సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నారు? పాన్ ఇండియా స్థాయిలో స్టార్స్ అందరూ తమ సినిమాలో ఉండేలా చూస్తున్నారా? ఒక్కో భాష నుంచి ఒక్కొక్క స్టార్‌ను తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారా? SSMB29లో చియాన్ విక్రమ్ నటించనున్నారని వార్తలు వచ్చిన తర్వాత మహేష్ రాజమౌళి అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులలో డిస్కషన్ జరిగింది. అయితే ఆ ప్రయత్నాలకు ఆదిలోనే అడ్డు తగిలింది.
మహేష్ సినిమాలో విక్రమ్ నటించడం లేదుమహేష్ బాబు, రాజమౌళి సినిమాలో గ్లోబల్ స్థాయిలో పేరు సొంతం చేసుకున్న హిందీ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. అలాగే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం ఉన్నారు. వాళ్ళిద్దరి క్యారెక్టర్లు ఏమిటనేది పక్కన పెడితే... సినిమాలో విలన్ రోల్ కోసం చియాన్ విక్రమ్ దగ్గరకు రాజమౌళి వెళ్లారట.
మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి విక్రమ్ ఎప్పుడు రెడీ. తమిళంలో ఆయన మరొక హీరోతో కలిసిన నటించిన సినిమాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి విలన్ రోల్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట. అందుకని రాజమౌళి ఇచ్చిన ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారట.
విక్రమ్ నో చెప్పిన తర్వాత మరొక తమిళ హీరో ఆర్ మాధవన్ (R Madhavan)ను రాజమౌళి అండ్ టీం అప్రోచ్ అయ్యిందట. ఆయన ఈ సినిమా చేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ సిటీలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్ వేశారు. అందులో ఫస్ట్ షెడ్యూల్ చేసిన తర్వాత మహేష్ బాబు, రాజమౌళి ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ టీమ్ ఒరిస్సా వెళ్ళింది. అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్ వచ్చిన టీం ఇక్కడ షూటింగ్ చేయడానికి ప్లాన్ చేసింది. సమ్మర్ హాలిడేస్ తీసుకోవడంతో కాస్త విరామం ఇచ్చారు. త్వరలో ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ మొదలు కానుంది. సుమారు 1000 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో దుర్గా ఆర్ట్స్ పతాకం మీద కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.