ప్రముఖ నటి, అతిలోకసుందరి శ్రీదేవి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. దక్షిణాదితోపాటు ఉత్తరాదిని ఊపేసిన హీరోయిన్ ఆమె. తెలుగులో సినీ ప్రస్థానం ప్రారంభించినప్పటికీ.. తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ నటించి ఇండస్ట్రీ హద్దుల్ని చెరిపేసింది. అందంలోనూ నటనలోనూ తనకు తనే సాటి అనిపించుకున్న శ్రీదేవి.. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. నేడు శ్రీదేవి వర్ధంతి. సరిగ్గా నేటికి ఆమె చనిపోయి ఐదేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా శ్రీదేవి భర్త, సినీ నిర్మాత బోనీ కపూర్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఆమె ఫోటోని షేర్ చేస్తూ భార్య జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 


శ్రీదేవి 5వ వర్ధంతి నేపథ్యంలో బోనీ కపూర్ గత కొన్ని రోజులుగా దివంగత నటికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ వస్తున్నారు. ఫ్యామిలీతో తన చివరి చిత్రాన్నిపంచుకుంటూ.. నువ్వు ఐదు సంవత్సరాల క్రితం మమ్మల్ని విడిచిపెట్టావు. నువ్వు పంచిన ప్రేమ, నీతో గడిపిన అపురూప క్షణాలు మా మదిలో పదిలంగా ఉన్నాయి. నువ్వు మాతోనే ఎప్పటికీ ఉన్నాయి. నీ జ్ఞాపకాలు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి’’ అని బోనీ తన భావాలను పంచుకున్నారు. ఆ తర్వాత శ్రీదేవి తనకు ముద్దు పెడుతున్న ఫోటోను పోస్ట్ చేస్తూ “జస్ట్ ఎక్స్‌ప్రెసింగ్’’ అని క్యాప్షన్ పెట్టారు. 


అలానే ఇంస్టాగ్రామ్ స్టోరీలో ముద్దు పెట్టుకుంటున్న మరో చిత్రాన్ని పంచుకున్నారు బోనీ. ఈ ఫోటోలలో వారిద్దరూ కలిసి సంతోషకరమైన క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. దీనికి “సిగ్గు, ఇంట్రావర్ట్…. మరియు ఆమె ప్రేమలో పడినప్పుడు" అని రాసుకొచ్చారు. సోషల్ మీడియా వేదికగా తన భార్యకు నివాళులు అర్పించిన బోనీ.. శ్రీదేవితో తన మొదటి సమావేశాన్ని గుర్తుచేసుకున్న వీడియోను పంచుకున్నాడు. తనకు మొదటి చూపులోనే ఎలా ప్రేమ కలిగిందో తెలిపారు. 






 


డెబ్బైలలో ఒక తమిళ సినిమాలో ఆమెను మొదటిసారిగా చూడటం జరిగిందని.. ఇలాంటి వ్యక్తి కదా నా సినిమాలో ఉండాలి అని అనుకున్నానని బోణీ చెప్పారు. రిషి కపూర్‌తో ఓ సినిమా చేయాలని అనుకొని రైట్స్ తీసుకున్నానని.. రిషి సినిమా స్క్రిప్ట్‌ను చదవకముందే, శ్రీదేవిని హీరోయిన్ గా ఒప్పించడానికి చెన్నైకి వెళ్లానని.. అయితే ఆమె సింగపూర్‌లో మరొక చిత్రం షూటింగ్‌లో ఉన్నందున ఆమెను కలవలేకపోయాడని బోనీ వెల్లడించారు. ఆమె ఎప్పుడూ తన మనసులో ఉండేదని చెప్పాడు.


శ్రీదేవితో తన తొలి మీటింగ్ గురించి బోనీ కపూర్ మాట్లాడుతూ.. “నేను సెట్‌కి వెళ్లి, ఆమెను కలిశాను. ఆమెను కలిసినప్పుడు, కల నిజమైంది అనుకున్నాను. ఆమె ఒక ఇంట్రావర్ట్. అపరిచితులతో అంత ఈజీగా కలిసిపోలేదు. ఆ సమయంలో నేను అపరిచితుడిని. హిందీ ఇంగ్లీషు కలిపి ఆమె మాట్లాడిన కొన్ని మాటలు నన్ను కదిలించాయి. ఆమె గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగిపోయింది” అని చెప్పుకొచ్చారు. 


కొన్నేళ్లపాటు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన శ్రీదేవి.. బోనీకపూర్‌ తో పెళ్లయ్యాక 1997లో నటనకు కాస్త విరామం తీసుకుంది. ఆ తర్వాత 2012లో ‘ఇంగ్లిష్-వింగ్లిష్’ చిత్రంతో మళ్లీ సిల్వర్‌ స్ర్కీన్‌ పై రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఫిబ్రవరి 24, 2018న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. మేనల్లుడు మోహిత్ మార్వా వివాహానికి హాజరయ్యేందుకు దుబాయ్ కి ఫ్యామిలీతో కలిసి వెళ్లిన ఆమె.. తన హోటల్ గదిలోని బాత్రూం టబ్‌లో పడి తుది శ్వాస విడిచారు. అయితే అప్పట్లో ఆమె మరణంపై అనేక అనుమానాలు తలెత్తాయి. ప్రమాదవశాత్తు పడిపోయి మరణించినట్లుగా పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైంది.


Read Also: ఆ సినిమా ఓ అద్భుతం, 90 సెకన్ల టీజర్‌తో అంచనా వేసేస్తారా? - ‘ఆదిపురుష్’ ఎడిటర్ ఆశిష్