ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి వారసుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు శ్రీ సింహ కోడూరి. ‘యమదొంగ’, ‘మర్యాద రామన్న’ చిత్రాల్లో బాల నటుడిగా కనిపించాడు. ‘మత్తు వదలరా’ సినిమాతో హీరోగా మారాడు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ‘తెల్లవారితే గురువారం’, ‘దొంగలున్నారు జాగ్రత్త’ లాంటి సినిమాలు చేసినా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘ఉస్తాద్’. సాయి కొర్రపాటి, క్రిషీ ఎంటర్తైన్మెంట్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫణిదీప్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇన్స్పిరేషనల్, క్యూట్ లవ్ స్టోరీ మూవీలో ‘బలగం’ బ్యూటీ కావ్య కల్యాణ్ రామ్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.
ఆకట్టుకుంటున్న ‘ఉస్తాద్’ టీజర్
ఈ సినిమా టీజర్, ఆద్యంతం ఆకట్టుకుంటోంది. సింహా కోడూరి పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. మొదట్లో ఎత్తు నుంచి కిందకి చూడాలంటే భయపడే కుర్రాడిగా శ్రీ సింహా కనిపిస్తాడు. అనంతరం తనకున్న ఫోబియాను వదిలి పెట్టడంతో పాటు పైలెట్ గా మారుతాడు. ఈ టీజర్ లో హీరోగా శ్రీ సింహా చక్కటి నటనతో ఆకట్టుకున్నాడు. తన పాత బైక్ ను రిపేర్ చేయించి నడుపుతాడు. తండ్రి కోప్పడినా వేగంగా వెళ్లే వాహనాలతో పోటీపడి మరీ దూసుకెళ్తాడు. బైక్ నడిపే సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని ఎలా తట్టుకోవాలో నేర్చుకున్న మెళకులు పైలెట్ గా మారిన తర్వాత కూడా అతడికి ఎలా ఉపయోగపడతాయో టీజర్ లో చూపించారు. మొత్తంగా ఓ సాధారణ యువకుడు పైలెట్ గా ఎలా ఎదిగాడు అనేది ఈ టీజర్ లో చూపిచారు. కావ్య కల్యాణ్ రామ్ మరోసారి తన నేచురల్ నటనతో ఆకట్టుకుంది.
ఇక ఈ చిత్రానికి అదరిపోయే సినిమాటోగ్రఫీ అందించారు పవన్ కుమార్ పప్పుల. ఆయన కెమెరా పనితీరు టీజర్ లో అద్భుతంగా కనిపించింది. అకీవ బీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఆకట్టుకుంది. యువకులకు బాగా నచ్చిన RX 100 బైక్ ని ఈ సినిమాలో ‘ఉస్తాద్’ పేరుతో హీరో నడపటం ఆకట్టుకుంది. మొత్తంగా ఈ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ సినిమాతో నైనా శ్రీసింహ హిట్ అందుకుంటాడేమో చూడాలి.
త్వరలో విడుదల తేదీ వెల్లడి!
అటు ఈ టీజర్‌ను ఎస్ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ షేర్ చేశాడు. టీజర్ చాలా బాగుందని ట్వీట్ చేశారు. శ్రీ సింహకు మంచి గుర్తింపు తీసుకొస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. అటు ఈ సినిమా బృందానికి ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. వారాహి బ్యానర్‌లో బ్యానర్‌లో ‘ఉస్తాద్’ సినిమా రూపొందుతోంది. రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది.
Read Also: ఓటీటీలో విడుదలకు ‘కబ్జా’ రెడీ- ఎప్పుడు, ఎక్కడో తెలుసా?