Actor Sriram about Bhumika: ఒకప్పుడు హీరోగా తెలుగు, తమిళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీరామ్. హీరోగా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్‌లో కూడా కనిపించాడు. కానీ మళ్లీ ఇప్పుడు లీడ్ రోల్స్‌లోనే బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే తను హీరోగా మొదటి సినిమా చేయడం వెనుక చాలా కష్టం దాగి ఉందని కొన్నిరోజుల క్రితం పాల్గొన్న ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ‘రోజా కూటమ్’ అనే చిత్రంతో శ్రీరామ్‌తో పాటు భూమిక కూడా ఒకేసారి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. శంకర్‌తో కలిసి సినిమా చేసిన అనుభవాలను కూడా బయటపెట్టాడు.


భూమిక పారిపోయింది..


దర్శకుడు తేజతో కలిసి పనిచేయాలని అనుకున్నా ఎందుకో కుదరలేదని చెప్పుకొచ్చాడు శ్రీరామ్. ‘‘ఆర్టిస్టుల జీవితం చాలా కష్టం. బయట నుండి చూసినట్టు ఉండదు. డైరెక్టర్ ఎన్ని తప్పులు చేసినా బయటికి రాదు. హీరోనే పాపం. భూమికతో నటించడం అద్భుతంగా అనిపించింది. తనతో గొడవలు కూడా ఉన్నాయి. సగం పాట షూటింగ్‌లో పారిపోయింది. మళ్లీ ఎయిర్‌పోర్టులో కలిసింది. షూటింగ్ ఎలా జరిగింది అని అడిగింది. కత్తి ఉంటే పొడిచేసేవాడిని’’ అని తెలిపాడు శ్రీరామ్. ‘రోజా కూటమ్’ సినిమాకు రెండేళ్లు కష్టపడ్డామని, చాలాసార్లు సినిమా ఆగిపోతుంది అనుకున్న పూర్తిచేశామని ఇంతకు ముందు కూడా పలుమార్లు బయటపెట్టాడు ఈ హీరో.


ఆర్టిస్ట్ అంటే తప్పులు చేస్తుంటారు..


పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్‌తో కలిసి ‘స్నేహితుడు’ సినిమా చేశాడు శ్రీరామ్. అందులో విజయ్, జీవా కూడా హీరోలుగా నటించారు. అయితే శంకర్ పెద్ద డైరెక్టరే అయినా అసలు ఎవరిపైనా కోప్పడరని, ఆర్టిస్టులతో బాగుంటారని చెప్పుకొచ్చాడు శ్రీరామ్. ‘‘కొందరు ఆర్టిస్టులు ఎప్పుడూ కోప్పడుతూ, అరుస్తూ ఉంటారు. కొందరు అయితే ఏకంగా కొట్టడానికి వెళ్తారు. అలా జరిగినప్పుడు ఆర్టిస్ట్ తప్పేం లేదని శంకర్ అంటారు. అదే నేను ఆయన నుండి నేర్చుకున్నాను. ఒకసారి స్నేహితుడు షూటింగ్‌లో ఒక ఆర్టిస్ట్ 12,13 టేక్స్ తీసుకున్నాడు. అసోసియేట్ డైరెక్టర్ అరిచాడు. అప్పుడే శంకర్ వచ్చి ఎందుకు అరుస్తున్నావు? ఆర్టిస్ట్ అంటే తప్పులు చేస్తుంటారు. మనమే నేర్పించాలి. అరిస్తే అయిపోతుందా అని చెప్పారు. ఆర్టిస్టులు తప్పులు చేయవచ్చు. టెక్నీషియన్స్ తప్పులు చేయకూడదు అని అన్నారు’’ అంటూ శంకర్ గురించి గొప్పగా మాట్లాడాడు శ్రీరామ్.


ఆయన యాక్టింగ్‌తోనే పోలుస్తారు..


‘‘3 ఇడియట్స్ హిందీలో పెద్ద హిట్ అయ్యింది. అది పాన్ ఇండియా మూవీ. అప్పటికే ప్రేక్షకులు అందరూ చూసేశారు. కానీ స్నేహితుడులో స్క్రీన్ ప్లేను మార్చి ముగ్గురు ఆర్టిస్టులను శంకర్ బాగా బ్యాలెన్స్ చేశారు. విజయ్ మా అందరికంటే పెద్ద హీరోనే అయినా డైరెక్టర్ ఎప్పుడూ సినిమాలో ముగ్గురు హీరోలు అనేవారు. ముగ్గురిలో ఎప్పుడూ తేడా చూపించలేదు. మాధవన్ చాలా గొప్ప యాక్టర్. నేను ఎంత చేసినా ఆయన యాక్టింగ్‌తోనే పోలుస్తారని నాకు తెలుసు. అందుకే ఎమోషనల్ సీన్ కోసం చాలా కష్టపడ్డాను. స్నేహితుడు సినిమా కాపీ కొట్టినట్టు ఎక్కడా అనిపించదు. ప్రతీదాంట్లో కొత్తదనం చూపించడానికే ప్రయత్నించాం. ప్రతీ నెల 5 కిలోలు బరువు తగ్గాను’’ అంటూ ‘స్నేహితుడు’ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు శ్రీరామ్.


Also Read: 'కలెక్షన్‌ కింగ్‌' మోహన్‌ బాబు బర్త్‌డే - ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలెన్నో తెలుసా?