Prabhas's Return His Remuneration: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఈ మేరకు ఓ తమిళ డిస్ట్రిబ్యూటర్ ఆయన గొప్పతనం గురించి చెప్పిన ఓ వీడియో వైరల్ అవుతోంది. తాను నటించిన ఓ మూవీ నష్టాలు చవిచూడగా తమకు రూ.50 కోట్లు తిరిగి ఇచ్చారని చెప్పుకొచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

మిగిలిన హీరోల్లా ప్రభాస్ ఎప్పుడూ అంతగా బయట కనిపించరు. మూవీ ఈవెంట్స్‌లోనూ ఆయన కనిపించేది చాలా తక్కువ. అటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండరు. తాను నటించిన మూవీస్‌ విషయంలోనూ రిలీజ్ టైంలో అది కూడా టైం దొరికితేనే ప్రమోషన్స్‌లో పాల్గొంటారు. తన గురించి కానీ మూవీ రిజల్ట్ గురించి కానీ ఏమైనా రూమర్స్ వచ్చినా పెద్దగా పట్టించుకోరు రెబల్ స్టార్. తాజాగా ఓ తమిళ డిస్ట్రిబ్యూటర్ ఓ ఈవెంట్‌లో ఆయనపై ప్రశంసలు కురిపించారు.

అసలేం జరిగిందంటే?

నిజానికి 'బాహుబలి' తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ మూవీస్ అనుకున్నంత సక్సెస్ కాలేదు. దీంతో కలెక్షన్లు రాబట్టలేకపోయాయి. 'రాధే శ్యామ్' మూవీకి ప్రభాస్... రూ.100 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కమర్షియల్‌గా సక్సెస్ కాకపోవడంతో ఆయన రూ.50 కోట్లు తిరిగిచ్చారని చెప్పారు ఓ తమిళ డిస్ట్రిబ్యూటర్. 'రాధే శ్యామ్ మూవీకి ప్రభాస్ రూ.100 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకున్నారు. సినిమా ఆడకపోయే సరికి రూ.50 కోట్లు నిర్మాతకు తిరిగి ఇచ్చేశారు. ఈ మొత్తాన్ని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు తిరిగి ఇవ్వాలని కోరారు.' అంటూ సదరు డిస్ట్రిబ్యూటర్ చెప్పారు. 

Also Read: వన్ కేఫ్... వన్ లవ్... వన్ లైఫ్ - రాజీవ్ కనకాల 'చాయ్ వాలా' టీ చాలా స్పెషల్...

ఫ్యాన్స్ ప్రశంసలు

అయితే, ఈ వీడియో పాతదో కొత్తదో కానీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన ప్రభాస్ ఫ్యాన్స్, నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయనది చాలా గొప్ప మనసు అని... సినిమా సక్సెస్ కాకపోతే డిస్ట్రిబ్యూటర్లను ఆదుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. 

ప్రస్తుతం ప్రభాస్... మారుతి డైరెక్షన్‌లో 'ది రాజా సాబ్' మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రభాస్ తన కెరీర్‌లో ఫస్ట్ హారర్ కామెడీ జోనర్‌లో నటిస్తుండడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటే సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆకట్టుకుంటోంది. పాన్ ఇండియా స్థాయిలో దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో టీజీ విశ్వప్రసాద్ మూవీని నిర్మిస్తున్నారు.

వెంటాడుతున్న వివాదాలు

ఈ ఏడాది డిసెంబర్ 5న మూవీ రిలీజ్ చేస్తామని మేకర్స్  ప్రకటించినా... ఇంకా కొన్ని పనులు పెండింగ్ కారణంగా మూవీ రిలీజ్ వాయిదా పడుతుందనే వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై మూవీ టీం అధికారికంగా స్పందించాల్సి ఉంది. మరోవైపు... చెప్పిన టైంకు రిలీజ్ చేయలేదని కారణంతో ఢిల్లీకి చెందిన IVY ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ 'ది రాజా సాబ్' మూవీ నిర్మాతలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ పెట్టుబడి రూ.218 కోట్లు 18 శాతం వడ్డీతో సహా తిరిగి ఇచ్చేలా చూడాలని పిటిషన్‌లో పేర్కొంది.