ఆనంద దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ లను హీరో హీరోయిన్ లుగా పరిచయం చేస్తూ 'దొరసాని' అనే సినిమాను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు కె.వి.ఆర్ మహేంద్ర తాజాగా తన రెండవ సినిమాని ప్రకటించారు. పాపులర్ పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే తనయుడు సూర్యాతేజ ఏలే ని తన రెండవ సినిమాతో హీరోగా వెండితెరకి పరిచయం చేస్తూ 'భరతనాట్యం' అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. రజకతాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. సినిమాలో సూర్య తేజ హీరోగా నటించడమే కాకుండా డైరెక్టర్ కెవిఆర్ మహేంద్ర తో కలిసి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా రాశారు.


పిఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై పాయల్ సరాఫ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సూర్యతేజ సరసన మీనాక్షి గోస్వామి కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్లుక్ ని మేకర్స్ విడుదల విడుదల చేశారు. పోస్టర్ ని చాలా వినూత్నంగా డిజైన్ చేశారు. క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతోంది. 'భరతనాట్యం' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'ప్రపంచంలోనే అత్యంత అందమైన మోసం' అనేది క్యాప్షన్ గా పెట్టారు. ఇక పోస్టర్లో టైటిల్ పై రక్తపు గుర్తులు ఉండడం గమనించవచ్చు. అలాగే హీరో సూర్య తేజ డిఫరెంట్ షేడ్స్ తో ట్రెండీ లుక్ లో చాలా స్టైలిష్ గా కనిపించాడు.


 అతని చుట్టూ పూల కొమ్మలు చుట్టుకుని ఉండగా, సినిమాలో ప్రధాన తారాగణమైన మీనాక్షి గోస్వామి, వైవా హర్ష, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, సలీం ఫేకు, టెంపర్ వంశీ పోస్టర్లో కనిపించారు. పోస్టర్లోనే పలువురు కమెడియన్స్ కనిపించడంతో ఈ సినిమా క్రైమ్ తో పాటు వినోదాత్మకంగా ఉండబోతున్నట్లు మేకర్స్ పోస్టర్ తోనే స్పష్టం చేశారు. ఇక ట్యాగ్ లైన్ సూచించినట్లు భరతనాట్యానికి సినిమా కథకి కనెక్షన్ ఉంది. పోస్టర్లో ఓ గన్ కనిపించడం సినిమా క్రైమ్ సైట్ ను నిర్దేశస్తుంది. ఓవరాల్ గా భరతనాట్యం ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై పాజిటివ్ ఇంప్రెషన్ కలిగించింది.


క్రైమ్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి 'భరతనాట్యం' అనే క్లాసిక్ టైటిల్ ఎందుకు పెట్టారు అనేది తెలియాలంటే టీజర్ విడుదల అయ్యేంతవరకు ఆగాల్సిందే. మరోవైపు 'భరతనాట్యం' షూటింగ్ ఇప్పటికే పూర్తయి ప్రస్తుతం దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం యంగ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నట్లు సమాచారం. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ఆర్. శాతమూరి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


సూర్య తేజ, మీనాక్షి గోస్వామి, వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సలీం లాంటి ప్రధాన తారాగణంతో పాటు గంగవ్వ, కృష్ణుడు, నాగ మహేష్, టార్జాన్ మాణిక్ రెడ్డి, శివన్నారాయణ, సత్తన్న, సంతోష్ బాలకృష్ణ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 'దొరసాని' తర్వాత సుమారు నాలుగేళ్ల గ్యాప్ తో కె.వి.ఆర్ మహేంద్ర ఈ సినిమాని తెరకెక్కిస్తుండడం గమనార్హం. చాలా గ్యాప్ తర్వాత రాబోతున్న 'భరతనాట్యం' మూవీ దర్శకుడిగా కె.వి.ఆర్ మహేంద్ర కి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.


Also Read : హీరో విజయ్ దళపతి నన్ను నమ్మలేదు- దర్శకుడు అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్




Join Us on Telegram: https://t.me/abpdesamofficial