Thaman Says choreographers Mistake In Game Changer Movie: టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా 'ది రాజా సాబ్' మూవీ సాంగ్స్ రీకంపోజింగ్ జరుగుతోందని చెప్పి రెబల్ స్టార్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పారు. అలాగే 'గేమ్ ఛేంజర్' మూవీ సాంగ్స్‌లో ఒక్క హుక్ స్టెప్ కూడా లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు.
'ది రాజా సాబ్' సాంగ్స్ రీకంపోజర్
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న కామెడీ హర్రర్ థ్రిల్లర్ 'ది రాజా సాబ్'. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. 2024 జూలైలో విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్‌లో తమన్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. అయితే తాజాగా తమన్ ప్రభాస్ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ఆడియో లేబుల్స్ సినిమాలో 30 నుంచి 40 కోట్ల పెట్టుబడి పెడితే, ఒక సంగీత స్వరకర్తగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం నా బాధ్యత అనే నేను నమ్ముతాను. అయితే ప్రభాస్ సినిమా కాబట్టి మనం ఇంకా పెద్ద స్థాయిలో టార్గెట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. 'ది రాజా సాబ్' సాంగ్‌ను చాలా కాలం క్రితమే మేము కంపోజ్ చేశాం. కానీ ఇప్పటికీ ఈ సాంగ్స్ షూటింగ్ జరగలేదు. అందుకే నేను ఆ పాటలోని ఫ్రెష్నెస్ పోయిందని భావిస్తున్నాను. కాబట్టి వాటిని పక్కన పెట్టి, మరోసారి ఈ సినిమాకు పాటలను రీకంపోజ్ చేయాలని డిసైడ్ అయ్యాను" అంటూ చెప్పుకొచ్చారు. నిజానికి 2025 ఏప్రిల్ 10న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నామని ముందుగానే మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే సినిమా వాయిదా పడేలా కనిపిస్తోంది.
'గేమ్ ఛేంజర్' ఫెయిల్యూర్‌పై తమన్ కామెంట్స్
ఈ సందర్భంగా తాను మ్యూజిక్ అందించిన పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్' గురించి కూడా తమన్ ప్రస్తావించారు. ఈ మూవీలో మ్యూజిక్ గురించి మాట్లాడుతూ.. "గేమ్ ఛేంజర్‌లో సరైన హుక్ స్టెప్ లేదు. అందుకే యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్‌ను రాబట్టడంలో ఈ మూవీ సాంగ్స్ ఫెయిల్ అయ్యాయి. గతంలో నేను మ్యూజిక్ అందించిన 'అల వైకుంఠపురంలో' సినిమాలో ప్రతి పాటకు ఓ బెస్ట్ హుక్ స్టెప్ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్‌గా నేను దాదాపు ఒక్కో సాంగ్‌కు 25 నుంచి 50 మిలియన్ల వ్యూస్ తీసుకురాగలను. ఒక వేళ మంచి మెలోడీ అయితే 100 మిలియన్ల వ్యూస్ కూడా రావొచ్చు. దానికి మించి వ్యూస్ రావాలంటే అది కొరియోగ్రాఫర్, నటుడిపై ఆధారపడి ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చారు.
'గేమ్ ఛేంజర్' మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు ఏవీ పెద్దగా ఆకట్టుకోలేదు. 'జరగండి', 'డోప్' వంటి సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కొరియోగ్రఫీ విషయంలో 'జరగండి' పాట గురించి తమన్ సినిమా ప్రమోషన్లలో మాట్లాడి, అంచనాలను పెంచారు. కానీ తీరా సినిమా రిలీజ్ అయ్యాక ఈ పాట కొరియోగ్రఫీ ఆశించిన స్థాయిలో లేదని విమర్శలు విన్పించాయి. అలాగే తాను కలిసి వర్క్ చేయాలి అనుకునే మ్యూజిక్ డైరెక్టర్ త్రివిక్రమ్ అంటూ ఆయనను ఆకాశనికెత్తేశారు తమన్.