సింగర్ మనో గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. నాలుగు దశాబ్దాలుగా సినీ రంగంలో కొనసాగుతున్నారు. పలు భాషల్లో వేల కొద్ది పాటలు పాడారు. అంతేకాదు, బుల్లితెరపై పలు షోలకు జడ్జిగానూ వ్యవహరించారు. నటుడిగాను, డబ్బింగ్ ఆర్టిస్టుగానూ తెలుగు సినీ అభిమానులందరికీ ఆయన సుపరిచితం.


మనోకు డాక్టరేట్ అందించిన రిచ్‌మండ్ గాబ్రియేల్ యూనివర్శిటీ


సినీ సంగీత ప్రపంచానికి మనో  చేస్తున్న సేవలకు గుర్తుగా ఆయనకు గౌరవ డాక్టరేట్ దక్కింది.  రిచ్‌మండ్ గాబ్రియేల్ యూనివర్శిటీ ఆయనకు డాక్టరేట్ పట్టా అందించింది. 15 భారతీయ భాషల్లో 25 వేలకు పైగా పాటలను పాడారు మనో. గాయకుడిగా, సంగీతకారుడిగా భారతీయ సంగీత పరిశ్రమలో 38 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.  డాక్టరేట్ అందుకున్న సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. సోషల్ మీడియాలో డాక్టరేట్ పట్టా అందుకున్న అనంతరం తన ఫోటోను షేర్ చేశారు. ఇంత కాలం మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పటికీ ప్రేమాభిమానాలు ఇలాగే ఉండాలని ఆకాంక్షించారు.






15 భాషల్లో 25 వేల పాటలు పాడిన మనో


నిజానికి మనో అనేది ఆయన అసలు పేరు కాదు, నాగూర్ బాబు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలోనూ ఆయన పేరు ఇదే. కొంత కాలం తర్వాత తన పేరును మనోగా మార్చుకున్నారు. సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర తొలినాళ్లలో అసిస్టెంట్ గా పని చేశారు. సంగీత ఓనమాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత గాయకుడిగా మారారు.  తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలి సహా 15 భారతీయ భాషల్లో 25 వేలకు పైగా పాటలు పాడారు. డబ్బింగ్ ఆర్టిస్టుగానూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.


ఇళయరాజా, చక్రవర్తి దగ్గర సంగీత ఓనమాలు నేర్చుకున్న మనో


మనో సొంతూరు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి. తల్లి దండ్రులు రసూల్, షహీదా. మనో తండ్రి ఆల్ ఇండియా రేడియోలో పని చేశారు. చిన్ననాటి నుంచి మనోకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఆయనలోని సంగీత అభిమానాన్ని గుర్తించి తన తండ్రి శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత ఇళయరాజా దగ్గరికి చేరారు. ఆయనే తన పేరును నాగూర్ బాబు నుంచి మనోగా మార్చారు. ఇళయరాజా ఆయనతో ఎన్నో పాటలు పాడించారు. ఆ తర్వాత చక్రవర్తి దగ్గర అసిస్టెంట్ గా పెట్టించారు ఇళయరాజా. ఆ తర్వాత సంగీతంలో పూర్తి స్థాయి మెళకువలు నేర్చుని చక్కటి గాయకుడిగా మారారు. మురళీ మోహన్ నటించిన ‘కర్పూరదీపం’ సినిమాలో మనో తొలిసారి పాట పాడారు. ఆ తర్వాత చక్కటి గాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.


1985లో తన 19వ ఏట జమీలాను మనో పెళ్లి చేసుకున్నారు. మనోకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె జన్మించారు. పెద్ద కొడుకు షకీరా తమిళ సినిమాల్లో నటుడిగా కొనసాగుతున్నారు. రెండో కొడుకు రతేష్ ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కూతురు సోపికా సంగీతం నేర్చుకుంటోంది. ఆమె కూడా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది.   


Read Also: బాక్సాఫీస్ దగ్గర చతికిల పడిన ‘శాకుంతలం’ - మరీ ఇంత తక్కువ?