ఎన్నో నిరసనలు, ఆందోళనల నడుమ విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. కనీవినీ ఎరుగని రీతిలో కలెక్షన్లు వసూళు చేస్తోంది. మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. సుదీప్తోసేన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి విపుల్‌ అమృత్‌ లాల్‌ షా నిర్మాతగా వ్యవహరించారు. విడుదలకు ముందు నుంచే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.  తాజాగా ఈ చిత్రం వసూళ్ల విషయంలో కొత్త రికార్డును సాధించింది. ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించి లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా నిలిచింది.


‘ది కేరళ స్టోరీ’ తీవ్రవాదాన్ని వ్యతిరేకించే చిత్రం


ఇక ఈ చిత్రంలో గీతాంజలి అనే కీలక పాత్రలో సిద్ధి ఇద్నాని నటించింది. ఈ చిత్రంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో, సినిమాలో తప్పుగా ఏం చూపించలేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. అంతేకాదు,  ఈ మూవీ వివాదాస్పద  చిత్రం కాదని చెప్పుకొచ్చింది. అవగాహన కలిగించే సినిమాగా అభివర్ణించింది. ఇది ఏ మతాన్ని వ్యతిరేకించే చిత్రం కాదని, తీవ్రవాదాన్ని వ్యతిరేకించే చిత్రమని తేల్చి చెప్పింది.  అలాంటి చిత్రంలో నటించడం పట్ల తాను గర్వంగా ఫీలవుతున్నట్లు వెల్లడించింది. ఈమె వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.






ఈ సినిమా చూసి ఏడ్చాను!


‘ది కేరళ స్టోరీ’ చిత్రంలో హిందూ అమ్మాయి గీతాంజలి మీనన్ పాత్రను సిద్ధి ఇద్నానీ పోషించింది. ఇస్లాం మతంలోకి మారిన ముగ్గురు అమ్మాయిలలో ఈమె ఒకరుగా కనిపిస్తారు. కానీ, వెంటనే విషయం తెలుసుకుని, ఆ ఉచ్చు నుంచి బయటపడుతుంది. తిరిగి తన సొంత మతంలోకి అడుగు పెడుతుంది. ఈ సినిమాను తొలిసారి చూసినప్పుడు ఎంతో ఆవేదన కలిందని చెప్పింది. తాను ఇప్పటి వరకు ఏ సినిమా చూసి ఏడ్వలేదని, తొలిసారి ఈ సినిమా చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయని చెప్పింది. అంతేకాదు, తన తల్లిదండ్రులు కూడా ఈ సినిమాను చూసి కంటతడి పెట్టినట్లు వివరించారు. ఈ సినిమాతో తాను నటించడం పట్ల వాళ్లు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు.


ఇక ఈ సినిమాను కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా తప్పుబట్టగా, ప్రధాని మోదీ ప్రశంసించారు. మరోవైపు ఈ సినిమా ప్రదర్శనను నిషేధిస్తున్నట్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉత్తర బెంగాల్ జిల్లాల ప్రజలు ఈ సినిమా చూడటానికి అస్సాం, సిక్కిం రాష్ట్రాలకు వెళ్తున్నారని దర్శకుడు సుదీప్తోసేన్‌ వెల్లడించారు.   






అటు సిద్ధి ఇద్నానీ హీరో శింబు హీరోగా నటించిన ‘వెందు తనిందది కాడు’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. హరీష్‌ కల్యాణ్‌ తో కలిసి నటించిన ‘నూరు కోడి వానవిల్‌’ చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది.  ప్రస్తుతం ఆర్యతో కలిసి ‘ఖాదర్‌ భాషా’ చిత్రంలో నటిస్తోంది. తెలుగులో ‘జంబలకిడి పంబ’(2018), ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’, ‘ప్రేమకథా చిత్రం 2’ సినిమాల్లో నటించింది.


Read Also: ఐపీఎస్ అధికారితో గొడవ - 'ఖిలాడీ' హీరోయిన్ డింపుల్ హయతిపై కేసు