బాలీవుడ్ హీరో ర‌ణబీర్ క‌పూర్ నటించిన తాజా సినిమా ‘తూ ఝూతీ మైన్ మ‌క్కార్’. త్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో జోరుగా ప్ర‌మోష‌న్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా కోల్ కతాకు వెళ్లిన ఆయన మూవీ ప్రచారంలో భాగంగా, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీతో మ్యాచ్ ఆడారు. గంగూలీ సార‌థ్యంలోని ఝూతి XI, ర‌ణ్ బీర్ క‌పూర్ సార‌థ్యంలోని మ‌క్క‌ర్ XI జట్లు  మ‌ధ్య ఈడెన్ గార్డెన్ లో స‌ర‌దాగా మ్యాచ్ జ‌రిగింది.


దాదా బౌలింగ్ లో రణబీర్ సిక్సర్


ఈ సంద‌ర్భంగా అద్భుత‌మైన బ్యాట్ మెన్ గా గుర్తింపు పొందిన  గంగూలీ బౌలింగ్ చేశాడు. ర‌ణ బీర్ క‌పూర్ బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరి ఆట చూసేందుకు అటు క్రికెట్ ఫ్యాన్స్ ఇటు సినీ అభిమానులు భారీగా త‌ర‌లి వ‌చ్చారు. వీరి మ్యాచ్ ను తెగ ఎంజాయ్ చేశారు. ర‌ణబీర్ కు గూంగూలీ 10 బాల్స్ వేశాడు. వీటిని అద్భుతంగా ఆడాడు. అందులో ఒక సిక్సర్ కూడా కొట్టాడు రణ్ బీర్. మ్యాచ్ వీడియోను యూట్యూబ్ లో ఎక్స్ ట్రా టైమ్ పోస్ట్ చేసింది. ఈ మ్యాచ్ కేవలం సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగానే ఏర్పాటు చేసిన‌ట్లు నిర్వాహ‌కులు వెల్లడించారు. ‘తూ ఝూతీ మైన్ మ‌క్కార్’ చిత్ర నిర్మాతలు, టి-సిరీస్ కలిసి ఈ మ్యాచ్ కు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌ వేదికగా విడుదల చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు. ఇక సినిమా మార్చి 8న విడుద‌ల కానుంది. 










గంగూలీ బయోపిక్ గురించి ఎలాంటి ఆఫర్ రాలేదు-రణబీర్


ఇక ఈ సందర్భంగా మాట్లాడిన ర‌ణబీర్ క‌పూర్... బెంగాల్ అంటేనే మొద‌ట‌గా గుర్తుకు వ‌చ్చేది సౌర‌వ్ గంగూలీ అన్నారు. ఆయనంటే తనకు ఎంతో గౌరవం అన్నారు. గంగూలీ బయోపిక్ గురించి అడిగిన ప్రశ్నలకు రణ్‌బీర్ కపూర్ స్పందించారు. సౌరవ్ గంగూలీ లాంటి క్రికెట్ ఆటగాళ్లు దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా లివింగ్ లెజెండ్ అని నేను భావిస్తున్నానన్నారు. ఆయన బయోపిక్ అంటే ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు. వాస్తవానికి తనకు ఈ సినిమా గురించి ఎలాంటి ఆఫర్ రాలేదని స్పష్టం చేశారు. 


కపూర్ ఫ్యామిలీపై గంగూలీ ప్రశంసలు


అటు గంగూలీ సైతం రణబీర్ ను ప్రశంసలతో ముంచెత్తారు. రణబీర్ నటించిన ప్రతి సినిమా తాను చూసినట్లు గంగూలీ వివరించాడు. త్వరలో విడుదల కానున్న ఆయన సినిమాకు శుభాకాంక్షలు చెప్పారు.  ఈ సందర్భంగా కపూర్ కుటుంబంపై ప్రశంసలు కురిపించారు. నటన వారి డీఎన్ఏలోనే ఉందన్నారు. రణబీర్ ఎంతో ప్రతిభావంతులైన నటుల కుటుంబం నుంచి వచ్చారన్నారు. అతడి తల్లిదండ్రులు గొప్ప నటులని చెప్పారు. ఆయన భార్య కూడా మంచి నటి అని వివరించారు. అతడు ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని, ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఇక ర‌ణబీర్ క‌పూర్ నటించిన తాజా సినిమా ‘తూ ఝూతీ మైన్ మ‌క్కార్’ ఈ నెల 8న విడుద‌ల కానుంది.


Read Also: అమ్మో తాత, అన్ని సినిమాలు చూశావా, పుస్తకంలో తేదీలతో సహా రాసుకున్న పెద్దాయన!