగా 'రెక్కై' చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే స్టార్ హీరో అజిత్ నటించిన 'వేదాలం' సినిమాలో చెల్లెలి పాత్ర పోషించింది. ఇక 'వేదాలం' తర్వాత ఈ హీరోయిన్ కి తమిళంలో పెద్దగా అవకాశాలు రాలేదు. మళ్లీ చాలా కాలం తర్వాత ప్రస్తుతం రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న 'చంద్రముఖి 2' సినిమాలో నటిస్తోంది లక్ష్మీ మీనన్. 27 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కోలీవుడ్లో తెగ ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా హీరో విశాల్ తోనే ఆమె పెళ్లి జరగబోతుందని గట్టి టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నెట్టింట ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.
అయితే దీనిపై ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోవడంతో కొంతమంది ఈ వార్తను కొట్టి పారేస్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంతుందో తెలియాలంటే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించక తప్పదు. ఇదిలా ఉంటే విశాల్ తో లక్ష్మీ మీనన్ ఇప్పటికే 'పల్నాడు', 'ఇంద్రుడు' వంటి సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాల్లోనూ వీళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగా కుదరడంతో వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత విశాల్ తో కలిసి లక్ష్మీ మీనన్ ఏ సినిమాలోనూ నటించలేదు. ఈ రెండు సినిమాల పరిచయంతోనే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలైందని, ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఇంట్లో వాళ్లకు చెప్పకుండా దాచారని, త్వరలోనే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇటీవల ఇరు కుటుంబాల పెద్దలకు తెలియజేయడంతోనే కోలీవుడ్ లో ఈ వార్తలు తెగ ప్రచారం అవుతున్నాయని తెలుస్తోంది.
ఇక విశాల్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం 'మార్క్ ఆంటోనీ' అనే సినిమాలో నటిస్తున్నారు. టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో విశాల్ సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్ జె సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మినీ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : అక్షయ్‌తో కలిసి ‘OMG 2’ మూవీ చూసిన సద్గురు - ఆయన రివ్యూ ఇదే!