కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కంగువ'. అత్యంత భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. స్టూడియో గ్రీన్, UV క్రియేషన్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నాయి. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ సినిమా గ్లిమ్స్ వీడియో రాబోతుందంటూ మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. అయితే ఈ గ్లిమ్స్ వీడియో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసేందుకు ఒక్కో పోస్టర్తో సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న ఓ పోస్టర్ ని విడుదల చేశారు.


ఈ పోస్టర్లో సూర్య ముఖాన్ని చూపించకుండా చేతిలో కత్తి పట్టుకున్న యుద్ధ వీరుడుగా పోస్టర్ డిజైన్ చేశారు. అంతేకాకుండా 'ప్రతి భయం వెనక ఓ కథ దాగి ఉంది. కింగ్ వచ్చేస్తున్నాడు' అంటూ స్టూడియో గ్రీన్ సంస్థ ట్వీట్ చేయగా.. తాజాగా  మరో పోస్టర్ ని రిలీజ్ చేస్తూ జూలై 23న 'కంగువ' గ్లిమ్స్ రాబోతుందని మేకర్స్ స్పష్టం చేశారు. ఇక తాజాగా విడుదల చేసిన పోస్టర్లో 'ది మ్యాన్, ది వైల్డ్, ది స్టోరీ' అని పేర్కొంటూ  సూర్య ముఖాన్ని చూపించకుండా గుర్రంపై యుద్ధ వీరుడి గెటప్ లో ఉన్న సూర్య వెనుక భాగాన్ని చూపించారు. ఈ పోస్టర్లో సూర్య పొడవైన జుట్టుతో చాలా విభిన్నంగా కనిపిస్తున్నారు. ఇలా ఒక్కో పోస్టర్తో సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నారు మూవీ యూనిట్. ఇక ఈ అప్డేట్ తో సూర్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.


అలాగే తాజాగా విడుదలైన 'కంగువ' పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమాలో సూర్య మొత్తం ఐదు విభిన్న తరహా గెటప్స్ లో కనిపించనున్నారట. సినిమాలో సూర్యకి జోడిగా బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని కథానాయికగా నటిస్తోంది. కోవై సరళ, యోగిబాబు, బీ ఎస్ అవినాష్, రెడీన్ కింగ్ స్లే ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా భారీ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో ఉండబోతోంది. కేవలం 2D ఫార్మేట్ లోనే కాకుండా 3D లో కూడా ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు మేకర్స్. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని తమిళ, తెలుగు, హిందీ సహా మొత్తం పది భాషల్లో ఎంతో గ్రాండ్ గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


అంతే కాదు పలు విదేశీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఓవైపు షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. మరోవైపు గ్రాఫిక్స్ పనులు కూడా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక సూర్య కెరియర్ లోనే భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్ తో ఎంతో గ్రాండియర్ గా ఈ సినిమా రూపొందుతోంది. మరి సూర్య కి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని అందిస్తుందో చూడాలి.