Urvashi Rautela On Dabidi Dibidi Song Trolling : నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకుని, ఈ సంక్రాంతికి వచ్చిన సినిమా ‘డాకు మహారాజ్’. ఈ సినిమా విడుదలకు ముందు విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా.. అందులోని ‘దబిడి దిబిడి’ సాంగ్ అంతే స్థాయిలో ట్రోలింగ్‌కు గురైంది. ఈ సాంగ్‌లో బాలయ్య, ఊర్వశి రౌతేలా వేసిన స్టెప్స్‌పై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరిగింది. మరీ ముఖ్యంగా ఈ పాట కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్‌ని టార్గెట్ చేస్తూ.. బాలయ్య ఫ్యాన్స్ కూడా ట్రోలింగ్ చేయడం విశేషం. ఎందుకంటే, బాలయ్య లాంటి స్టార్ హీరోతో, సీనియర్ హీరోతో అలాంటి వల్గర్ స్టెప్స్ ఏంటి? అంటూ శేఖర్ మాస్టర్‌ని గట్టిగానే ఏసుకున్నారు.
ఎంత ట్రోలింగ్ జరిగినా, ఈ పాటని ఎంతగా టార్గెట్ చేసినా.. మేకర్స్ మాత్రం ఎక్కడా రియాక్ట్ కాలేదు. కామ్‌గా సినిమాను థియేటర్లలోకి దింపేశారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి రౌతేలా.. ఈ ట్రోలింగ్‌పై రియాక్టైంది. కష్టం గురించి తెలియనివాళ్లు చేసే కామెంట్స్‌గా ఆమె ఈ ట్రోలింగ్‌ను కొట్టిపడేసింది. అసలీ ట్రోలింగ్‌ను పట్టించుకోవాల్సిన అవసరమే లేదని తెలిపింది. జీవితంలో ఏం సాధించలేని వారే ఇలాంటి మాటలు అంటుంటారని డైరెక్ట్‌గానే ట్రోలర్స్‌కి ఇచ్చి పడేసింది. ఆమె మాట్లాడుతూ..
‘‘ఒక సినిమా విడుదలై సక్సెస్ సాధించినప్పుడు ఇలాంటి ట్రోలింగ్ సహజమే. ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తుంటారు. ఇలాంటివన్నీ నేను ఎప్పటి నుండో చూస్తూ వస్తున్నాను. ఇవేం నాకు కొత్తకాదు. బాలకృష్ణగారితో డాన్స్ చేయడం, యాక్టింగ్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో ఆయన సినిమాలో నటించడం నాకు చాలా గర్వంగా ఉంది. బాలకృష్ణగారు ఒక లెజెండ్. ఆయనతో కలిసి నటించే అవకాశం నాకు రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో కలిసి నటించాలని ఎప్పటి నుండో నాకు డ్రీమ్ ఉంది. నా డ్రీమ్ ‘డాకు మహారాజ్’తో తీరింది. ఆయన సహనటులకు ఎంతో గౌరవం ఇస్తారు. సెట్‌లో ఆయన అందరితో ఉండే విధానం తెలిస్తే.. ఎవరూ ఆయన గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు. ‘దబిడి దిబిడి’ సాంగ్‌పై ట్రోల్స్ చేసేవారికి నేను చెప్పేది ఒక్కటే. లైఫ్‌లో ఏం సాధించలేని వారే.. కష్టపడి పనిచేసే వారిపై ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారు. నా దృష్టిలో రియల్ పవర్ అంటే.. ఇతరులను విమర్శించడం కాదు.. కష్టపడే వారి గొప్పతనాన్ని గుర్తించి, వారిని ఆదర్శంగా తీసుకోవమే..’’ అని ఊర్వశి రౌతేలా షాకింగ్‌గా రియాక్ట్ అయ్యారు.
ఆమె వ్యాఖ్యలను బాలయ్య ఫ్యాన్స్ కూడా స్వాగతిస్తున్నారు. చాలా బాగా చెప్పారు మేడమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఊర్వశి రౌతేలా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బాలయ్య సరసన శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ వంటి హీరోయిన్లు నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఓ కీలక పాత్రలో నటించగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. సంక్రాంతి స్పెషల్‌గా వచ్చిన ఈ సినిమా హౌస్ ఫుల్ బోర్డ్స్‌తో, అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతూ థియేటర్లలో దూసుకెళుతోంది.