Shine Tom Chacko Family Met With Car Accident: మలయాళ స్టార్ షైన్ టామ్ చాకో ఇంట తీవ్ర విషాదం నెలకొంది. శుక్రవారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో ఆయన తండ్రి మృతి చెందినట్లు అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ప్రమాదంలో చాకోకు, ఆయన తల్లి, సోదరుడు, కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అసలేం జరిగిందంటే?
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చాకో ఫ్యామిలీ కారులో ఎర్నాకులం నుంచి బెంగుళూరుకు బయల్దేరగా శుక్రవారం ఉదయం 7 గంటలకు ధర్మపురి జిల్లా పాలకొట్టై సమీపంలో ఆగి ఉన్న లారీని వీరి కారు అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చాకో తండ్రి మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చాకో కుడి చేతికి గాయం కాగా.. ఆయన తల్లి, సోదరుడు, డ్రైవర్‌కు గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వీరిని ఆస్పత్రికి తరలించారు. షైన్ చాకోకు సర్జరీ అవసరమని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. షైన్ చాకో నాని 'దసరా' మూవీతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయమయ్యారు. ఆ సినిమాలో విలన్‌గా మెప్పించారు. ఇటీవల నితిన్ 'రాబిన్ హుడ్'లోనూ నటించారు.