Sharathulu Varthisthai Trailer: ఈమధ్య తెలుగులో చిన్న సినిమాలకు మంచి ఆదరణ దక్కుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ నేటివిటీతో రూపొందే సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అందుకు ఉదాహరణగా 'బలగం' సినిమాని తీసుకోవచ్చు. జబర్దస్త్ వేణు డైరెక్ట్ చేసిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకోవడంతోపాటు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు దక్కించుకుంది. సినిమాకి స్టార్ కాస్ట్ అవసరం లేదు.. కంటెంట్ ముఖ్యం అని నిరూపించింది.


అదే దారిలో పలు చిన్న సినిమాలు మంచి కంటెంట్ తో తెరకెక్కుతున్నాయి. ఇదే తెలంగాణ నేటివిటితో త్వరలోనే ఓ డిఫరెంట్ కంటెంట్ తో 'షరతులు వర్తిస్తాయి' అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 30 వెడ్స్ 21 సిరీస్ తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతన్య రావు ఈ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు. అతని సరసన భూమి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.


మధ్య తరగతి వాడి జీవితంలో బోగస్ కంపెనీ చిచ్చు పెడితే..


'షరతులు వర్తిస్తాయి' సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ లైఫ్ గురించి ఈ ట్రైలర్ లో చూపించారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ కంటెంట్ బాగా కనెక్ట్ అవుతుంది. ఇక టైలర్ విషయానికొస్తే.. చిరంజీవి, విజయశాంతి ఇద్దరు చిన్ననాటి నుంచి ప్రేమించుకుంటారు. ఊళ్ళో ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. మధ్యతరగతి ఆప్యాయతలు, అనుబంధాల మధ్య సాగుతున్న వీరి జీవనంలో ఓ బోగస్ కంపెనీ వచ్చి చిచ్చు పెడుతుంది.


కష్ట పడకుండా డబ్బు సంపాదించొచ్చని ఆశపడి దాచుకున్న డబ్బును ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ కంపెనీ డబ్బు తీసుకుని జెండా ఎత్తేస్తుంది. దాంతో ఈ మధ్య తరగతి కుటుంబాలు రోడ్డున పడతాయి. ఈ సమస్యను చిరంజీవి ఎలా పరిష్కరించాడు? దానికోసం ఎంత దాకా వెళ్ళాడు? చివరికి ఏం జరిగింది? ఇలాంటి బోగస్ కంపెనీలను ప్రజలు నమ్మి ఎలా మోసపోతున్నారు? అనే అంశాలన్నీ ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.


ఇక ట్రైలర్ చివరలో చైతన్య రావు.." మహా అయితే ఏం చేస్తారు సార్.. కొడతారు కావచ్చు, చంపుతారు కావాచ్చు.. నాతోని చేతనైనంతవరకు కొట్లాడుతా సార్.. మధ్యతరగతివాడు తిరగబడితే ఎట్లుంటదో చూపిస్తా సార్!.." అని చెప్పే డైలాగ్ ని బట్టి సినిమాలో హీరో తనకు జరిగిన అన్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాడని స్పష్టం చేస్తోంది. మొత్తంగా ట్రైలర్ తోనే మంచి హై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మార్చ్ 15 న విడుదల


'షరతులు వర్తిస్తాయి' సినిమాకి కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. చైతన్య రావ్, భూమి శెట్టిలతో పాటూ నంద కిషోర్, సంతోష్ యాదవ్, దేవరాజ్ పాలమూరు, పద్మావతి, వెంకీ మంకీ, శివ కల్యాణ్, మల్లేష్ బలాస్త్, సీతా మహాలక్ష్మి, పెద్దింటి అశోక్ కుమార్, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని మార్చి 15న ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది.


Also Read : ఖాన్‌లతో కాలు కదిపిన మెగా పవర్ స్టార్ - 'నాటు నాటు' పాటకి స్టెప్పులు!