గానకోకిల పి సుశీల అభిమానులు అందరికీ శుభవార్త. ఆవిడ క్షేమంగా ఉన్నారు. సురక్షితంగా ఇంటికి వచ్చారు. అనారోగ్య కారణాల వల్ల కొన్ని రోజుల క్రితం ఈ ప్రముఖ గాయని చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత పాటను, ఆవిడను అభిమానించే ప్రజలలో కాస్త ఆందోళన వ్యక్తం అయ్యింది. సుశీలమ్మకు ఏం అవుతుందోనని కంగారు పడ్డారు. ఆ ఆందోళనను తీసి పక్కన పారేయవచ్చు. ఆవిడ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  


అభిమానుల ప్రార్థనలు నన్ను రక్షించాయి! - సుశీల
''ఇప్పుడు నేను ఇంటికి వచ్చాను. ఆస్పత్రి నుంచి విడుదల అయ్యాను. నన్ను ఆరోగ్యంగా, సంతోషంగా ఇంటికి పంపించారు. మీ ప్రార్థనలు నన్ను రక్షించాయి. దేవుడిని నమ్మిన వాళ్ళు ఎప్పటికీ చెడరు. నన్ను రక్షించినట్టు భగవంతుడు మీ అందరినీ రక్షిస్తాడు. మీ అందరికీ కోటి దండాలు, కోటి నమస్కారాలు. ఎప్పుడూ చల్లగా ఉండాలి. ఆయుష్మాన్ భవ'' అని పి సుశీల ఓ వీడియో సందేశం విడుదల చేశారు.


Also Read: వెండితెరపైకి సిక్సుల వీరుడు యువరాజ్ సింగ్ జీవితం... సినిమాలో క్రికెట్ నుంచి క్యాన్సర్ పోరాటం వరకు!






ఇప్పుడు సుశీల వయసు 88 సంవత్సరాలు. నిన్న మొన్నటి వరకు ఆవిడకు పెద్ద అనారోగ్య సమస్యలు ఉన్నట్లు ఇటు మీడియా దృష్టికి గానీ, అటు ప్రజల దృష్టికి గానీ రాలేదు. వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు తప్ప సుశీలకు మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ఎప్పుడూ బయటకు రాలేదు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆస్పత్రిలో చేరడంతో అభిమానులు కంగారు పడ్డ మాట వాస్తవం. ఇప్పుడు వారు నిశ్చితంగా ఉండొచ్చు.


Also Read: వేట్టయాన్ వర్సెస్ కంగువ... దసరా బరిలో రజనీకాంత్, సూర్య సినిమాకు పోటీగా



ఐదు సార్లు జాతీయ అవార్డు అందుకున్న ఉత్తమ గాయని!
ఈతరం ప్రేక్షకులకు సుశీల తెలిసే అవకాశం తక్కువ. సినిమా పాటలకు ఆవిడ దూరం అయ్యి సుమారు పదేళ్లు అవుతుంది. ఆధాత్మిక చింతనకు ఎక్కువ టైం కేటాయిస్తున్నారు ఆవిడ. సుశీల గురించి చెప్పాలంటే... ఆవిడకు వచ్చిన అవార్డుల గురించి చెబితే చాలు!


ఐదు సార్లు ఉత్తమ గాయనిగా కేంద్ర ప్రభుత్వం నుంచి సుశీల జాతీయ పురస్కారం అందుకున్నారు. ఇక... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన నందులు, అదే విధంగా తమిళనాడు - కేరళ ప్రభుత్వాల నుంచి పలు రాష్ట్ర అవార్డులు అందుకున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 40 వేలకు పైగా పాటలకు ఆవిడ తన గొంతుతో ప్రాణం పోశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సొంతం చేసుకున్నారు.



'కన్నతల్లి' సినిమాతో వెండితెరపై గాయనిగా మొదలైన సుశీల ప్రస్థానం ఆ తర్వాత విజయవంతంగా కొనసాగింది. 'దొంగ రాముడు', 'మిస్సమ్మ', 'మాయబజార్', 'అప్పు చేసి పప్పు కూడు', 'గుండమ్మ కథ', 'తోడికోడళ్లు', 'సీతారామ కళ్యాణం', 'డాక్టర్ చక్రవర్తి', 'ప్రేమ్ నగర్', 'ఆస్తులు - అంతస్తులు', 'దేశోద్ధారకుడు', 'మూగమనసులు', 'లవకుశ', 'సిరిసిరి మువ్వ', 'మేఘ సందేశం', 'ఎమ్మెల్యే ఏడుకొండలు' తదితర విజయవంతమైన సినిమాల్లో ఆవిడ పాడారు.