Disaster Tamil Movies 2025: సీనియర్ తమిళ్ డైరెక్టర్లలో సత్తా తగ్గిందా? ప్రజెంట్ జనరేషన్ ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నారా? అంటే అవును అని చెప్పాలి. ఒకరిని మించి మరొకరు అరివీర భయంకర డిజాస్టర్లు తీస్తున్నారు. పోనీ యంగ్ డైరెక్టర్లు అయినా సరే హిట్లు కొడుతున్నారా అంటే అదీ లేదు. 'ఖైదీ', 'విక్రమ్' వంటి హిట్లు తీసిన లోకేష్ కనగరాజ్ సైతం హిట్ తీయలేక ఇబ్బంది పడుతున్నారు. అసలు తమిళ్ డైరెక్టర్లకు ఏమైంది? ఎందుకీ ప్లాప్ స్ట్రీక్? అనేది విశ్లేషిస్తే...

కథ కంటే భారీతనం ఎక్కువ...మూస నుంచి బయటపడని శంకర్!ప్రతి దర్శకుడికీ ఒక స్టైల్ ఉంది. సమాజంలో అవినీతిని ప్రశ్నించడం శంకర్ స్టైల్. సందేశం ఇచ్చినట్టు కాకుండా కమర్షియల్ ఫార్మాట్ సినిమా తీస్తారు. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' చూశాక పాత శంకర్ ఏమయ్యాడు? ఇంకా ఆ మూసలో ఎందుకు కొట్టుమిట్టాడుతున్నాడు? అని ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. 'రోబో' తర్వాత శంకర్ సరైన హిట్టు కొట్టలేదు.

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ '3 ఇడియట్స్'ను రీమేక్ చేయగా తెలుగు, తమిళ ప్రేక్షకులు చూడలేదు. 'ఐ' టీజర్, ట్రైలర్లు చూసి హిట్ కొడతాడు అనుకుంటే... రివేంజ్ కథకు భారీతనం జోడించి బోల్తా పడ్డారు. '2.0'లోనూ అంతే భారీతనం తప్ప శంకర్ మార్క్ ఎమోషన్స్ మిస్ అయ్యాయి. 'భారతీయుడు' అయితే ట్రోలింగ్ మెటీరియల్ అయ్యింది. సోషల్ మీడియా అంటూ వ్యవస్థలను ప్రశ్నించడం ఏమిటో ప్రేక్షకులకు అర్థం కాలేదు. ఒకప్పుడు శంకర్ కథల్లో సామాన్యులు కనెక్ట్ అయ్యే సన్నివేశాలు, కథలు ఉండేవి. పాటల్లో భారీతనం చూసి ప్రేక్షకులు 'ఔరా' అని ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు సన్నివేశాల్లోనూ భారీతనం చూపించాలని ట్రై చేసి కథల మీద కాన్సంట్రేట్ చేయడం మానేశారనేది శంకర్ మీద విమర్శ. ఆ విషయంలో ఆయన మళ్ళీ మళ్ళీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 

'బాహుబలి' స్థాయిలో తీయాలని...మణిరత్నం మార్క్ కనిపించట్లేదు!'బాహుబలి' విజయం మిగతా భాషల పరిశ్రమలో కసి రగిల్చింది. అటువంటి భారీ హిట్ తీయాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. అందులో భాగంగా వచ్చిన సినిమా 'పొన్నియన్ సెల్వన్'. తెలుగులో రెండు భాగాలూ డిజాస్టర్లు అయ్యాయి. తమిళ్ ఇండస్ట్రీలోనూ చెప్పుకోదగ్గ రీతిలో వందల కోట్ల కలెక్షన్లు రాలేదు. కానీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. తమిళ్ చరిత్రను తెరకెక్కించారని పేరు తెచ్చుకున్నాయి. ఎప్పటి నుంచి ప్లానులో ఉన్న ఆ సినిమా సెట్స్ మీదకు రావడానికి కారణం బాహుబలి విజయం ఇచ్చిన భరోసా.

మణిరత్నం దర్శకత్వంలో ఒక మార్క్ ఉంటుంది. స్లోగా ఉంటాయని విమర్శలు ఉన్నా ఎమోషన్స్ బాగా చూపిస్తారు. అందరికీ అర్ధమయ్యే కథలు చెబుతారు. మణి తీసిన మెజారిటీ కథలు రామాయణం, మహాభారతం స్ఫూర్తితో తెరకెక్కించినవే. కానీ 'పొన్నియన్ సెల్వన్'లో పేర్లు గుర్తు పెట్టుకోవడానికి ప్రేక్షకులు కష్టాలు పడ్డారు. ఇక 'థగ్‌ లైఫ్' కథ చూసి తలలు పట్టుకున్నారు. పాటల్లో గానీ, ఎమోషనల్ సీన్లలో గానీ ఆయన మార్క్ కనిపించలేదని విమర్శలు వచ్చాయి. 

