బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి సినిమాలు చూసే తెలుగు ప్రేక్షకులకు శ్రేయాస్ తల్పాడే (Shreyas Talpade) పరిచయమే. 'గోల్ మాల్' ఫ్రాంచైజీలో లక్ష్మణ్ పాత్ర ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 'ఓం శాంతి ఓం' సహా పలు హిట్ సినిమాల్లో శ్రేయాస్ నటించారు. 'పుష్ప', 'పుష్ప 2'లో అల్లు అర్జున్ పాత్రకు హిందీలో డబ్బింగ్ చెప్పారు. ఇప్పుడు ఆయన తెలుగు తెరకు (Shreyas Talpade Telugu Debut) పరిచయం అవుతున్నారు.
తెలుగు తెరకు 'అజాగ్రత్త'తో!
శ్రేయాస్ తల్పాడే తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న సినిమా 'అజాగ్రత్త' (Ajagrath Movie). ఇందులో కన్నడ భామ రాధికా కుమారస్వామి (Radhika Kumaraswamy) హీరోయిన్. ఈ చిత్రానికి ఎం శశిధర్ దర్శకుడు. రవి రాజ్ నిర్మాత. హైదరాబాదులో శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత 'ఠాగూర్' మధు కెమెరా స్విచ్ఛాన్ చేయగా... ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం క్లాప్ ఇచ్చారు.
ఏడు భాషల్లో 'అజాగ్రత్త'...
సాధారణంగా పాన్ ఇండియా సినిమాలు అంటే దక్షిణాది భాషలైన తెలుగు, కన్నడ, తమిళ, మలయాళంతో పాటు హిందీలో విడుదల చేస్తున్నారు. కానీ, ఈ సినిమాను ఈ ఐదు భాషలతో పాటు మరాఠీ, బెంగాలీలో కూడా విడుదల చేయనున్నట్లు దర్శకుడు ఎం శశిధర్ చెప్పారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని వివరించారు. మంచి నిర్మాణ సంస్థలో సినిమా చేసే అవకాశం రావడం, రాధికా మేడం స్క్రిప్ట్ ఓకే చేయడం సంతోషంగా ఉందన్నారు.
త్వరలో తెలుగు నేర్చుకుంటా! - శ్రేయాస్ తల్పాడే
సినిమా ప్రారంభోత్సవంలో శ్రేయాస్ తల్పడే మాట్లాడుతూ... ''మీ అందరికీ నమస్కారం. 'అజాగ్రత్త' టీంకు కృతజ్ఞతలు చెబుతున్నాను. ప్రస్తుతానికి ఈ రెండు పదాలే నేర్చుకున్నా. త్వరలో తెలుగు నేర్చుకుంటా'' అని చెప్పారు. ''శ్రేయాస్ తల్పాడే పని చేస్తుండటం ఆనందంగా ఉంది. దర్శకుడు శశిగారు నాకు చాలా రోజుల నుంచి పరిచయం. నాకు అవకాశం ఇచ్చిన ఆయనకు థాంక్స్'' అని శ్రవణ్ చెప్పారు.
సినిమాను నేనే నిర్మించాలి కానీ... రాధికా కుమారస్వామి
'అజాగ్రత్త'ను తాను నిర్మించాలని అనుకున్నాను కానీ ఈ సినిమాలో కథానాయికగా చేస్తానని అనుకోలేదని రాధికా కుమారస్వామి తెలిపారు. ఇంకా ఆమె మాట్లాడుతూ ''కథానాయికగా ఎవరూ సెట్ అవ్వడం లేదని దర్శకుడు కంగారు పడుతున్నారు. 'నా డేట్స్ కావాలా?' అని అడిగా. స్క్రిప్ట్ విన్నాక షాక్ అయ్యా. కథ అంత నచ్చింది. శ్రేయాస్ నటించిన సినిమాలు చూశా. ఆయన బాగా నవ్విస్తారు. ఈ సినిమాలో ఆయనతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది'' అని చెప్పారు.
Also Read : భద్రాచల రామయ్యకు వెండితెర రామయ్య 'ఆదిపురుష్' ప్రభాస్ విరాళం
రావు రమేష్, సునీల్, ఆదిత్య మీనన్, రాఘవేంద్ర శ్రవణ్, జయ్ ప్రకాష్, వినయ ప్రసాద్, దేవ్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్ : రవి వర్మ, సహ నిర్మాత : యాదవ్, ఛాయాగ్రహణం : సందీప్ వల్లూరి, సంగీతం : శ్రీహరి.