హీరో సుశాంత్ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో సినిమాల జోరు తగ్గించిన ఈ హీరో నటిస్తున్న కొత్త మూవీని తాజాగా అనౌన్స్ చేశారు. సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా మూవీ అప్డేట్ ఇచ్చారు. ఇక SA10 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.
సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ జానర్లో SA10 సుశాంత్ అనుమోలు తన ప్రాజెక్టుల విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉన్నాడు. లాంగ్ బ్రేక్ తరువాత ఆయన తన కెరీర్ లో 10వ చిత్రంతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వబోతున్నాడు అంటూ ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా మూవీని ప్రకటించారు. ఈరోజు సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా SA10 మూవీని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి పృథ్వీరాజ్ చిట్టేటి దర్శకత్వం వహిస్తున్నారు. సంజీవని క్రియేషన్స్ బ్యానర్‌పై వరుణ్ కుమార్, రాజ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మూవీ అనౌన్స్మెంట్ పోస్టర్ విషయానికొస్తే... ఇందులో సుశాంత్ రెండు విభిన్నమైన లుక్‌లలో కన్పించాడు. పోస్టర్ పైభాగంలో అతను స్టైలిష్, ఇంటెన్స్ అవతార్‌లో, గంభీరమైన లుక్స్ తో కన్పించాడు. నేలపై పుర్రెలు ఉండగా, ఎవరో వెనుక నుంచి అతన్ని గమనిస్తూ కన్పిస్తోంది. ఇక ప్రతిబింబంలో సుశాంత్ పూర్తిగా డీఫెరెంట్ గా కన్పిస్తున్నాడు. హీరో చుట్టూ గందరగోళంగా ఉండగా, ఆయన భావోద్వేగంగా అరుస్తున్నట్టు కనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే మూవీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది అనే విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. ఇందులో సుశాంత్ ఒక భూతవైద్యుడి పాత్రను పోషిస్తున్నాడు. ఈ పాత్ర కోసం హీరో సరికొత్త మేకోవర్ లో కన్పిస్తున్నాడు. ఈ సినిమా కోసం దర్శకుడు పృథ్వీరాజ్ చిట్టేటితో కలిసి అనిరుధ్ కృష్ణమూర్తి స్క్రీన్‌ప్లే రాయడమే కాకుండా డైలాగ్స్ కూడా అందించారు. త్వరలోనే మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.
ఆశలన్నీ ఈ మూవీపైనే సుశాంత్ 'కాళిదాస్' సినిమాతో తన సినిమా కెరీర్ ను మొదలు పెట్టాడు. కానీ అప్పటి నుంచి ఇప్పటి దాకా ఈ హీరో ఖాతాలో ఒక్క బిగ్ హిట్ కూడా పడలేదు. 'అల వైకుంఠాపురంలో' సెకండ్ హీరోగా నటించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో సుశాంత్ సెకండ్ హీరోనే అయినప్పటికీ మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర పడింది. చివరగా సోలో హీరోగా సుశాంత్ చేసిన మూవీ 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' 2021లో రిలీజ్ అయిన ఈ మూవీ నిరాశపరిచింది. ఆ తరువాత 'భోలా శంకర్', 'రావణాసుర' వంటి సినిమాలలో కీ రోల్స్ పోషించాడు. ఇక లాంగ్ గ్యాప్ తరువాత ఫస్ట్ టైమ్ హర్రర్ జానర్ లో SA10తో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే సుశాంత్ కు SA10 మూవీ సాలిడ్ కం బ్యాక్ కావాలని కోరుకుంటున్నారు అక్కినేని అభిమానులు.