మురుగదాస్ హిట్ తీస్తారా?ఆ కథలతో కోలుకునే ఛాన్సుందా?'గజినీ' నుంచి 'తుపాకీ' వరకు మురుగదాస్ సినిమాలు అన్నిటినీ టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఆదరించారు. హాలీవుడ్ కథలు ఎత్తేశారని 'గజినీ'పై విమర్శలు వచ్చినా ఆయన కథల్లో కొత్తదనం ఉంటుందని పేరొచ్చింది. కానీ, ఇప్పుడు ఆ మేజిక్ స్టోరీ టెల్లింగ్ మిస్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తీసిన 'స్పైడర్' నుంచి శివకార్తికేయన్ 'మదరాసి' వరకు విజయం కోసం మురుగదాస్ చేయని ప్రయత్నం లేదు. అనీ విఫల యత్నాలే. 

'మదరాసి' విడుదలకు ముందు మురుగదాస్ చాలా కామెంట్స్ చేశారు. వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇచ్చాయని, తమిళ్ డైరెక్టర్స్ ఎడ్యుకేట్ చేసే ఫిలిమ్స్ తీస్తారని చెప్పుకొచ్చారు. సల్మాన్ ఖాన్ 'సికిందర్' ప్లాప్ కావడానికి తాను కారణం కాదన్నట్టు చెప్పుకొచ్చారు. లేట్ షూట్స్ నుంచి భాష పరమైన సమస్యల వరకు ఎన్నో చెప్పారు. 'మదరాసి'తో హిట్ మాత్రం ఇవ్వలేదు. ఆయనకు అనుభవం పెరుగుతోంది కానీ ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. 

స్టార్స్ మీద ఉన్న శ్రద్ధ కథపై ఎక్కడుంది?'ఖైదీ', 'విక్రమ్' వంటి విజయాలు తీసిన లోకేష్ కనగరాజ్ నుంచి 'లియో', 'కూలీ' వంటి ఫ్లాప్స్ వచ్చాయి. కలెక్షన్స్ పరంగా వంద కోట్ల క్లబ్బులో ఆ దళపతి విజయ్, సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలు చేరొచ్చు. కానీ, ఆ రెండు సినిమాలూ ఫ్యాన్స్, ఆడియన్స్ అందరినీ శాటిస్‌ఫై చేయలేదు. 'లియో'లో తనను సరిగా వాడుకోలేదు అన్నట్టు సంజయ్ దత్ కామెంట్ చేశారు. అంటే క్యారెక్టర్ ఇంపార్టెన్స్ తక్కువ ఉంది. సినిమాలో కీలకమైన క్యారెక్టర్లకు స్టార్ హీరోలను ఒప్పించడం మీద పెట్టిన శ్రద్ధ కథలపై పెట్టడం లేదనేది లోకేష్ కనగరాజ్ మీద ఉన్న విమర్శ.

Also Read: హీరోయిన్లకు ఏమైంది? తాప్సీ to జ్యోతిక వయా కమలినీ ముఖర్జీ... అవసరం తీరాక టాలీవుడ్ మీద విమర్శలు!?

'పిజ్జా', 'జిగర్తాండ' సినిమాలతో సెన్సేషనల్ హిట్స్ అందుకున్న కార్తీక్ సుబ్బరాజ్ సైతం స్టార్ హీరోలను తన కథలతో ఒప్పించి సినిమాలు తీస్తున్నారు. రజనీకాంత్ 'పేట', సూర్య 'రెట్రో' వంటివి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. వెట్రిమారన్, పా రంజిత్ వంటి దర్శకులు కూడా విజయాల కోసం ఎదురు చూస్తున్నారు. లింగుసామి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, వెంకట్ ప్రభు వంటి దర్శకులు అవుటాఫ్ ఫోకస్ అయ్యారు. వాళ్ళ లాస్ట్ సినిమాలు ఏవీ కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. క్రిటిక్స్ అప్లాజ్ కూడా.

Also Readమదర్ రోల్స్ వైపు షిఫ్ట్ అవుతున్న శ్రియ... అప్పుడు 'దృశ్యం', 'ఆర్ఆర్ఆర్' - ఇప్పుడు 'మిరాయ్'