BRS Workers Attack On Maha News Office: ఒక టీవీ ఛానల్ కార్యాలయం మీద తెలంగాణలోని ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తలు దాడి చేశారు. తమ నాయకుడికి వ్యతిరేకంగా వరుస కథనాలు ప్రసారం చేస్తున్నారనే ఆగ్రహంతో టీవీ ఛానల్ మీద రాళ్లు విసిరారు. బిల్డింగ్ అద్దాలు పగలగొట్టడంతో పాటు అక్కడ కార్లను సైతం డ్యామేజ్ చేశారు. ఆ సమయంలో అక్కడ యువ హీరో సుహాస్ ఉన్నారు.
కార్యకర్తల దాడితో ఆందోళనకు గురైన సుహాస్!దాడికి గురైన టీవీ ఛానల్ కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక పెద్ద హాల్ ఉంటుంది. అక్కడ ఇంటర్వ్యూలు జరుగుతుంటాయి. తన సినిమా 'ఓ భామా అయ్యో రామ' పబ్లిసిటీలో భాగంగా సుహాస్ అక్కడికి వెళ్లారు. జూలై 11న సినిమా థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సదరు టీవీ ఛానల్ ఆఫీసుకు కూడా అలాగే వెళ్లారు.
ఇంటర్వ్యూ అంటే యాంకర్ రావడం, కొన్ని ప్రశ్నలు అడగడం, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించడం సాధారణంగా జరుగుతూ ఉంటాయి. బట్ ఫర్ ఏ చేంజ్... ప్రశ్నలకు బదులు సుహాస్ ముందు రాళ్లు పడ్డాయి. ఇంటర్వ్యూ ప్రారంభం కావడానికి ముందు తలుపులు మీద రాళ్లు పడ్డాయి. దాంతో డోర్ లాక్ చేస్తే... కొంత మంది కార్యకర్తలు దాన్ని బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ ప్రాంతంలో ఆ అలజడి చూసి సుహాస్ ఆందోళనకు గురయ్యారని తెలిసింది. ఇంటర్వ్యూ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో అక్కడి నుంచి భయం భయంగా బయటకు వచ్చారు.
కార్యకర్తలు చేసిన దాడిలో కొన్ని కార్లు ధ్వంసం అయ్యాయి. అయితే సుహాస్ కారుకు ఏమి కాలేదని, కానీ ఆయన సహాయకులు చెందిన బైక్స్ కొంచెం డామేజ్ అయ్యాయని సమాచారం. టీవీ ఛానల్ యాజమాన్యంపై కార్యకర్తల ఆగ్రహానికి మధ్యలో సుహాస్ చిక్కుకుపోయారు. 'ఓ భామ అయ్యో రామ' సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది.