కొన్ని సినిమాలు విడుదలై ఎన్నేళ్లు అయినా.. ఇంకా దానిని అభిమానించే ప్రేక్షకులు ఉంటారు. ముఖ్యంగా 1990ల్లో విడుదలైన ఎన్నో సినిమాలకు, అందులోని పాటలకు, నటీనటుల నటనకు ఇంకా ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి క్లాసిక్ సినిమాల్లో 1993లో విడుదలైన ‘ఖల్ నాయక్’ కూడా ఒకటి. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి 30 ఏళ్లు అవుతుంది. అయినా కూడా ఇప్పటికీ ఇందులోని పాటలు చాలామందికి ఫ్రెష్‌గా గుర్తున్నాయి. 1990ల్లో విడుదలైన చిత్రాల్లో ‘ఖల్ నాయక్’ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయినా కూడా అప్పట్లో దీనికి సంబంధించి తనను పలు విషయాలు బాధపెట్టాయి అంటూ డైరెక్టర్ సుభాష్ ఘాయ్ బయటపెట్టారు.


‘ఛోళీ కే పీచే’ కాంట్రవర్సీ..
‘‘నాకు ‘ఖల్ నాయక్’ గురించి ఇప్పటికీ బాగా గుర్తున్న విషయం ఏంటంటే.. కొందరు ప్రేక్షకులు ‘ఛోళీ కే పీచే’ పాటను అసభ్యకరమైనదని ముద్రవేశారు. అది నాకు చాలా బాధ కలిగించింది. ఒక పెద్ద షాక్‌లాగా తగిలింది. మేము దానిని ఒక ఫోక్ సాంగ్ అనుకొని, చాలా ఆర్టిస్టిక్‌గా చూపించాలని అనుకున్నాం, చూపించాం కూడా. కానీ సినిమా విడుదలైన తర్వాత మాత్రం పాట గురించి నిరసనలు జరిగాయి. ఒక్క న్యూస్ పేపర్ మాత్రం ఈ పాటను క్లాసిక్ అనడం మాత్రం నాకు ఇంకా గుర్తుంది. ఆ వార్త నాకు కాస్త ఉపశమనాన్ని ఇచ్చింది. అది ఒక ఫోక్ సాంగ్ అని ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు అర్థం చేసుకుంటున్నారు’’ అని ఈ 78 ఏళ్ల సీనియర్ దర్శకుడు సుభాష్.. ‘ఖల్ నాయక్’ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.


‘ఖల్ నాయక్’ అనేది సుభాష్ ఘాయ్ తెరకెక్కించిన సినిమాల్లోనే ఒక ట్రేడ్ మార్క్‌గా నిలిచిపోయింది. పూర్తిగా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలతో, భారీ క్యాస్టింగ్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. యాంటీ హీరో బల్లు పాత్రలో సంజయ్ దత్, పోలీస్ ఆఫీసర్ రామ్‌గా జాకీ ష్రాఫ్, అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గంగగా మాధురీ దీక్షిత్.. ఇలా అందరూ తమ బెస్ట్‌ను ఇచ్చారు. కానీ ‘ఖల్ నాయక్’ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి విడుదల అయిన తర్వాత వరకు కూడా ఈ మూవీ చుట్టూ ఎన్నో కాంట్రవర్సీలు తిరుగుతూ వచ్చాయి. ‘ఛోళీ కే పీచే’ పాట ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేస్తే.. ఈ సినిమా విడుదలకు కొన్నిరోజుల ముందే సంజయ్ దత్ టడా, ఆర్మ్స్ యాక్ట్‌లో అరెస్ట్ అవ్వడం మరో సెన్సేషన్‌గా మారింది. 


సంజయ్ దత్ అరెస్ట్..
సంజయ్ దత్ అరెస్ట్‌పై కూడా సుభాష్ ఘాయ్ స్పందించారు. ‘సంజయ్ అరెస్ట్ అయినప్పుడు ఇలాంటిది ఒక జరుగుతుందని ఎవ్వరం ఊహించలేదు. అంతా చాలా గందరగోళంగా ఉంది. మా సినిమా విడుదలకు అప్పటికీ రెండు నెలల సమయం ఉంది. అంతకు ముందు ఏడాది నుంచి షూటింగ్ జరుగుతుంది. అయినా కూడా సంజయ్ ఈ సినిమాలో టెర్రరిస్ట్ పాత్ర పోషిస్తున్నాడని ప్రేక్షకులు ఇష్టం వచ్చినట్టు అనుకోవడం మొదలుపెట్టారు. ఉత్సాహంలో ప్రజలు మాత్రమే కాదు.. మీడియా కూడా ఏవేవో పనులు చేసేస్తుంటుంది. కానీ కొంతకాలం గడిచిన తర్వాత వారు చేసింది తప్పు అని వారికే అర్థమయ్యింది.’ అని సుభాష్ ఘాయ్ తెలిపారు.


‘ఖల్ నాయక్’ కంటే ముందు సుభాష్ ఘాయ్.. మాధురీ దీక్షిత్, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్‌లతో సినిమాలు చేశాడు. కానీ ఈ మూవీతో మాత్రం ఈ ముగ్గురిని ఒకే ఫ్రేమ్‌లో చూపించాడు. అయితే ‘ఖల్ నాయక్’ 30 ఏళ్ల యానివర్సరీ సందర్భంగా ఈ మూవీ క్యాస్టింగ్‌ను ఎలా డిసైడ్ చేశారో గుర్తుచేసుకున్నారు. ‘ఒక కొడుకు, ప్రేమికుడు, టెర్రరిస్ట్.. ఇలా అన్ని షేడ్స్ ఉన్న మొహాన్ని నేను క్యాస్ట్ చేయాలనుకున్నాను. ఒక నటుడు ఏమీ మాట్లాడకుండా కళ్లతో భావాన్ని పలికించినప్పుడే తనలోని అసలైన నటుడు బయటపడతాడని నమ్ముతాను. సంజుకు మాత్రమే అలాంటి లక్షణాలు ఉన్నాయి. తన కళ్లలో ఉండే అమాయకత్వం, బాధ, కోపం అన్నీ ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాయి. కానీ ప్రేక్షకులు మాత్రం నా నిర్ణయం చూసి షాక్ అయ్యారు. సంజు, నేను కలిసి ఇది చేయగలమని నాకు తెలుసు.’ అంటూ 30 ఏళ్ల క్రితం తను తెరకెక్కించిన క్లాసిక్ చిత్రం ‘ఖల్ నాయక్’ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.


Also Read: రీమేక్స్‌పై స్పందించిన చిరంజీవి, అందుకే ‘వేదాళం’ ఒప్పుకున్నానని వివరణ


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial