Kollywood Actor Vishal On AP Elections : కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఇటీవల రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే రాజకీయ ఆరంగేట్రం చేసి సొంతంగా పార్టీ పెట్టి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ చెప్పిన విశాల్ తాజాగా ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ మీడియా ఛానల్ తో మాట్లాడిన విశాల్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఈ క్రమంలోనే ఏపీలో మళ్ళీ వైయస్ జగన్ సీఎం అవుతారని చెప్పడం తర్వాత ఆసక్తికరంగా మారింది.
ఏపీలో మళ్ళీ జగనే సీఎం అవుతారు - విశాల్
కోలీవుడ్ హీరో విశాల్ త్వరలోనే 'రత్నం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళ దర్శకుడు హరి తెరకెక్కించిన ఈ చిత్రం త్వరలోనే థియేటర్స్ లో సందడి చేయనుంది. ప్రస్తుతం విశాల్ ఈ మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాదులో సందడి చేసిన విశాల్ మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలోనే వైయస్ జగన్ గురించి మాట్లాడారు." నేను వైసీపీకి సపోర్ట్ చేస్తున్నట్లు ఎప్పుడూ చెప్పలేదు. కానీ జగన్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. జగన్ గారిని ఒక వ్యక్తిగా నేను ఫాలో చేస్తున్నా. వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన నాటి నుంచి ఇప్పటివరకు ఆయన ఏం చేశారనేది గమనిస్తూ వస్తున్నా. ప్రజల్లోకి వచ్చి ఎలా మంచి పేరు సంపాదించుకున్నది నాకు నచ్చింది. ప్రజలు ఒక వ్యక్తిని నమ్మి సీఎం చేయడం అనేది మామూలు విషయం కాదు. వచ్చే ఎన్నికల్లో కూడా తప్పకుండా వైఎస్ జగనే గెలుస్తారు" అని అన్నాడు
జగన్‌కు దాడులు కొత్తకాదు
ఇటీవల జగన్ పై విజయవాడలో రాయితో దాడి జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై కూడా హీరో విశాల్ స్పందించారు. "జగన్ కి దాడులు కొత్త కాదు గతంలో ఎయిర్ పోర్ట్ లోనూ ఆయన మీద దాడి జరిగింది. భుజానికి తగిలిన కత్తి మెడ మీద తగిలితే పరిస్థితి ఏంటి? రాజకీయంగా ఆయన ఎన్నో చూశారు. అన్నింటికీ ధైర్యంగా ఉన్నారు. రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తికి ఆమాత్రం ధైర్యం, దిల్ ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చాడు.
ఏప్రిల్ 26న 'రత్నం' రిలీజ్
విశాల్ గత ఏడాది 'మార్క్ ఆంటోనీ' మూవీతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు 'రత్నం' అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. విశాల్ సరసన ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో సముద్రఖని, గౌతమ్ మీనన్, యోగి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 26న ఈ సినిమాని తమిళ, తెలుగు భాషల్లో ఒకేరోజు విడుదల చేయబోతున్నారు.
Also Read : మా నాన్న చనిపోయారనే విషయం నాకు చెప్పకుండా దాచారు, నేను ఇంటికి వెళ్లేసరికి..: నటి ఆమని