తెలుగులో ఎన్ని ప్రేమకథా చిత్రాలు వచ్చినా, ‘7/జీ బృందావన కాలనీ’కి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. సెల్వరాఘన్ తెరకెక్కించిన ఈ మూవీ, యువతను ఓరేంజిలో ఆకట్టుకుంది. 2004లో ‘7/జీ రెయిన్‍బో కాలనీ’ పేరుతో తమిళంలో విడుదలైన ఈ సినిమా, అదే ఏడాది ‘7/జీ బృందావన కాలనీ’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో ఈ అద్భుత విజయాన్ని అందుకుంది. మళ్లీ 19 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తెలుగులో రీ రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ 22న 4K వెర్షన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
హైదరాబాద్ లో ‘7/జీ బృందావన కాలనీ’ రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్
తాజాగా ‘7/జీ బృందావన కాలనీ’ రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను చిత్రబృందం హైదరాబాద్ లో నిర్వహించింది. ఈ వేడుకలో హీరో, హీరోయిన్లు రవి కృష్ణ, సోనియా అగర్వాల్, నిర్మాత ఎ ఎం రత్నం, ఇతర నటీనటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవి కృష్ణ ఈ సినిమాకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు.
క్లైమాక్స్ చూస్తే డిప్రెషన లోకి వెళ్లిపోతా- రవికృష్ణ
ఈ సినిమా రీ రిలీజ్ ట్రైలర్ చూస్తుంటే పాతరోజులు మళ్లీ గుర్తుకు వచ్చాయన్నారు హీరో రవికృష్ణ. ఇందులోని సీన్లు జ్ఞాపకం వస్తే.. ఇప్పటికీ కన్నీళ్లు వస్తాయన్నారు. ఈ చిత్రంలో తన పాత్రకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయినట్లు వెల్లడించారు. అంతేకాదు, ఇప్పటి వరకూ ఈ సినిమాను ఓకేసారి పూర్తిగా చూసినట్లు వివరించారు. ఈ సినిమాలోని ఎండింగ్ సీన్లు చూస్తే ఇప్పటికీ డిప్రెషన్ లోకి వెళ్లిపోతానని చెప్పారు. అందుకే, ఈ సినిమాను ఎప్పుడూ పూర్తిగా చూడనని చెప్పారు. ఈ సినిమా షూటింగ్ రోజులలోనూ ఇంట్లో ఏదో ఆలోచిస్తూ కూర్చునేవాడినని చెప్పారు. తనను అలా చూసి అమ్మ బెంగపడేదన్నారు. ఈ సినిమాకు సీక్వెల్ ను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఈ సినిమా కథ ఉండబోతుందన్నారు రవికృష్ణ.
వచ్చే నెల నుంచి సీక్వెల్ పనులు షురూ-ఎంఎం రత్నం
ఇక తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు నిర్మాత ఎంఎం రత్నం. ‘కర్తవ్యం’, ‘భారతీయుడు’ లాంటి అద్భుత చిత్రాలను నిర్మించినట్లు వెల్లడించారు. అయితే, తాను నిర్మించిన చిత్రాల్లో ‘7జీ బృందావన కాలని’ ఒక కల్ట్ మూవీ అని చెప్పారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మరోసారి తప్పకుండా ఆదరిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ పనులు వచ్చే నెల నుంచి మొదలుకానున్నట్లు చెప్పారు. ‘7జీ బృందావన కాలని’ని తెరకెక్కించిన సెల్వరాఘవన్ సీక్వెల్‌ను తెరకెక్కిస్తారని చెప్పారు. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయినట్లు వెల్లడించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా హీరోయిన్ సోనియా అగర్వాల్, నటుడు సుమన్ శెట్టికూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఇక ‘7/జీ బృందావన కాలనీ’ చిత్రంలో రవి కృష్ణ, సోనియా అగర్వాల్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా అలరించింది. కొడుకుపై ఓ మధ్య తరగతి తండ్రి ఎలా ఆలోచిస్తారన్న అంశాన్ని కూడా భావోద్వేగంగా చూపారు. హీరో తండ్రి పాత్రలో చంద్రమోహన్ ఈ చిత్రంలో అద్భుతంగా చేశారు. ఎమోషనల్ సీన్లలో కంటతడి పెట్టించారు. సుధ, సుమన్ శెట్టి, సుదీప పింకీ, రథన్, సవిత్ ప్రభునే, మనోరమ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు.
Read Also: నాగ చైతన్య రెండో పెళ్లి వార్తల్లో వాస్తవం లేదట- కానీ, ఆమెతో ప్రేమలో ఉన్నారట!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial