Shah Rukh Khan Health Update: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తాజాగా వడదెబ్బ తగలడం వల్ల అహ్మదాబాద్‌లోని కేడీ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం షారుఖ్ పూర్తిగా కోలుకోవడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్టు సమాచారం. వడదెబ్బ, డీహైడ్రేషన్ వల్ల ఆసుపత్రిలో చేరిన ఈ సీనియర్ హీరో.. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్టు తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడం గురించి విని తన భార్య గౌరీ ఖాన్, క్లోజ్ ఫ్రెండ్ జూహీ చావ్లాతో పాటు తన భర్త జై మెహ్తా కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌ సీజన్ కావడంతో షారుఖ్.. తన టీమ్ కేకేఆర్‌కు సపోర్ట్ చేస్తూ అహ్మదాబాద్ వెళ్లారు. అక్కడే ఇలా జరిగింది.


కేకేఆర్‌కు సపోర్ట్‌గా..


తాజాగా షారుఖ్ ఖాన్ టీమ్ అయిన కోలకత్తా నైట్ రైడర్స్ (కేకేఆర్).. ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యింది. అందులో ముందుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో తలపడింది. ఈ ప్లే ఆఫ్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరిగింది. దీనికోసమే షారుఖ్ అక్కడికి వెళ్లారు. తనతో పాటు తన కూతురు సుహానా ఖాన్, చిన్న కుమారుడు అబ్రామ్, మేనేజర్ పూజా దడ్లానీ కూడా వెళ్లారు. వీరితో పాటు కేకేఆర్‌ను సపోర్ట్ చేయడానికి జూహీ చావ్లా, జై మెహ్తా, సుహానా క్లోజ్ ఫ్రెండ్స్ అయిన అనన్య పాండే, షనాయా కపూర్, నవ్య నంద, అగస్త్య నంద కూడా స్టేడియంకు వెళ్లారు. మొత్తానికి వారందరూ ఆశపడినట్టుగా కోలకత్తా టీమ్.. ప్లే ఆఫ్స్‌లో గెలిచి ఫైనల్‌కు చేరుకుంది.


అత్యధిక ఉష్ణోగ్రతలు..


మే 21న అహ్మదాబాద్‌లో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. 45.2 డిగ్రీలకు చేరుకున్నాయి. మే 22న ఇవి మరికాస్త పెరిగి 45.9 డిగ్రీలకు చేరుకున్నాయి. దాని వల్లే షారుఖ్ ఖాన్‌కు వడదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. గత కొన్నేళ్లలో షారుఖ్ మరెన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు. ఎన్నిసార్లు ఎన్ని సమస్యలు వచ్చినా అవేమీ పెద్దగా పట్టించుకోకుండా మళ్లీ మామూలుగా తన పనులు మొదలుపెట్టుకునేవారు. ఇప్పుడు కూడా అదే చేయనున్నారు షారుఖ్. తన టీమ్ అయిన కేకేఆర్.. ఫైనల్స్‌కు చేరుకుంది. ఆదివారం చెన్నైలో మరో టీమ్‌తో ట్రాఫీ కోసం తలపడనుంది. అక్కడికి కూడా షారుఖ్ ఖాన్ కచ్చితంగా వెళ్లాల్సిందే.


మునుపటి గాయాలు..


2011లో ‘రావన్’ సినిమా షూటింగ్ సమయంలో షారుఖ్ ఖాన్ భుజానికి గాయం అవ్వడంతో పాటు తన కాలి వేలు కూడా ఫ్రాక్చర్ అయ్యింది. అయినా కూడా ఎక్కువకాలం రెస్ట్ తీసుకోకుండా షూటింగ్ కంటిన్యూ చేశారు. 2014లో ‘హ్యాపీ న్యూ ఇయర్’ మూవీ షూటింగ్ సమయంలో సెట్స్‌లోనే షారుఖ్‌కు ఒక యాక్సిడెంట్ జరిగింది. దాని వల్ల తన తలకు, మొహానికి గాయాలయ్యాయి. ఆ విషయం బయటికి రాకుండా మూవీ టీమ్ జాగ్రత్తలు తీసుకున్నారు. 2016లో ‘ఫ్యాన్’ మూవీ షూటింగ్ సమయంలో తన మోకాలికి గాయమయ్యింది. తను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఇలా ఎన్నోసార్లు గాయాలపాలయిన కూడా షారుఖ్ ఖాన్.. వాటిని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళ్తూనే ఉన్నారు.


Also Read: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ పార్టీ.... రెండోసారి, ఏకంగా నీటిలోనే!