తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తమిళ సీనియర్ కథానాయకుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్యరాజ్ (Sathyaraj). ఆయన తనయుడు సిబి సత్యరాజ్ సైతం హీరోయే. తమిళంలో కొన్ని సినిమాలు చేశారు. తెలుగులో డబ్బింగ్ అయినా పెద్దగా ఆడలేదు. సిబి సత్యరాజ్ (Sibi Sathyaraj)కు ఒక సిస్టర్ ఉన్నారు. ఆవిడ పేరు దివ్య సత్యరాజ్ (Divya Sathyaraj). ఇప్పుడు సత్యరాజ్ సంతానం గురించి ఎందుకు? అంటే... వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతోంది. అదీ కుటుంబ ఆస్తులు లేదా పంపకాల విషయంలో కాదు! దళపతి విజయ్ విషయంలో! ఆ వివరాల్లోకి వెళితే...
కట్టప్ప కుటుంబంలో గొడవ...దళపతికి మద్దతుగా కొడుకు!'బాహుబలి' సినిమాలో మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టు బానిస కట్టప్పగా సత్యరాజ్ నటించారు. శివగామి, బాహుబలిపై అభిమానం చూపిస్తాడు కట్టప్ప. తమిళనాడులో దళపతి విజయ్ (Thalapathy Vijay)కు సిబి సత్యరాజ్ కూడా అంతే అభిమానం చూపిస్తున్నాడు. విజయ్ కోసం ఏకంగా సోదరిని విమర్శించారు. ఆ విషయంలోకి వెళితే...
సత్యరాజ్ కుమార్తె దివ్య న్యూట్రిషనిస్ట్. అలాగే, సామాజిక కార్యక్రమాల్లో కూడా ముందు నుంచి చురుగ్గా పాల్గొన్నారు. ఐదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన దివ్య... గతేడాది (2025)లో ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో డీఎంకే పార్టీలో చేరారు. టీవీకే పార్టీ స్థాపించిన విజయ్... రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెల్సిందే. డీఎంకే, టీవీకే మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ తరుణంలో విజయ్ మీద విమర్శల వర్షం కురిపించారు దివ్య.
విజయ్ విడాకుల గురించి వాడివేడి చర్చ జరుగుతోన్న నేపథ్యంలో వ్యక్తిగత విషయాల గురించి తాను మాట్లాడానని దివ్య సత్యరాజ్ తెలిపారు. అయితే... రాజకీయాల్లోకి వచ్చే ముందు ప్రజలకు విజయ్ ఏం చేశారో చెప్పాలని, ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. తన తల్లి పేరు మీద ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించి పేదలకు పోషకాహారం, టాబ్లెట్స్ వంటివి తాను అందించానని దివ్య సత్యరాజ్ చెప్పారు. విజయ్ అభిమానులు, టీవీకే పార్టీ కార్యకర్తలు మహిళల గురించి తప్పు తప్పుగా మాట్లాడుతున్నారని దుమ్మెత్తి పోశారు.
చెల్లికి కౌంటర్ ఇచ్చిన అన్నయ్య!విజయ్ మీద దివ్య సత్యరాజ్ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో... దళపతికి మద్దతుగా దివ్య అన్నయ్య, హీరో సిబి సత్యరాజ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ చేశారు. విజయ్ ఇచ్చిన విరాళాల గురించి ఓ వీడియో షేర్ చేశారు. దివ్య మాత్రమే కాదు... సత్యరాజ్ కూడా డీఎంకే పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. అయితే... సిబి మాత్రం విజయ్ వీరాభిమాని. అందుకని, దళపతికి మద్దతు ఇస్తున్నారు.
Also Read: Ustaad Bhagat Singh: వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డీఎస్పీ?
