Silk Smitha Biopic : సిల్క్ స్మిత.. ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా ఈ పేరు తెలియకపోవచ్చు కానీ.. 80స్, 90స్ బ్యాచ్‌ ఆరాధించిన నటి సిల్క్ స్మిత. స్టార్ హీరోలు ఎంతమంది ఉన్నా.. సిల్క్ స్మిత పాట ఉందంటే చాలు అప్పట్లో టిక్కెట్లు తెగిపడేవి. ఇప్పుడు ఐటమ్ సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ అని హీరోయిన్లు రెండు చేతులా సంపాదిస్తున్నారంటే.. ఆరోజుల్లో సిల్క్ వేసిన పునాదే అది. అందుకే ఇప్పటికీ ఆమె పేరు ఫేమస్‌ అవుతూనే ఉంటుంది. అప్పుడప్పుడు ట్రెండ్‌లోకి వస్తూనే ఉంటుంది.


సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె తన పేరును సిల్క్ స్మితగా మార్చుకున్నారు. బాలీవుడ్ నటి విద్యాబాలన్‌కు పునర్జన్మని ఇచ్చిన ‘డర్టీ పిక్చర్’ మూవీ సిల్క్ స్మిత జీవిత స్టోరీ అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరో నటి ఆమె జీవిత చరిత్రను నమ్ముకుని మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. ఇంతకీ ఆమె ఎవరని అనుకుంటున్నారా.. ఇటీవల వచ్చిన నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమాలో ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే’ అనే పాటలో గ్లామర్ ప్రదర్శనతో రచ్చలేపిన చంద్రికా రవి.


Also Read: 'దసరా' దర్శకుడికి అవకాశం ఇస్తున్న చిరంజీవి - మెగా మాస్ మూవీ లోడింగ్?


సిల్క్ స్మిత లైఫ్ స్టోరీతో ప్రస్తుతం తెరకెక్కుతోన్న చిత్రం ‘సిల్క్ స్మిత- ది క్వీన్ ఆఫ్ ది సౌత్’. ఈ సినిమాలో సిల్క్ స్మితగా చంద్రికా రవి నటిస్తోంది. సిల్క్ స్మిత జయంతి (డిసెంబర్ 2)ని పురస్కరించుకుని మూవీ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ని మేకర్స్ వదిలారు. ఈ సినిమాలో సిల్క్ స్మిత‌కు సంబంధించిన ‘ది అన్‌టోల్డ్ స్టోరీ’ని, ఆమె కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో ప్రేక్షకులకు చెప్పబోతున్నామని మేకర్స్ చెబుతున్నారు. ‘సిల్క్ స్మిత- ది క్వీన్ ఆఫ్ ది సౌత్’ సినిమాను ఎస్‌టిఆర్‌ఐ సినిమాస్‌ పై ఎస్ బి విజయ్ నిర్మిస్తుండగా.. వి. మహాస్త్రీ అమృతరాజ్ సమర్పిస్తారు. రచన, దర్శకత్వం జయరామ్. సిల్క్ స్మిత అధికారిక బయోపిక్‌గా రానున్న ఈ చిత్రాన్ని 2025లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.



ఈ మూవీ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ని గమనిస్తే.. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ‌తో సిల్క్ స్మిత ఇంట్రడక్షన్‌ని ప్లాన్ చేసిన విధానం హైలెట్‌గా ఉంది. కొన్ని పేపర్లు చూస్తూ.. ఈ సిల్క్ ఎవరు? అని ఇందిరా గాంధీ అడిగితే.. ‘మీరు ఐరన్ లేడీ అయితే.. ఆమె మాగ్నటిక్ లేడీ’ అంటూ సిల్క్‌ స్మితకి ఇచ్చిన ఎలివేషన్ మాములుగా లేదు. మరో వైపు సిల్క్ స్మిత పాత్రలో చంద్రికా రవి అచ్చుగుద్దినట్లుగా ఉండటం ఈ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. సిల్క్ స్మిత కారులో నుండి దిగి నడిచివస్తుంటే.. వీధిలో యాక్సిడెంట్స్ అయ్యేవని అప్పట్లో టాక్ ఉండేది. సేమ్ సీన్‌ని ఈ వీడియోలో మేకర్స్ చంద్రికా రవిపై చిత్రీకరించారు.


సిల్క్ స్మితలా ఆమె నడిచి వస్తుంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ నోరెళ్లబెట్టి ఆమెనే చూస్తుండటం ఈ వీడియోలో గమనించవచ్చు. ఓ అభిమాని తన గుండెలపై ఆమె ఆటోగ్రాఫ్ చేయించుకోవడం వంటి సన్నివేశాలతో వచ్చిన ఈ అనౌన్స్‌మెంట్ వీడియో ఒక్కసారిగా సిల్క్ స్మిత గురించి అంతా మాట్లాడుకునేలా చేస్తోంది. ఈ వీడియో లాస్ట్‌లో సిల్క్ కళ్లని మాత్రమే చూపిస్తూ.. ఆమె లైఫ్‌ని పరిచయం చేసిన తీరు హ్యాట్సాఫ్ అనేలా ఉంది.



Read Also : "పీలింగ్స్" సాంగ్ పక్కా లోకల్... పాడింది ఈ పాపులర్ జానపద గాయకులే అని తెలుసా?