Shah Rukh Khan: బాలీవుడ్ బాద్‌షాగా పేరు తెచ్చుకున్న షారుఖ్ ఖాన్ ఖాతాలో ఇప్పటికే ఎన్నో రికార్డులు ఉన్నాయి. కొన్నేళ్ల వరకు ఫ్లాప్స్‌తో సతమతమయిన ఈ సీనియర్ హీరో.. గతేడాది బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్లతో గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు సౌత్ స్టార్లు రజినీకాంత్, ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ స్టార్లను సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్‌లను కూడా దాటేసి మరో రికార్డును సొంతం చేసుకున్నారు షారుఖ్. 2024లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న యాక్టర్‌గా నిలిచాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ రెమ్యునరేషన్ విషయమే హాట్ టాపిక్‌గా నడుస్తోంది.


రెండో స్థానంలో రజినీ..


ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం 2024లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న యాక్టర్‌గా నిలిచారు షారుఖ్ ఖాన్. సౌత్ స్టార్లను, బాలీవుడ్ స్టార్ హీరోలను వెనక్కి నెట్టి తను ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఒక్క సినిమా కోసం రూ.150 కోట్ల నుండి 200 కోట్ల మధ్య పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారట బాలీవుడ్ బాద్‌షా. రెమ్యునరేషన్ విషయంలో షారుఖ్ ఖాన్ తరువాతి స్థానంలో సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఉన్నారు. ఆయన ఒక్క సినిమాకు రూ.150 కోట్ల నుండి రూ.210 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారట. ఇక గతేడాది రజినీకాంత్ కూడా సక్సెస్ రూట్‌లోకి దూసుకొచ్చారు. ఎన్నో ఫ్లాపుల తర్వాత నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్’తో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. 


ప్రభాసే ఫస్ట్..


మరో సౌత్ స్టార్ హీరో అయిన విజయ్.. రెమ్యునరేషన్ లిస్ట్‌లో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఒక్క సినిమాకు రూ.130 కోట్ల నుంచి 200 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారట. ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్.. ఒక్క మూవీ కోసం రూ.100 కోట్ల నుండి 200 కోట్లు అందుకుంటూ టాలీవుడ్‌లోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోగా నిలిచాడు. ఇక ప్రభాస్‌తో సమానంగా బాలీవుడ్ సీనియర్ హీరో అమీర్ ఖాన్ కూడా రూ.100 కోట్లు నుండి 175 కోట్లను పారితోషికంగా తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించే హీరో సల్మాన్ ఖాన్. ఈ హీరో.. ఒక్క మూవీకి రూ.100 కోట్ల నుండి 150 కోట్లను రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. 


చివరి స్థానం ఆయనదే..


సల్మాన్ ఖాన్ తరువాతి స్థానంలో, తనకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్. ఈయన కూడా ఒక్క మూవీ కోసం రూ. 100 కోట్ల నుండి రూ.150 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నారట. 8వ స్థానంలో ‘పుష్ప’ యాక్టర్ అల్లు అర్జున్ ఉన్నాడు. ‘పుష్ప’తో ప్యాన్ ఇండియా పాపులారిటీ దక్కించుకున్న ఈ హీరో.. ఒక్క మూవీకి రూ.100 కోట్లు నుండి 125 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. ఆ తర్వాత స్థానంలో రూ.60 కోట్ల నుండి రూ.145 కోట్ల రెమ్యునరేషన్‌తో అక్షయ్ కుమార్ నిలిచాడు. చివరిగా అజిత్.. రూ.105 కోట్ల రెమ్యునరేషన్‌తో చివరి స్థానంలో నిలిచారు. ఇక బాలీవుడ్‌లో బిగ్ బిగా పేరు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్.. ఈ లిస్ట్‌లో లేకపోవడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


Also Read: సింగర్ అల్కా యాగ్నిక్‌కు అరుదైన వినికిడి సమస్య - ఈ వ్యాధి మీకూ రావచ్చు, ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!